Friday, 7 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (14)



శ్లోకంలో ముందుభాగమేమిటి? అందేముంది? వాయువేగం, మనోవేగమని చెప్పాడు. ఈ రెంటి వేగాలున్నవాడు. అంటే ఇతని ఇంద్రియాలు, మనస్సు వేగంగా తిరుగుతున్నాయని కాదు.


మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం 



ఇతనిలో మనోజవం, మారుతతుల్యవేగం రెండూ ఉన్నాయి. జవం అనగా వేగం. మారుతం గాలి. మంద మారుతం అంటాం. మారుతం యొక్క కుమారుడు మారుతి. భజనలలో వీరమారుతి, గంభీర మారుతి అని భజన చేస్తాం కదా.


కదిలే మనస్సు, కదిలే వాయువు వంటి వేగ సంపన్నుడైనా వాయు తనయుడే. వాతాత్మజుడే. ఆపైన వానర యూధ ముఖ్యుడు కూడా. ఇంకా ఏమని నుతిస్తున్నాం?


జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం


అంటే ఇంద్రియాలను జయించినవాడు. అంతేకాదు, ఆరవ ఇంద్రియమైన మనస్సునూ జయించినవాడు. అనగా కదిలే దానినీ.


అందువల్ల బుద్ధిమంతుడయ్యాడు. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడయ్యాడని 'బుద్ధిమతాం వరిష్ఠం'. బుద్ధి, మనస్సునకు లంగరు వేస్తుంది. మనస్సునకు పైన ఉండేది, నియమించేది బుద్ధి. అందువల్ల జితేంద్రియుడై బుద్ధిమతాం వరిష్ఠుడయ్యాడు.


బుద్ధిమంతుడంటే సరిపోదు. అతని కంటే పైవాడు, బుద్ధిమతాం వర అంతకంటే గొప్పవాడు బుద్ధి మతాం వరిష్ఠుడు. ఇద్దరుంటే అందొకర్ని వరీయ అంటాం. ఇంతకంటే గొప్పవాడు లేడన్నపుడు బుద్ధిమతాం వరిష్ఠుడని అంటాం. అంటే అతనితో ఎవ్వర్నీ పోల్చలేమన్నమాట.


జ్ఞానులలో (బ్రహ్మవిత్, బ్రహ్మ విద్వర, బ్రహ్మవిద్వరీయ. బ్రహ్మవిద్వరిష్టుడని అంటాం. అట్లా ఇతడు బుద్ధిమతాంవరిష్ఠుడు.

No comments:

Post a Comment