Monday 10 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (17)



అట్లాగే మనం మంచి పనులు చేయుటకు ఉద్యుక్తులం కావాలి. ఆటంకాలు వచ్చేటప్పుడు, అంతా కలియుగమని, కలిపురుషుడు తాండవిస్తున్నాడని అంటాం. ఒంటబట్టని అద్వైతాన్ని, మాయాప్రభావాన్ని నిరాఘాటంగా వ్యక్తీకరిస్తూ ఉంటాం. శంకరులిట్లా మాటిమాటికీ కలి ప్రభావం గురించి మాట్లాడారా? ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసికొన్నారు. తీర్థయాత్రలు, గ్రంథ రచనలు, వాదాలు మొదలైన వెన్నో చేసారు. క్రియాశీలురెవరంటే ఒకడు ఆంజనేయుడు, మరొకరు శంకరులు. చిట్టచివరి దశలో క్రియారాహిత్యమే అచలత్వమే ఉండాలి. మన లక్ష్యం మనస్సు చంచలంగా లేకపోవడం, సంకల్పరహిత స్థితి. కాని మనం శరీరాన్ని మంచి వాటికై కదపడం లేదు. అందువల్ల మనస్సు నానాతిరుగుళ్లు తిరుగుతోంది. అలసిపోయి నిద్రలోకి జారుకొంటున్నాం. సద్వినియోగం లేదు.


చాలా మంది పారాయణలు, భజనలు, ఉపవాసాలు, దేవాలయ సందర్శనాలు మొదలుపెడతారు. క్రమక్రమంగా వీటిపట్ల మోజు సన్నగిల్లుతూ ఉంటుంది. ఒక ప్రణాళికను రూపొందించడం వల్ల ఒకనాడు సామూహిక పూజా విధానాలుండేవి. అవి నేడు మచ్చుకు కనబడడం లేదు. అయితే ఒక క్లబ్బును స్థాపిస్తే అది దినదిన ప్రవర్ధమానమౌతుంది. ఇట్లా అన్నిటిలో అజాడ్యం.


ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆంజనేయుడు డీలా పడ్డాడా? పుట్టీ పుట్టగానే పండనుకొని సూర్యుని దగ్గరకే వెళ్లాడు. అక్కడ ఇంద్రుడు అడ్డుకొనడం, వజ్రాయుధం ప్రయోగించడం, తుదకితని హనువు చిట్లింది. అందువల్ల హనుమ అయ్యాడు. అంతమాత్రంచే నిరుత్సాహపడ్డాడా? ఆ సూర్యుని దగ్గరే నవవ్యాకరణాలను అభ్యసించాడు. ఉదయాద్రి నుండి అస్తాద్రికి పయనించే సూర్యునికి అభిముఖంగా ఉండి నేర్చుకోలేదా? చిన్నపుడే ఋషుల ఆశ్రమాల దగ్గరకు వెళ్లి చిల్లరమల్లర పనులు చేసాడు. వారు తట్టుకోలేక నీ శక్తి, నీకు తెలియకుండా ఉండుగాక అని శపించారు. రామ కార్యం వచ్చినపుడే నీ శక్తి, నీకు తెలుస్తుందని శాపానుగ్రహం ప్రసాదించారు. సుగ్రీవుని దగ్గరకు చేరాడు. ఇక్కడా ఆటంకాలే. వాలి సుగ్రీవునిపై దండెత్తాడు. ఇతడూరుకోక, వాలి రాలేని ప్రదేశంలో సుగ్రీవుణ్ణి ఉంచాడు. రాముడు రాగానే తన శక్తిని గుర్తించాడు. సముద్ర తరణం - పర్వతాన్ని పెకలించడం - లంకాదహనం - ఒకటేమిటి ఎన్నో పనులను నిర్వహించాడు.


No comments:

Post a Comment