Friday 21 May 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - హనుమ (28)



అవతారం యొక్క మొదటి ప్రయోజనం పూర్తికాగా రాముడు, చక్రవర్తియై వైదిక కర్మానుష్ఠానం ఎట్లాచేయాలో తన నడవడిక ద్వారా చూపించాడు. జ్ఞాన మార్గాన్ని అన్వేషించే ఋషులు వచ్చారు.


రాముడు జ్ఞాన స్వరూపుడని ఋషులకు తెలియనిది కాదు. వారితరుల మనస్సును పసికట్టగలరు. వారింతకు ముందు ఉపదేశం పొందినవారైనా, జ్ఞానులైనా సాక్షాత్తు జ్ఞాన స్వరూపుడైన రాముని నుండే తత్త్వోపదేశం పొందితే గట్టిపడడమే కాదు, జీవన్ముక్తులౌతారు కూడా.


ఉపదేశించడానికి రాముడూ ఇష్టపడ్డాడు. బ్రహ్మవిద్య గురించి ఆనందించేవారు, ఇతరులతో ఆ ఆనందాన్ని పంచుకోరా? రాముడెవరినుండి నేర్చుకోనవసరం లేదు. మానవునిగా అవతరించాడు కనుక ఇతరులకు ఆదర్శంగా ఉండడం కోసం తాను గురువును సేవించాడు. వసిష్ఠుని నుండి ధనుర్విద్య మొదలైన వాటితో బాటు వేదాంతాన్ని అభ్యసించాడు. ఆ గురు శిష్యుల ఉపదేశానికి చెందిందే యోగ వాసిష్ఠమనే గ్రంథం. దానిని జ్ఞానవాసిష్ఠమని అనడం సబబు. అన్ని సాధనమార్గాలూ యోగమార్గానికి చెందినవి. కర్మయోగ, భక్తియోగ, జ్ఞానయోగాలు. కానీ యోగం అంటే ప్రసిద్ధమైన పాతంజల యోగశాస్త్రమని తలుస్తాం. కాని మన గ్రంథము, అద్వైతజ్ఞానికి చెందింది.


తాను నేర్చుకొన్నది ఇతరులకందించాలి. దానివల్ల ఉపదేశించే వానికీ తృప్తికల్గుతుంది. రామునకూ అందించాలనే ఉత్సాహముంది. రావణ వధానంతరము వీలుచిక్కింది. అపుడు ఋషులు వచ్చారు. అయినా వినయ భరితుడైయున్నాడు. తాను క్షత్రియుడు, బ్రాహ్మణ ఋషులకు ఉపదేశించడమా అని సందేహించాడు. ఆపైన వయస్సులో ఋషులు పెద్దవారై యున్నారు. బ్రహ్మవిద్య చెప్పాలని ఉన్నా తిన్నగా మాత్రం వారికి ఉపదేశించలేదు. 


అపుడిట్లా భావించాడు. ఇంద్రియాలను పూర్తిగా జయించిన ఆంజనేయుడిక్కడ ఉన్నాడు కదా! జ్ఞానం గురించి అతనికి తెలియకపోయినా అతనికి మోక్షప్రాప్తి ఖాయమని తెలుసు. అయినా జ్ఞాన మార్గాన్ని అందించాలని ఉపక్రమించాడు. ఇంత కంటే మరొక శిష్యుడు దొరుకుతాడా? కనుక ఇతణ్ణి ముందు పెట్టుకొని తత్త్వోపదేశం చేయాలనుకొన్నాడు. ఇక్కడున్న ఋషులూ వినవచ్చు అని భావించాడు.

No comments:

Post a Comment