Monday 3 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (10)



ఋష్యమూక పర్వతంలో మొదటిసారి రాముడు హనుమను చూసినపుడు మిగిలిన కథనంతా హనుమయే నిర్వహిస్తాడని భావించాడు. హనుమంతుని సాయమున్నా సుగ్రీవుని భార్యను వాలి అపహరించుకొని పోయిన కాలమది. వాలిని ఓడించడానికి తగిన సాహాయ్య సంపత్తి రామునకుందో లేదో పరీక్షించి చూడుమని హనుమను దూతగా పంపాడు సుగ్రీవుడు. ఆ సందర్భంలో హనుమ, తనకుపకరిస్తాడని రాముడు భావించాడు. ఈ నాటకాన్ని నడిపేవాడు. రాముడే కదా!


మీరెవరని తెలిసికొనే సందర్భంలోని మాటలను బట్టి హనుమ యొక్క గొప్పదనాన్ని ఊహించాడు. ఇతడు మహావిద్వాంసుడు, గొప్ప వక్తయని గ్రహించాడు. బాగా మాట్లాడడమే కాదు, అనంత శక్తి సంపన్నుడని గ్రహించాడు. ప్రపంచం ఒక రథమైతే ఇతడు దానికి ఇరుసువంటి వాడని ఒకనాడు తెలిసికొంటామని రాముడే అన్నాడు.


ఋషిశాపం వల్ల హనుమకు తన శక్తి తెలియని కాలమది. అందువల్లనే ఇతని సాయమున్నా రాజ్యాన్ని, సుగ్రీవుడు భార్యను పోగొట్టుకొన్నాడు. అనతికాలంలో జాంబవంతుడు ఈ లోపాన్ని గుర్తించి హనుమకు తన శక్తిని తెలుసుకొనే వానిగా తీర్చిదిద్దుతాడని, హనుమ సముద్రాన్ని దాటుతాడని, లంకను దహిస్తాడని రామునకు తెలుసు. కొంతకాలం తరువాత ఇతని శక్తియుక్తులను తెలిసికొంటారని లక్ష్మణునితో అన్నాడు రాముడు.

రామాయణమే ఒక ప్రపంచం వంటిది. ఏడు కాండలతోనున్న రామాయణ రథం ఆగే సందర్భంలో సీతాపహరణం, ఆమె ఎక్కడుందో తెలియక పోవడం జరిగింది. హనుమను చూడడంతోటే రామాయణ రథానికి అతణ్ణి ఇరుసుగా భావించాడు. మరల రథం తిరగడం మొదలుపెట్టింది. సుగ్రీవుడు, వాలితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. తరువాత వాలి సంహారం, వానరులు సీతాన్వేషణకు బయలుదేరటం, సేతు నిర్మాణం, రామరావణ యుద్ధం, తరువాత పట్టాభిషేకం చకచకా సాగిపోయాయి. అన్నింటిలో హనుమపాత్ర గణనీయం.

No comments:

Post a Comment