Tuesday, 25 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (2)


ఆంజనేయ ఆవిర్భావం


ఒకప్పుడు మేరుపర్వత ప్రాంతమును పరిపాలించిన వానర వీరుడు కేసరి, మహా బలశాలి. పరాక్రమవంతుడూనూ- తనవారికి కొంగు బంగారం- వైరులతో సింహస్వప్నం! మూర్తీభవించిన ధర్మ మూర్తి. ఇతని ఏలుబడిలోని వారందరూ కలకాలం ఇతనినే తమకు రాజుగా- మహారాజుగా ఉండాలని కోరుకునేవారు.


దేవలోకాన 'పుంజిక స్థల' అను అప్సరస కలదు. సాటిలేని అందం ఆమెది. అందానికే అందాలు నేర్పే సోకులాడి. చంచల నేత్ర- చపల హృదయ, శాపకారణంగా మనుజ లోకాన జనించినది అంజనగా. కుంజరునకు దైవదత్తమైన కూమార్తైనది. పద్మ పత్ర విశాలాక్షి. తలిరాకుల సోయగం. మేని అందానికి తోడు ఆమె వేషధారణ ఆమెకు మరింత శోభను చేకూరుస్తూ- 'బంగారము నకు తావి అబ్బినటుల' ఉండేది.


కుంజరుడు. అంజనను, తన మేనల్లుడూ, మహావీరుడైన కేసరికిచ్చి వివాహం చేశాడు. ఈడూ జోడైన యీ ఆలుమగల సంసార యాత్ర సరాగాల రాగాల సాగింది.


ఎంతకాలానికి సంతతి కలుగలేదు. చింతాక్రాంతులయ్యారు అంజనా కేసరులు. ఎందరి మన్ననలో పొందిన వీరికి సంతానం లేని దిగులు- ఎవరితో చెప్పుకోలేనిదీ ఎవరూ తీర్చలేనిదీయైనది.


ఒకనాడు- సహజసిద్ధమైన పరమ సుకుమార లావణ్యంతో అపురూప సౌందర్యవతిగా వెలుగొందే ఆంజన- పూవునకు తావిలా శరీరానికి తగిన వస్త్రాలనూ, దివ్యాభరణాలనూ ధరించి- తనను, చూచువారి కనులు చెదరునట్లుగా వసంతయామిని వోలె పర్వత శిఖరాన నిలబడి చల్లగ వీచే పిల్లవాయువుల లాలనలో-ప్రకృతిలోని అందచందాలను పరికించు సమయాన మదిలో 'వీరమాతనైన బాగుండెడిది గదా!!" అన్న భావన వచ్చినది.

No comments:

Post a Comment