రాయప్రోలు రథాంగపాణి గారు రాసిన పుస్తకమిది.
అభయం వరదం దోర్భ్యాం కలయే మారుతాత్మజం
శ్రీ మహాగణాధిపతయేనమః
ఓం నమో భగవతే వాయునందనాయ
హనుమత్సందేశం
అవతార విశిష్టత
సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణా|
వందే విశుద్ధ విజ్ఞానా కవీశ్వర కపీశ్వరౌ ॥
అనేకములైన పెద్ద పెద్ద కొమ్మలతో చాల దూరం విస్తరించి యున్న ఒక పెద్ద మఱిచెట్టును ఆశ్రయించి ఎందరో అనాధలు ఎండబారి పడకుండ తల దాచుకుంటారు. నానాజాతి పక్షులు నలు దిక్కులకు మేతకై వెడలి సాయం సమయాన ఆ చెట్టుకొమ్మలపై నివసిస్తుంటాయి. ఎవరికీ ఏ హానీ చేయని ఆ నోరులేని పక్షులను అదే చెట్టు ఊడల మాటున పొంచి కొందరు కిరాతులు తమకాహారంగా హింసిస్తారు. కొందరు రకరకాలైన జీవన సమస్యలతో పోరాడలేక నిరాశా నిస్పృహలకులోనై-ఆ చెట్టు ఊడలనే ఉరిత్రాడుగ చేసుకుని ప్రాణత్యాగం చేస్తారు. చిత్రం ఏమంటే వీరిలో ఎవరిని గుఱించీ అంటే తన చెంతన జరిగే హింస, ఆహింసల గుణించి ఇసుమంతైనా పట్టించుకోక ఆ మఱిచెట్టు తన పని తాను చేసుకుపోతుంది. ఇదే సృష్టి! ఇదొక సృష్టి రహస్యం !!
ఐతే మానవుడు మాత్రం యీ సృష్టిని తనకనుకూలంగా కావలసిన రీతిలో మార్చుకోవాలనే తపనతో మనసు నిలుపుకోలేక కష్టనష్టాల కడలిలో కొట్టుకుపోతూ సాయానికై పరితపిస్తున్నాడు.
దైవ సృష్టిలో తరతమ భేదాలు లేవు. పక్షపాతం లేదు. అందరూ సమానమే. అందరినీ ఒకేలా చూస్తాడు.
తనను తిరస్కరించినవానిని సైతం దగ్గరకు చేర్చుకుంటాడు. సేద దీరుస్తాడు. తన తప్పు తాను తెలుసుకుని బాగుపడాలనే భావనతో మానవునికి తోడుగా అవతార పురుషులను పంపుతాడు. ఒక్కో వేళ తానే అవతార మూర్తిగా అవతరిస్తాడు.
అట్టి మూర్తులలో హనుమన్మూర్తి ప్రతిభావంతమైనదీ, మహా మహిమాన్వితమైనదీనూ -----
ఆంజనేయస్వామివారి జనన, విద్యాభ్యాసాది విధానమంతా మానవజాతికి ఒక సందేశ కావ్యమే.
కేవలం స్వామివారి చరిత్రను చదివిన చాలదు. స్తోత్ర పారాయణాదులను పఠించినదానికన్న వారి సందేశమును ఆచరణలో చూపినవారి జన్మ నిజముగ ధన్యము. వారే స్వామికి విశ్వాస పాత్రులు. ఆ భావంతో.... ఇక చదవండి....
No comments:
Post a Comment