ముందుగా ఎందుకు పూజించాలి? బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు కనుక. ఈ మాట శ్లోకంలో మధ్యలో ఉంది. నాయకమణిలా.
అయితే ఒక సందేహం కల్గుతుంది. ఎవరికైనా బ్రహ్మజ్ఞానం కల్గిందంటే తనంతట తాను పొందలేడు. గురూపదేశాన్ని అనుసరించడం వల్ల అట్టివాడవుతాడు. ఉపదేశం పొందినంత మాత్రంచే సిద్ధి పొందలేడు. శ్రవణ మనన నిదిధ్యాసలున్నాయి. శ్రవణం అనగా గురువు నుండి ఉపదేశమును వినుట; మననమనగా దానిని గుర్తుపెట్టుకొనుట. నిదిధ్యాసమనగా ఆ తాత్పర్యము నందు లీనమై, ధ్యానమగ్నుడై, వినినదానిని అనుభవంలోకి తెచ్చుకొనుట, జ్ఞానం పొందాడంటే ఎవరినుండి విన్నాడని సందేహం కల్గుతుంది. అనగా ఎవరు గురువు?
మనం అనేక కథలనితని గురించివిన్నాం. చిన్నపుడు సూర్యభగవానుడే ఉపదేశించాడు. పాఠాలను నేర్చుకొన్నాడు. అది అంతాజ్ఞానం కాదు. ఇవన్నీ ఆత్మ జ్ఞానాన్ని బోధించేవి కావు. బుద్ధితో శాస్త్రాలను అభ్యసించాడు. నవవ్యాకరణాలను నేర్చుకొన్నాడు. బుద్ధి పదునెక్కింది. అందువల్ల బుద్ధిమతాంవరిష్ఠుడయ్యాడు. బుద్ధికంటే జ్ఞానం గొప్పదని అన్నాం. అతణ్ణి జ్ఞానిగా తీర్చిదిద్దిన వాడెవ్వడు?
ఆత్మజ్ఞానమే పరావిద్య. అన్ని శాస్త్రాలూ అపరావిద్యకు చెందినవి. పరాయనగా శ్రేష్ఠము. అపరయనగా తక్కువది. రామాయణ కథ అంతా ముగిసిన తరువాత, పట్టాభిషేకం పూర్తియైన తరువాత ఇతనికి జ్ఞానోపదేశమైంది.
రామసేవలోనే ఆంజనేయ ప్రభావం అంతా కన్పిస్తుంది. రామునకంతగా కైంకర్యం చేసినపుడు జ్ఞానోపదేశాన్ని పొందాడు. రామావతారం పూర్తి అయ్యే వరకూ రామునితో ఉన్నవాడు మరొకరి దగ్గరకు వెళ్లి ఉపదేశం పొందడం. కుదురుతుందా? కనుక రాముడే ఉపదేష్ట.
No comments:
Post a Comment