Tuesday 18 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (25)



ఇతర మేధావులకంటే ఆంజనేయ స్వామి భిన్నుడు. వేదాంత శాస్త్రాన్ని జీర్ణం చేసికొన్నవాడు. అనుభవించినవాడు. స్వామితో ముఖాముఖి పరిచయమున్న తులసీదాసు అందుకే జ్ఞానినామగ్రగణ్యం అన్నాడు.


ఏమిటీ గొప్పలక్షణాలు? శ్లోకంలో, అతులిత బలధామమ్ = సాటి లేని బల పరాక్రమం కలవాడు; స్వర్ణశైలాభదేహం = బంగారు మేరు పర్వతంలా ధగధగా మెరిసే దేహం, శరీరానికి ఈ కాంతి, బ్రహ్మచర్యం వల్లనే. తరువాత దనుజవన కృశానుం = రాక్షసులనే అరణ్యానికి అగ్నివంటివాడు. తరువాత జ్ఞానినామగ్రగణ్యం అన్నాడు.


తరువాత అతని మనస్సు యొక్క ప్రత్యేకతను వివరిస్తున్నాడు. సకల గుణనిధానం = అన్ని మంచి గుణాలకు నిలయమైనవాడు. అందు తీక్షమైన బుద్ధి యొకటి. తరువాత వానరాణాం అధీశం = చంచలమైన కోతులను నియమించువాడు. జితేంద్రియ బ్రహ్మచారిగా. మనస్సనే కోతిని నియమించిన వాడనే అర్థంతో ఆలంకారికంగా తులసీదాసు పేర్కొన్నాడు.


ఇక రఘుపతి వరదూతం రాఘవునిదూత. వరదూతకు బదులు ప్రియభక్త అనే పాఠాంతరం ఉంది. ఈ మాటకు రెండర్థాలు చెప్పవచ్చు. రఘుపతి యొక్క ప్రేమను పొందినవాడని లేదా రఘుపతి ప్రీతిని కల్గినవాడనీ అర్ధం.


చివరగా వాతజాతం = వాయునందనుడు. అనగానే మన మెవరికి నమస్కరిస్తామో అతణ్ణి పేరునుబట్టి గుర్తిస్తాం కదా! నమామి = : నమస్కరిస్తున్నా.


No comments:

Post a Comment