శ్రీ రాముని స్మరణము చేత, ఆయన దూతయైన హనుమానుని ఎదురెదురుగా చూచుట చేత విభీషణుని స్థితి విచిత్రముగా ఉండింది. ఆయన నేత్రములు ప్రేమాశ్రువులతో నిండిపోయాయి, శరీరము పులకించింది. కంఠము రద్ధమయ్యింది. ఎట్లో తన్ను తాను సంబాళించుకొని అతడిట్లా పలికాడు - ' ఆంజనేయా! నేను రాక్షస రాజైన రావణుని సోదరుడను, నన్ను విభీషణుడంటారు. నేడు నీ దర్శనము చేత నా జన్మ ధన్యమైనది. నేనీ రాక్షసనగరమున దంతముల నడుమ నున్న నాలుకవలె జీవితాన్ని గడుపుతున్నాను. పవనపుత్రా! నేను రాక్షసకులమున జన్మించిన తామస పకృతిగల జీవిని. నా వలన ఎట్టి భజనము జరుగుట లేదు. శరణశరణుడు, భవాబ్ధిపోతయైన ఆ భగవానుని చరణములపై నాకు ప్రేమ కూడా లేదు. దయాళువైన శ్రీరాముడెప్పుడైన దీనుడు, హీనుడు, అసహాయుడు, అనాథుడైన ఈ విభీషణునిపై దయజూపగలడా! సురముని సేవిత చరణ కమలముల యొక్క పవిత్రమైన రజఃకణము నాకు కూడా ఎప్పుడైనా లభిస్తుందా? భగవత్కృప లేనిదే సత్పురుషులు దర్శనము లభించదని నాకు దృఢమైన విశ్వాసమున్నది. ఈనాడు కరుణామయుడైన శ్రీ రాముడు నాపై కృపజూపినాడు. కనుకనే నీవు దయతో అధముడైన నా ఇంటికి దయచేసావు.
భక్తులపై దయ చూపు హనుమానుడు భక్తుడైన విభీషణుని భగవత్రీతిని చూసి పులకితగాత్రుడయ్యాడు. ఆయన విభీషణునితో ఇలా పలుకసాగాడు - 'విభీషణా ! నీవు గొప్ప అదృష్టవంతుడవు. యోగీంద్రులకు, మునీంద్రులకు కూడా లభించని కరుణావతారుడైన శ్రీ రాముని భక్తి నీకు సహజముగానే లభించినది. శ్రీరాముని దృష్టిలో జాతి కుల లింగ భేదము లేదు. ఆయన కేవలము నిర్మలహృదయమును, శుద్ధ ప్రేమ కోరుతాడు. ఈ ప్రేమచే ఆయన భక్తులకు అమ్ముడు బోతాడు. వారి వెంటబడును. నా విషయమును గురించి ఆలోచించు. నేను ఏ శ్రేష్ఠవంశములో జన్మించాను ? అన్ని విధాలు నేను చంచలుడను, నీచుడైన వానరుడను. ఎవడైన ప్రొద్దుననే మా నామాన్ని వింటే అతడి ఆ దినమంతా ఉపవాసముండాలి. అట్టి నీచ కులమున జన్మించిన నా పైగూడ భక్తవత్సలుడైన ఆ భగవానుడు దయ చూపినాడు. ఆయన నన్ను స్వజనునిగా, స్వేకునిగా అనుగ్రహించాడు. నీవు స్వామినే సర్వస్వముగా భావించుచున్నావు. నిశ్చయముగా నీపై ఆయన తన అద్భుతమైన కృపను ప్రసరింపజేస్తాడు. నీవు గొప్ప భాగ్యవంతుడవు. ఈ అసురపురములో నీవంటి భాగవతోత్తమునితో నాకు పరిచయము లభించుట నా అదృష్టము. శ్రీరఘునాథచంద్రుని కృపా విశేషమే నీ దర్శన భాగ్యము”.
శ్రీ రాఘవేంద్రుని దివ్యగుణగానములో ఆ ఇర్వురు భక్తులు మైమరచిపోయారు. వారికి సమయము గాని, శరీరజ్ఞానము గాని తెలియరాలేదు. ఇరువురి శరీరములు పులకించాయి. నేత్రములు ప్రేమాశ్రుపూర్ణములయ్యాయి. వారిద్దరూ ఒకరికొకరు సన్నిహితులై సౌఖ్యవంతులు, సంతుష్టులు, ఆనంద విహ్వలురయ్యారు.
No comments:
Post a Comment