Sunday, 2 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (09)



సీత ఎక్కడుందో రామునికి చెప్పడమే హనుమ చేసిన ఉపకారం. సీత ప్రాణత్యాగం చేసే సమయంలో రక్షించాడు. వారి వారి శక్తులను పోగొట్టుకొనే దశలో తిరిగి వారి వారి శక్తిని ప్రసాదించాడు.


ఇట్లా రెండు పనులెట్లా చేయగలిగాడు? ఇది రామనామ బలం వల్లనే.


ఎట్లా సముద్రాన్ని దాటగలిగాడు? రామనామం వల్లనే. సీతనెట్లా రక్షించగలిగాడు? ప్రాణత్యాగం చేసే సమయంలో ఆమె కాళ్ల మీదపడి, చేయవద్దని బ్రతిమాలాడితే మానివేస్తుందా? రావణుడే, ఈ వేషంలో వచ్చాడని భావించదా? మారీచుని నడవడికను చూసిన తరువాత అంతా రాక్షస మయంగా కన్పిస్తోంది కదా! ఆంజనేయుడు, బ్రహ్మచారి కావడంచే ఇతరుల మనస్సులను గ్రహించగలడు. ఆ దశలో ఏం చేసాడు? అప్పుడు రామనామాన్ని జపించాడు. రామనామం ఉచ్చరించిన వెంటనే రాక్షసమాయ, మటుమాయం కాదా? ఆమె శోకాగ్నిని రామ నామ ఉచ్చారణవల్ల కొంత తగ్గించగలిగాడు. అందువల్లనే ఆమె కరుణించడం వల్ల అగ్ని ఏమీ చేయలేకపోయింది ఇతనిని.


మేము ఆంజనేయుని ద్వారా రక్షింపబడినామని సీతారాములిద్దరూ అన్నారు. సంజీవనిని తీసికొని రావడం వల్ల లక్ష్మణుని ప్రాణము రక్షింపబడిందని అన్నారు. ఏ విధంగా ఇతని ఋణాన్ని తీర్చుకోగలనని సీతమ్మ నిరంతరం చింతిస్తూ ఉండేది.  

అయితే వారేమిచేసారో చూద్దాం. అయోధ్యలో రామపట్టాభిషేకం జరిగే సందర్భంలో రాముడెందరికో కానుకలనిచ్చాడు. సీతకు ముత్యాలహారమిచ్చాడు.

సీత అది గ్రహించి చేతిలో పెట్టుకొని రాముని వైపు చూసింది. వారి శరీరాలు భిన్నంగా ఉన్నా ఆలోచన ఒకటే కదా! అంజనేయుణ్ణి సత్కరించాలని భావించారు.


సీత యొక్క చూపుతోనే రాముడు గ్రహించి ఈ హారాన్ని హనుమకిద్దామని భావించాడు. బుద్ధి, వినయం, సాహసం, కలిగిన వానికి ఇమ్మన్నాడు. పేరు చెప్పలేదు. సీత గ్రహించి, హనుమకిచ్చింది.


ఇద్దరూ కలిసి ఈ సత్కారం చేసారు. ఆ హారం హనుమ శరీరంపై మేఘాలు చంద్రకాంతితో పర్వతాన్ని ఆక్రమించినట్లుందిట.

No comments:

Post a Comment