సముద్రాన్ని దాటేటపుడు సురస, సింహిక, లంకిణులు అడ్డుకోలేదా? సురసనోరు తెరవగా అందు చిన్న ప్రాణిలా ప్రవేశించి చెవి నుండి బయటకు రాలేదా? ఆమెను చంపగలడు. కాని స్వామికార్యం తొందర పెట్టడం వల్ల అది చేయలేదు. అది అజాడ్యం అంటే. దానికెంతో నిబ్బరముంచాలి.
మైనాకుడు సముద్రం నుండి లేచి విశ్రాంతి తీసికోవయ్యా అని ప్రార్థించినపుడు ముందు రామకార్యం చేయాలి. తరువాత చూద్దాంలే అనలేదా! ఇతని తోకకు నిప్పంటించినా పనిని మానాడా? ఎన్నో ఆటంకాలను గెంటివేసాడు.
ఇట్లా తన బుద్ధిని, బలాన్ని, ధైర్యాన్ని అజాడ్యాన్ని తన కోసం కాకుండా రామునికై వెచ్చించాడు.
అతడు బ్రహ్మచారి. సంసార బంధాలు లేవు. ముందు సుగ్రీవుణ్ణి, తరువాత రాముణ్ణి సేవించాడు. అతని నిస్స్వార్థబుద్ధి వల్లనే అతని గుణాలు రాణించాయి. చివరకు యశస్సు అనగా కీర్తి దక్కింది.
యశస్సు మినహాయించి మిగిలిన ఇతర లక్షణాలన్నీ రావణునకు, హిట్లరకూ ఉన్నాయి. వారు మంచిపనులు చేసారని యశస్సు లభించిందా? కనుక బలాదుల వల్ల యశస్సు రాదని గుర్తించండి. సంఘసేవలోనే యశస్సు.
సీతారాములిద్దరూ జ్ఞానోపదేశం చేసారు. సీతమ్మ ఏ ఉపదేశం ఇచ్చింది? ఎవరామె? సాక్షాత్తు పరదేవతయే కదా! ప్రేమతో ఉపదేశమిచ్చింది. రావణ వధానంతరం ఒక గంతువేసి సీతమ్మను బాధపెట్టిన రాక్షసస్త్రీలనందరినీ చంపుతానన్నాడు. అపరాధం చేయని వాడెవడైనా ఉన్నాడా? కావలసింది దయ. వారందరూ రాజాజ్ఞకు లోబడి అట్లా క్రూరంగా నాపట్ల ప్రవర్తించారు, వారి తప్పే ముంది? అని హనుమను సీతమ్మ వారించింది. విభీషణుడు రాజైతే వారే నాకు తిరిగి నమస్కరించరా అని పల్కింది.
అప్పటినుండి హనుమ దయామూర్తి అయ్యాడు. అయితే ఏదైనా చెడ్డపని జరిగినపుడు మాట్లాడకుండా ఉన్నాడని భావించకండి. పైపైన భీషణ వాక్యాలు పలికినా లోలోన ప్రేమ, దయలు తొణికిసలాడాయి.
No comments:
Post a Comment