Saturday, 15 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (22)



ఇతనికి ముసలితనం బాధలేదు. ఉక్కు వంటి శరీరం. ఉత్తరదేశంలో ఇతణ్ణి బజరంగబలియని కొలుస్తారు. (వజ్రశరీరం). ఒకవేళ అతనికేమైనా రోగం వచ్చినా అది రామప్రసాదంగా భావిస్తాడని నేననుకొంటున్నా. ఈ జగన్నాటకంలో ధృతరాష్ట్రుడు, సూర్ దాస్ వంటివారు గ్రుడ్డివారుగా పుట్ట లేదా? మనవల్ల ఇతరులకు ఇబ్బంది కల్గించినా వారి కర్మను కొంత తొలగించామని భావించగలగాలి. వారు మనలను సరిగా చూడకపోతే మనకర్మను మనం పోగొట్టుకొంటున్నామని భావించగలగాలి. అట్లాగే అతడూ భావిస్తాడు. అంటే రోగం లేని హనుమకు రోగం వచ్చినా అట్లాగే తలంచే స్థితిలో ఉంటాడు.


ఇంతకూ సారాంశమేమిటి? ఇదంతా పైవాడు ఆడించే నాటకమని భావిస్తే. అంతా సంతోషమయంగా ఉంటుంది. సంతోషంగానే స్వీకరించగలగాలి. అట్టి మానసిక స్థితిని సంపాదిస్తే కష్టాలేమీ మనలను బాధించవు. నాటకాన్ని చూసి వినోదించునట్లుగా జీవితాన్ని అట్లా చూడగలగాలి. పరమపదంలోని సౌఖ్యం కంటే ఇట్టి భావన వల్ల కలిగిన ఆనందమే గొప్పగా ఉంటుంది. పరమపదంలో నవరసాలుండవు. ఈ లోకమే నవరసభరితం. ఇక్కడే చమత్కారం. భగవానుడెన్నో వేషాలు ధరిస్తున్నాడు కదా! అతడు కష్టాలు కల్గిస్తున్నాడా అని ప్రశ్నించుకోకుండా ఈ నవరస నాటకాన్ని చూసి సంతోషిద్దాం. ఇట్టి భావన మనలో పాదుకొలిపేటట్లు ప్రార్థిద్దాం.


అతనిలా మనం ఉండగలగాలి. ఎవరైనా మనకు నమస్కరిస్తే అతని మాదిరిగా చిరంజీవిగా ఉండాలని దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అనాలి.

No comments:

Post a Comment