Sunday 30 May 2021

రాయప్రోలు రథాంగపాణి గారి హనుమత్సందేశం (6)



ఇదొక మహత్కార్యం. గొప్ప సాహసం. ఆంజనేయుడు బాలుడుగ నున్నపుడే తన ధైర్య, బల సాహసాలతో అద్భుత కార్య సాధనకు పూనుకున్నాడు. ఆ కార్యసాధనలో హనువుకు దెబ్బ తగి లినా సహించి సత్ఫలితాల నంది, భవిష్యత్కాలంలో బ్రహ్మవు కాగలవన్న వరాన్ని దాశరధి నుండి పొందినాడు. మరెన్నో అద్భుత కార్యాలు సాధించాడు.


విదిళించ నురుగు సింగపుకొదమయు 

మదనులినగండ కుంజరములపై 

నిది బలశాలికి నైజము కద 

తేజోనిధికి వయసు కారణమగునే.


తన శక్తి సామర్థ్యాలను ప్రకటించడానికి వయసుతో పని లేదు. అది సహజ స్వభావ సిద్ధం. దీనిని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులు తమ సంతానానికి ఉన్నత కార్యాలను సాధించు నేర్పు, ఉన్నత భావాలను గూర్చి తెలపాలేగాని అల్ప విషయాల పైకి మనసును పోనీయరాదు. ఇదే ఆంజనేయుని బాల్యం మనకు నేర్పే నీతి-రీతి.


మొక్కయి వంగనిది మానై వంగునా ?


సకల దేవతా వర ప్రభావం వలన అమిత బల సంపన్నుడైన బాల ఆంజనేయుని ఆల్లరి ఇంతింతనరానిదీ. సహింపరానిదైనది. ఓర్పుకే ఒక పరీక్షగా నిలిచినై ఆ అల్లరిచేష్టలు. మునులు, మహర్షులు, పరమర్షులు, పిన్నలు, పెద్దలు ఒకరేమిటి? వారు వీరు అన నేల ? ఆ ప్రాంత నివాసులందరు అంజనాసూనుని చేతిలో బాధలు పడినవారే. తమ కుమారుని అల్లరి భయంకర రూపు దాల్చుట అంజనా కేసరులకు దిగులు పుట్టించినది. ఏమి చేయాలో పాలుపోక చివరకు తపోధనులను ఆశ్రయించిరి. త్రికాల వేత్తలైన వారు దివ్య దృష్టితో బాలుని గమనించి ఇలా శపించిరి. "ఆంజనేయా! ఏ బల గర్వముతో మమ్ములను హింసించుచున్నావో ఆ శక్తి సామర్థ్యము లను మరచెదవు గాక! ఎవరైన నీ బలపౌరుషాలను గుర్తుచేసిననే గాని నీశక్తి నీకు గుర్తురాదు!" తదాది ఆంజనేయుడు అమాయకుని వోలె ప్రవర్తించ సాగెను. అది గమనించి తల్లిదండ్రులు బాలునికి విద్యాబుద్ధులు నేర్పింపదలచిరి. ఉపనయన సంస్కారముల గావించి విద్యాభ్యాసమునకై సూర్యునికడ కంపిరి.

No comments:

Post a Comment