Wednesday, 5 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (12)



మారుతి గొప్పదనం


'కోతి బుద్ధిరా' అంటూ ఉంటాం. కోతి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మపై దుముకుతుంది. కొద్ది క్షణాలు కూడా నిలకడగా ఉండలేదు. అట్లాగే అస్తిమితమైన మనస్సు కలవారిని అట్లా అంటాం.


హృదయకపిమత్యంత చపలం అని శంకరులన్నారు. పరమేశ్వరా! చంచలమైన ఈ కోతిని భక్తియనే త్రాటితో కట్టవయ్యా అని అన్నారు. దానిని తీసికొని పోయి ఆటలాడించి పొట్టపోసికో అని సరదాగా అన్నారు. చేతిలో కపాలం ధరించి బిచ్చమెత్తుకోవడం కంటే ఈ కోతితో ఆటలాడించి పొట్టపోసుకోవయ్యా, అంటూ 'హృదయ కపి'యని వాడారు.


పాశ్చాత్యులు కూడా మంకీ మైండ్ అంటారు. కోతి శరీరం, బుద్ధి, నిరంతరం కదులుతూనే ఉంటాయి.

ఆవుగాని, ఏనుగుగాని మాంసం తినకపోవడంలో ఆశ్చర్యం లేదు. ఆకలితో నున్న పులిగడ్డి మేయదని అంటారు. ఒకవేళ అది శాకాహారంతో ఉంటే ఆశ్చర్యపోతాం. 


ఆంజనేయుడు కపియై చంచల మనస్సుతో నున్న శరీరాన్ని ధరించాడు. కాని అతడింద్రియాలను, మనస్సును నిగ్రహించాడు. తన శరీరాన్ని, మనస్సును రామునకర్పించాడు. అక్కడే అతని గొప్పదనం దాగియుంది.


అయితే మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడానికి ఏ అరణ్యంలోనో తపస్సు చేసికొంటూకాలం గడిపాడా? ఎవరైనా ఏకాంతస్థలానికి వెళ్లి మనస్సును నియమించడానికి ప్రయత్నం చేయవచ్చు. అట్లాచేయక అందరి మధ్య ఉంటూ అన్ని పనులనూ చక్కబెట్టాడు. అసాధ్యసాధకుడయ్యాడు. సముద్రాన్ని దాటడం, సంజీవనీ పర్వతాన్ని తేవడం, లంకాదహనం మొదలైనవన్నీ మామూలు వ్యక్తులు చేయగలరా?


అయితే అతని మనస్సును ఎక్కడ ఉంచాడు? రాముని పాదపద్మాలపై.


No comments:

Post a Comment