Saturday 1 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (08)

జానకీశోకనాశనం 


అంజనానందనం వీరం జానకీ శోకనాశనం


అంజన అనే వానర స్త్రీకి పుట్టాడు. జన్మించి తల్లికి ఆనందాన్ని కల్గించాడు. అదేమంత గొప్పది కాదు. అందుకే కొడుకును నందనుడని పిలుస్తారు. ఆంజనేయుడు, అంజనా నందనుడు. దశరథనందనుడన్నట్లు, దేవకీనందను దన్నట్లుగా మన స్వామి, ఒక్క తల్లికేకాదు, తల్లులందరికీ తల్లియైన సీతమ్మ యొక్క శోకాన్ని పోగొట్టాడు. అందుకే అతణ్ణి కీర్తిస్తాం.


దుఃఖాగ్నిచే సీత, దహింపబడుతోంది. హనుమతోకను, రావణుడు నిప్పుపెట్టించాడని వింది. అసలు అగ్ని, లంకను కాల్చిందా? ఆ అగ్నికి మరొక అగ్నిని జోడించాడు హనుమ. అదే సీత యొక్క శోకాగ్ని, (శోకాగ్నికే మామూలు అగ్నిని చేర్చాడందాం)



యఃశోకవహ్నిం జనకాత్మజాయాః


ఆదాయతేనైవ దదాహ లంకాం


జనకాత్మజయనగా జానకి. శోకమనే నిప్పుతో ఉంది. 'శోకవహ్నిం'. ఆమె ఉంచబడినది, అశోకవనం లోపల. ఆమె లోపల ఉంది శోకవహ్ని. తేనైవ దానివల్ల; లంకాందదాహ = శోకాగ్నిచే లంకను కాల్చెను.


తోకకు నిప్పంటించినా తోక కాలలేదు. సీతానుగ్రహం వల్లనే అది కాలలేదు. అయితే లంక అంతా కాలడానికి సీతా శోకాగ్ని కారణమైనా, హనుమతోక చివరగానున్న అగ్నియే కాల్చిందని రావణుడు భ్రాంతి పడ్డాడు. తోకకు నిప్పంటించాలనే ఊహ రావణునకెట్లా వచ్చింది? ఈ ఊహ రావడానికి ముందే సీత యొక్క శోకాగ్ని చల్లారక అందువల్ల ఆమె బాధపడుతూ ఉంటే ప్రపంచమే భరించలేకపోయింది. అట్టిది కొంత ఖర్చు పెట్టబడాలి. ఎవరో ఒకరు ఆ శోకాగ్ని యొక్క తీవ్రతను సహించవలసి వస్తుంది. ఎవరు భరించగలరు? ఆంజనేయుడు తప్ప ఇతరులెవ్వరూ ఆ అగ్ని తీవ్రతను తట్టుకోలేరు. రావణుడితనిని శిక్షించాలని అనుకొన్నప్పుడు ఈ ఊహ తట్టి తోకకు నిప్పు పెట్టండని అన్నాడు. అదీ ఈశ్వర సంకల్పమే. అందువల్ల సీత యొక్క శోకాగ్నిని గ్రహించి దానితో లంకను కాల్చాడు. అది దుష్టులను కాల్చింది కాని శిష్ఠులను కాల్చలేదని గుర్తించండి. అందువల్లనే శోకాగ్ని, హనుమను కాల్చలేదు.


No comments:

Post a Comment