Tuesday 4 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (11)



రామాయణం సగం పూర్తయ్యే వరకూ హనుమ ఎవ్వరో తెలియదు. కిష్కింధకాండలో వస్తాడు. అప్పటినుండి నాయకుని కంటే ఇతనికే అధిక ప్రాధాన్యం వచ్చింది. తరువాత సుందరకాండ అంతా ఇతని వీర విహారమే. పారాయణ చేయవలసి వస్తే దానినే చేస్తారుగాని మిగతా కాండలను చేయరు. కదా! రామాయణ రథాన్ని నడుపుమని రాముడు, హనుమతో అన్నాడు. సీతా సమక్షంలో రామనామాన్ని జపించడం వల్ల సీత రక్షింపబడింది. రామనామం వల్లనే సముద్రాన్ని దాటగలిగాడు. లంకకు వెళ్లడం కష్టం. కాబట్టి సేతువును కట్టవలసి వచ్చింది.


ఏది చేసినా తాను చేసానని హనుమ, ఎన్నడూ భావించలేదు. ఇదంతా సీతారాముల కరుణ వల్లనే అనేవాడు. సముద్రం దాటడాన్ని లోకం ప్రశంసించింది. కాని తారక నామం వల్లనే కదా! ఆమె శోకాగ్ని లంకను దహించలేదా? అని భావించాడు. వాళ్ల పనులు తాను చేసినా వారి నామ ప్రభావం వల్లనే చేయగలిగానని మనసా భావించే వాడు. వారి ఋణం తాను తీర్చుకోలేనని బాధపడ్డాడు. చూసారా? అతని వినయాన్ని, మన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఎంతో ఉపకారం చేసాం. ఒక్కడూ కన్నెత్తి చూడడు, పన్నెత్తి మాట్లాడడని అనుకొంటాం. కాని సీతారాములు హనుమవల్ల; హనుమ సీతారాముల వల్ల బలాన్ని పుంజుకొన్నానని భావించడాన్ని గమనించారా? ఆంజనేయుని ఋణం తీర్చుకోలేకపోయామనే బాధపడ్డారు, సీతారాములు.


రామాయణం నుండి నేర్చుకోవలసిన నీతి ఇది. తనకు బలం రామునివల్ల అని హనుమ భావించగా అతనికి వినయమే అతనికి బలాన్నిచ్చింది. బలం, వినయం సాధారణంగా కలిసియుండవు, రెండూ ఇతనిలో ఉన్నాయి. మనలో రెండూ లేవు సరికదా, మాటి మాటికీ అహంకరిస్తూ ఉంటాం కూడా. హనుమ అట్టి వాటిని ప్రసాదించుగాక. 


No comments:

Post a Comment