Sunday, 9 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (16)



ఒక్కొక్కమాటు మనమనస్సు చాలా సోమరిపోతుతనంతో, ఉత్సాహం లేకుండా ఉంటుంది కదా. శక్తి - పదార్థాలలో శక్తి చైతన్యం. చిత్ నుండి చైతన్యం. అదే జీవనం; అదే బుద్ధి. జడం నుండి జాడ్యం. మానవ జీవితం చిత్-జడాలతో ఉంటుంది. (చిత్-జడగ్రంథి). ఇందు జీవం లేకపోతే (శివం) శవమే. ఈ జడమైన శరీరం, జీవంతో కలిసినపుడు జీవాత్మయని పిలువబడుతున్నాడు. అదే చిత్-జడగ్రంథి, శరీర భావన ఎప్పుడైతే అంతరించిందో అపుడు చిన్మయమే.


జడమైన శరీరంతో ఇది పనులలో ఎట్లా నిమగ్నం కావాలో చూద్దాం. పనులు చేసేటపుడు చురుకుగా ఉంటాం. జడంగా ఉండం. రాజకీయాలు, సినిమాలు, పిచ్చాపాటీ కబుర్లు, నవలలు, ఫలాహారశాలలు మొదలగు వాటి వల్ల మనకున్న శక్తిని ఖర్చుపెట్టడం వల్ల వృథా అయిపోయి సోమరిపోతులుగా మిగిలిపోతున్నాం. ఎవరైనా సైన్సు, ఆధునికమైన సదుపాయాలు సమకూర్చుకోవడం, సంఘసంస్కరణలు, హేతువాదం, విప్లవాలు మొదలగు వాటిని చర్చించేటప్పుడు చురుకుగానే ఉంటాం. కాని ధర్మం క్షీణించడాన్ని చూసి కూడా వాటిని పట్టించుకోము. అర్జునుడంత వానికే ఈ జాడ్యం పట్టుకొనినపుడు నపుంసకునిగా ప్రవర్తించవద్దని కృష్ణుడు హెచ్చరించాడు. క్లైబ్యం మాస్మగమః పార్థ అన్నాడు. ఇట్లా ధార్మిక కృత్యాల పట్ల జాడ్యం లేకుండా చేయుమని ప్రార్థిద్దాం.


మనదేశంలో 64 కళలున్నాయి. సాంకేతిక విద్య మొదలైన వాటికి చెందినవి ఉన్నాయి. అట్టివి ఈనాడు ఆచరణలో లేకపోయినా కనీసం వాటిని రక్షించుకోవాలనే తపన లేని కాలంలో ఉన్నాం. ఇదే జాడ్యం. అనేక గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఉన్నవాటిని రక్షించుకోవాలనే తపన లేని కాలంలో ఉన్నాం. ఈ సందర్భంలో స్వామి మనకు అజాడ్యాన్ని కల్గించుగాక. ఆయన బుద్ధి, బలం కలబోసిన మూర్తి కదా! ఎప్పుడూ ఉత్సాహవంతుడే. కార్యనిమగ్నుడే. అతని విగ్రహాలనుగాని, చిత్తరువులనుగాని చూస్తే తేటతెల్లమౌతుంది. పర్వతాన్ని మోసినట్లు, ఆకాశంలో సంచరిస్తున్నట్లు కనబడతాడు. సోమరితనం సున్న. అలసటలేదు. ధర్మంకోసం తపన. ఏ ఆటంకము వచ్చినా దాటుతూ ఉంటాడు. నెరవేరవలసినదానిని ఏమరుపాటు లేకుండా నిర్వహిస్తూనే ఉంటాడు.

No comments:

Post a Comment