Monday 17 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (24)



ఇతడు కేవలం కల్పనలతో, ఊహలతో వ్రాసాడా? కేవలం స్వామి పట్ల భక్తితో వ్రాసేడు. స్వామితో ప్రత్యక్ష సంబంధమున్న అతని చరిత్ర చెబుతోంది. స్వామి యొక్క అంశతో పుట్టాడు. స్వామి నక్షత్రమైన మూలా నక్షత్రంలో ఇతడు జన్మించాడు.


పైన పేర్కొన్న శ్లోకం తులసీదాసు వ్రాసినదే. అది సుందరకాండకు మంగల శ్లోకం. రామాయణం ప్రాంతీయ భాషలో ఉన్నా మంగల శ్లోకాలు సంస్కృతంలోనే ఉంటాయి.


వాతజాతం నమామితో శ్లోకం ముగిసింది అనగా వాయుపుత్రుడని, వాతాత్మజుడని.


ఎందుకీ శ్లోకాన్ని పేర్కొన్నానో వివరిస్తాను ఇందు జ్ఞానినామ గ్రగణ్యం. అనగా జ్ఞానులలో శ్రేష్ఠుడని, అనగా బ్రహ్మజ్ఞానులలో, ఆత్మజ్ఞానులలో మొదటి స్థానం ఆక్రమించాడని అర్థం.


అతనికి బలం, ధైర్యం, నేర్పు, బుద్ధి, పాండిత్యం, అఖండ బ్రహ్మచర్యం ఉన్నవని తెలుసు. కాని అన్ని సుగుణాలను ధర్మకార్యాలలో వెచ్చించాడు. రామప్రీతి కోసమే. రామభక్తి సామ్రాజ్యంలో మునిగిపోయాడు. అట్లా కర్మఫలాన్ని ఆశించకుండా కర్మయోగిలా ప్రవర్తించాడు. అతడు భక్తియోగి కూడా. అయితే అతడు జ్ఞానయోగియని చాలా మందికి తెలియదు.


అతడు బుద్ధిమంతుడు కనుకనే బుద్ధిమతాం వరిష్ఠుడయ్యాడు. జ్ఞానం కంటే బుద్ధి, విలక్షణమైనది. అనేక రంగాలలో ఎందరో మేధావులను చూస్తాం. కాని అందర్నీ జ్ఞానులని అంటామా? బ్రహ్మ జ్ఞానం కలవానిని బ్రహ్మజ్ఞాని అంటాం. అతడు పరమాత్మ, జీవాత్మలు ఒక్కటే అనే జ్ఞానంతో ఉంటాడు. అట్టి జ్ఞానం కలగడానికి ఎన్నో శాస్త్రాలు చదవాలి. శాస్త్రాలను అర్థం చేసికోవడానికి బుద్ధి ఉపయోగిస్తుంది. అయితే ఆ బుద్ధి, ఆధ్యాత్మ జ్ఞానాన్ని సంపాదించడానికే వినియోగపడాలి. చాలా మంది మేధావులు ఇట్లా ఈ విషయంలో వినియోగించకుండా వారి వారి ప్రత్యేక రంగాలలో వినియోగిస్తారు. ఒకవేళ వేదాంత శాస్త్రంలో ప్రవేశపెట్టినా అది బౌద్ధికమైన చర్చకే పరిమితమౌతుంది. దానిని అనుభూతికై వినియోగించరు. అటువంటప్పుడు దానిని జ్ఞానమనలేము. అతడెంతో మేధావి కావచ్చు, నిజమైన అధ్యాత్మ జ్ఞానికాడు.

No comments:

Post a Comment