Thursday, 29 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 206 వ భాగం



జ్ఞానియైన పంచముడూ గురువే


ఒక ఉదయం శంకరులు శిష్యులతో గంగా స్నానానికై బయలుదేరారు. దారిలో ఒక చండాలుడు ఎదురయ్యాడు. ప్రక్కకు తొలగమని అడుగగా చండాలుడు ఇలా అన్నాడు.


"అన్నమయా దన్నమయం, అథవా చైతన్యమేవ చైతన్యాత్

ద్విజవర! దూరీకర్తుం వాంఛసి, కింబ్రూహి గచ్ఛ గచ్చేతి".


- మనీషా పంచకం


అనగా "ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ! దేనిని ప్రక్కకు తొలగమంటున్నావు? అన్నం తినే శరీరం దగ్గరకు మరొక శరీరం రాకూడదంటావా? లేదా రెండు శరీరాలలోనూ ఉండేది చైతన్యమే. నీ చైతన్యం దగ్గరకు పంచముని శరీరంలోని చైతన్యం రాకూడదంటావా?"


"ఉన్నది ఒక చైతన్యమే. శరీరాలు భిన్నంగా ఉండవచ్చు. ప్రాణం ఒక్కటే. నీ వేదాంతం, పెక్కు ఆత్మలున్నాయని చెబుతోందా? అందువల్ల రాకూడదంటోందా? ఎవరి శరీరమైనా మాంసం, చర్మం, ఎముకలతో నిర్మింపబడిందే కదా! లోనున్నదంతా మురికియే. శరీర భావనయే వేదాంతికి ఉండకూడదు. జ్ఞానమార్గం బోధించేవాడు మరొకణ్ణి పొమ్మనడం ఏమిటి?" 


బ్రహ్మ జ్ఞానం వల్ల పండితుడని, కేవలం చదవడం వల్ల కాదని గీత అంది:


Wednesday, 28 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 205 వ భాగం

 


ఎందరో విద్వాంసులు నీ దగ్గరకు వస్తారు. ఏదో పుస్తకం వ్రాసి ఊరుకోవడం కాదు, ఎందరినో నీవు ఉద్ధరించాలి కనుక, మరల 16 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని పొడిగిస్తున్నానని వ్యాసుడు అన్నాడు. నీవు దిగ్విజయం చేయాలి. నీవల్ల ధర్మోద్ధరణ జరగాలని ఆయుర్దాయాన్ని పొడిగించే బ్రహ్మను ఆ పనికి పురమాయించాడు. ఈశ్వర అవతారానికి నేను ఆయుర్దాయం పొడిగించడమేమిటని, ఎంతకాలం ఉండదలచుకుంటే అంతకాలం ఉండుగాక అని బ్రహ్మ చెప్పుగా ఇద్దరూ అంతర్ధానమయ్యారు.


ఇట్లా కాశిలో వీరుండగా భాష్యోపదేశము, పద్మపాదుడు శిష్యుడగుట, వ్యాస శంకరుల చర్చ, వీరి ఆయుర్దాయం పొడిగింపు మొదలైనవి జరిగాయి. మరో సంఘటనను వివరించే ముందు పద్యపాదుల పూర్తి వృత్తాంతం వినిపిస్తా.


పద్మపాదుల గురించి


సనాతనుడు, పద్మపాదుడెట్లా అయ్యాడు? ఒకనాడితడు, గంగకు అవతలి ఒడ్డున ఉన్నాడు. శంకరులు స్నానం చేస్తున్నారు. వీరి పొడిబట్టలతనిదగ్గర ఉన్నాయి. ఇతని అచంచల భక్తిని లోకానికి తెలియజేయడం కోసం పద్మపాదా! బట్టలు తీసుకొని రా అని సంజ్ఞ చేసారు. గంగ, వేగంగా ప్రవహిస్తోంది. ఆ పైన లోతుగా ఉంది. గురువు యొక్క మాట వినీవినగానే తడుముకోకుండా నేల మీద నడిచినట్లే నీటిపై నడవడం మొదలు పెట్టాడు. నీళ్ళున్నాయని కాని, నది దాటడానికి నావ కావాలని కాని, ఆలోచించలేదు. ఇతని భక్తిని

చూసి పరవశించిపోయి, గంగ, అతని పాదాల క్రింత తామరలను మొలిపించిందట. అంటే ఇతని పాదాలు పద్మాలపై ఉన్నాయన్నమాట. గంగను దాటి గురువునకు వస్త్రాలనర్పించాడు. ఎట్లా దాటావని శంకరులు ప్రశ్నించారు. ఎవరిని స్మరిస్తే సంసారమనే సముద్రమే మోకాలి బంటిగా మారుతుందో, అట్టివారి పనులకు గంగ, ఆటంకంగా ఉంటుందా? అని జవాబిచ్చాడు. అప్పటి నుండి అతనికి పద్మపాదుడనే వ్యవహారం.


Tuesday, 27 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 204 వ భాగం



నేను గంగా తీరంలో ఉండగా మీకేదో కీడు జరిగిపోతోందని అనిపించింది. వెంటనే ఇక్కడ నాకు తెలియకుండానే కనబడ్డానని అన్నాడు.


నాకు నృసింహపదేశం ఉందని, అది జపిస్తూ తపస్సు చేస్తున్నప్పుడు స్వామి బోయకు కనపబడిన విషయం, తనకు అవసరం వచ్చినపుడు సాక్షాత్కరిస్తానని స్వామి అపుడు చెప్పిన విషయం గురువునకు చెప్పి పద్మపాదుడు - స్వామికి ఆచార్యులకు ప్రణామాలు అర్పించాడు.


వ్యాసునితో చర్చ - ఆయుర్దాయం పొడిగింపు


బ్రహ్మ సూత్రకర్తయైన వ్యాసుడు, శంకరులు వ్రాసిన సూత్రభాష్యం వ్యాప్తి చెందాలని, సరియైన అర్ధం, అందరికీ తెలియాలని, ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి అనేక ప్రశ్నలను సంధించాడు. సమాధానానికి సంతోషించినా మాటి మాటికీ అడ్డుకొనేవాడు. వితండవాదం చేసేవాడు. వాదం అంటే ఋజుమార్గంలో వాదించడం. జల్పం అంటే అడ్డదిడ్డంగా వాదించడం. ఇక వితండమంటే అవతలివాణ్ణి తప్పు పట్టడంలోనే తృప్తి కాని, తన సిద్ధాంతం అంటూ ఏదీ చెప్పకపోవడం.


ఇట్లా రోజులు దొర్లిపోతున్నాయి. పద్మపాదుడు తన అలౌకిక శక్తితో వచ్చినవాడు వ్యాసుడని గ్రహించి అతడు నారాయణుడేయని, తన గురువు సాక్షాత్తు శంకరావతారమేనని, కింకరులమైన మేమేమి చేయగలమని ఒక శ్లోకం చదివాడు.


"శంకరః శంకరః సాక్షాత్, వ్యాసో నారాయణో హరిః

తయోః వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం" 


ఇట్లా వారిద్దరికీ నమస్కరించాడు. మీ నిజ రూపాలను చూపించండని ప్రార్ధించాడు. వ్యాసుడు ప్రత్యక్షమై ఎందుకిట్లో వాదించానంటే ఎవరే ప్రశ్నలు వేసినా అన్నిటికీ నీ భాష్యం సమాధానం చెప్పగలగాలని, నేను దీనిని సంపూర్ణంగా అంగీకరించానని తన ఆమోదాన్ని, ప్రమోదాన్ని తెలిపాడు.


Monday, 26 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 203 వ భాగం



హంతపై దయ


ఏ సందర్భంలో ఆ నృసింహుడు పద్మపాదుల ఎదుట అవతరించాడో చెబుతా.


ఒక ప్రముఖ కాపాలికుడున్నాడు. పచ్చి మాంసం తినేవాడు, నరబలులిచ్చేవాడు. అట్టి కాపాలికులను ఎందరినో సాత్విక మార్గంలో శంకరులు పెట్టారు. కాని అట్టివారు వీరి వాదాన్ని అంగీకరిస్తారా? ఈ కాపాలికుడు శంకరుల వంటివారిని బలియిస్తే శివుడు, ప్రత్యక్షమౌతాడని భావించాడు. ఒక ఆత్మజ్ఞానిని గాని, లేదా ఒక రాజును గాని బలియిస్తే తన కోరిక నెరవేరుతుందని, రాజును బలియీయడం కుదరదు కనుక, మీరు కరుణామూర్తులు కనుక మిమ్ములనడుగుతున్నానని శంకరులతో అన్నాడు.


ఈ శరీరాన్ని అర్పిస్తే మరొకరికి ఈశ్వర సాక్షాత్కారం లభిస్తే ఇంతకంటే కావలసిందేముంది? ఎండుకట్టె ఉపయోగపడడం లేదా? చనిపోయిన జంతువు యొక్క కొమ్ము, ఏనుగు దంతమూ ఉపయోగిస్తున్నాయి. జంతువుల చర్మాలు ధ్యానానికి ఉపయోగిస్తున్నాయి. చనిపోయిన మానవ శరీరం మాత్రం ఎవ్వరికీ ఉపయోగపడడం లేదు. నా శిష్యులకు తెలియకుండా నేను ఏకాంతంగా ఉన్నపుడు నీ పని నీవు చేసుకోవచ్చని శంకరులన్నారు.


కాపాలికుడు శంకరులు ఏకాంతంగా ఉన్నపుడు కత్తి నెత్తాడు. ఎక్కడో ఉన్న పద్మపాదునకు, గురువునకు ఏదో ఆపద వస్తోందని అనిపించగా అతణ్ణి నృసింహుడావహించి ప్రత్యక్షమయ్యాడు. నరసింహస్వామి, ఆ కాపాలికుని సంహరించాడు. ఏమిటి నీకు నృసింహ ఉపదేశం ఉందా? అని ప్రశ్నించారు శంకరులు.


Sunday, 25 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 202 వ భాగం



పద్మపాదుల వృత్తాంతం


శంకరులు, కాశిలో ఉండగా పద్మపాదుడు కలిసాడు. అప్పటికింకా శంకరులకు 16 సంవత్సరాలు నిండలేదు. పద్మపాదుని అసలు పేరు సనాతనుడు. చోళ ప్రాంతానికి చెందిన వాడు. అతనికి చిన్నపుడొక వృద్ధుడు నృసింహ మంత్రాన్ని ఉపదేశించాడు. దానిని జపించి స్వామి యొక్క సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నాడు. ఇంటిని విడిచి కొండ శిఖరం ఎక్కి తపస్సు చేస్తూ ఉంటే ఒక బోయవాడు వచ్చి జంతువులు తిరిగే ఈ ప్రదేశంలో ఉన్నారేమిటి, ప్రమాదకరం, వద్దని అన్నాడు.


తపస్సనేమాట అతనికి అర్ధం కాదనుకుని సింహం యొక్క ముఖం, మిగిలినదంతా మానవ శరీరం కలిగిన మృగం కోసం వెదుకుతున్నానని అది కావాలని అన్నాడు.


“మీరు నిజం మాట్లాడుతున్నారా? అటువంటిదానిని నేనెపుడూ చూడలేదే, అది యుండడం సత్యమైతే నేను తీసుకుని వస్తానని బోయ అన్నాడు. సనాతనుడు నవ్వాడు. ఇతడు దూరంగా పోతే తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందని భావించాడు. "నీ పని నీవు చూచుకోవయ్యా రేపు సాయంకాలం లోపుగా తీసుకొని వస్తా కాకపోతే ఉరి పోసుకుని చనిపోతా" అంటూ బోయ బయలుదేరాడు.


ఆ నిష్కపటియైన ఆటవికుడు అడవిలో వెదకటం మొదలు పెట్టాడు. గడువు తీరిపోతోంది. ఇక తాను ఉరి పోసుకుని చనిపోవాలని నిర్ణయించి సిద్ధమయ్యాడు. ఇంతలో నృసింహమూర్తి సాక్షాత్కారించాడు. ఆయనను త్రాటితో కట్టి బోయ పద్మపాదుని ముందుంచాడు. "చూడండి స్వామి మీరడిగిన జంతువును తెచ్చాను" అని బోయ అంటున్నా పద్మపాదునకు, ఆ మూర్తి కనబడలేదు. ఇది భ్రాంతా? బోయ, అబద్దం చెబుతున్నాడా? అని వితర్కించాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనేగాని లభించని దివ్య దర్శనం, ఈ బోయకు లభించిందని బాధపడుతూ ఉంటే ఒక అశరీరవాణి వినిపించింది. అవసరమైనపుడు, నీకు సాక్షాత్కారిస్తానులే అనే మాట వినబడింది.


భగవానుడు, నిష్కపటియైన బోయకు చిక్కాడు.


Saturday, 24 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 201 వ భాగం



స్తోత్రాలలో నిర్గుణ బ్రహ్మమే సగుణ సాకార బ్రహ్మమౌతుందని అన్నారు. అనగా రూపం లేనివాడు, సత్త్యాది గుణాలు లేనివానిని రూపవంతునిగా, కల్యాణ గుణాలు కలిగినవానిగా ధ్యానిస్తున్నామని అర్ధం. గోవిందాష్టకంలో కృష్ణుని బాల్య లీలలను వర్ణిస్తూ నిష్క్రియుడైన పరబ్రహ్మమిట్లా అవతరించిందని అన్నారు. దీని ఆరంభమే సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం అనే పదాలతో ఉంటుంది.


విష్ణు సహస్రనామాలకు భాష్యం వ్రాస్తూ నిర్గుణము, సగుణము, భక్తి, జ్ఞానమూ ఒక్కటే అని ప్రతిపాదించారు.


అద్వైతము, భక్తి ఎట్లా కలిసాయో చూడండి. లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం ఉంది. కాని ఇది వీరి కరావలంబ స్తోత్రం అంత ప్రచారాన్ని పొందలేదు. దీనిలో ఒకచోట ఇలా అన్నారు. ముఖంలో బొట్టు లేదని గుర్తించామనుకోండి. దానికి మనమేమి చేస్తాం? అద్దం మీద గుర్తు పెడతామా? అట్లా చేస్తే అద్దం, మురికిగా ఉండదా? ఏం చేయాలి? మన ముఖానికి తిలకం పెట్టుకుంటే ప్రతిబింబంలోనూ కన్పిస్తుంది కదా! అట్లాగే ఒక చైతన్యం యొక్క ప్రతిబింబమే ఈ జగత్తంతా మాయవల్ల భిన్నంగా కన్పిస్తోంది. అలంకరించుకోవాలంటే ఆ తిలకాన్ని నీవు తీర్చిదిద్దుకోవాలి. లోనున్న ఆత్మకు, ఇంద్రియాలూ, శరీరం, ప్రతిబింబాలవంటివి. వీటినే అలంకరిస్తే అద్దాన్ని మురికిచేసినట్లింతుంది. అయితే లోనున్న చైతన్యానికి అలంకరించడం ఎట్లా? అది లోపల ఉన్నట్లు నాకు తెలియలేదంటావా? లక్ష్మీ నరసింహమూర్తి ఆకారంలో ఉన్నాడు. అతణ్ణి నిరంతరం భజించు, ధ్యానించు. అట్లా అతణ్ణి అలంకరిస్తే అతనికి కల్యాణం చేస్తే మనకే కల్యాణం, శుభం, ఆనందం కల్గుతాయి. పరమేశ్వరునిలో నున్న కల్యాణ గుణాలను భావిస్తే నీవే కల్యాణ గుణ సంపన్నుడవౌతావు.


అయితే అన్ని స్తోత్రాలకు భిన్నంగా దక్షిణామూర్తి అష్టకాన్ని వ్రాసేరు. అందు భగవల్లీలలుండవు. అంతా వేదాంత తత్త్వం ప్రతిపాదకంగా ఉంటుంది. ప్రతి శ్లోకం చివర "శ్రీ గురుమూర్తయేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అని యుంటుంది.


వీరి భజ గోవింద స్తోత్రం, అంతా భక్తి జ్ఞానాలను అందిస్తుంది. 


అందువల్ల ఇంతకు ముందున్న మార్గాన్నే మరల ప్రతిష్టించారు గాని క్రొత్త దానిని చెబుతున్నానని అనలేదు. క్రొత్త మత స్థాపకుడనని జబ్బలు చంచలేదు.

Friday, 23 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 200వ భాగం



మూడు మార్గాల స్థాపకులు


జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలలో కూడా ముందు కర్మానుష్టానాన్ని చేయాలని, వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలని అన్నారు.


సమత్వం అనే పేరుతో భౌతిక జీవనానికి ప్రాధాన్యం ఇచ్చే నేటి సంస్కర్తల వంటివారు కాదు. పనులలో సమత్వానికి పాటుబడుతున్నాం. మనసులలో అట్టి భావన మనకుందా? అని ఆలోచించండి. ఉంటే ఈ ద్వేషాలు, యుద్ధాలూ ఉంటాయా? శంకరులన్నది ఏమిటి? గత జన్మల సంస్కారాల వల్ల కర్మలు రకరకాలుగా ఉంటాయని, వాటినన్నిటినీ ఏకం చేస్తే రోగికి, పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్లవుతుందని అన్నారు. అందరూ పై మెట్టు ఎక్కవలసినవారే. అది క్రమక్రమంగా సాగాలి. ముందు భావనలో అంతటా ఒక చైతన్యముందని, ప్రేమతో పరికిస్తే, ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అనే భావం పనికిరాదని, క్రియలలో తేడాలుంటాయని, అందరూ ఒక పనికి ఎగబడరాదని అన్నారు.


"భావాద్వైతం సదాకుర్యాత్, క్రియాద్వైతం నకర్హిచిత్" అనగా భావంలోనే అద్వైతంగాని, క్రియలలో కాదని స్పష్టంగా చెప్పారు. అసలు అద్వైతం అంటేనే నిష్క్రియత్వం కాని ఈనాడు అంతా తలక్రిందులైంది. మనకు భావ సమైక్యం లేదు. బాహ్యంగా అంతా ఒకటని భ్రమిస్తున్నాం. వేదాల ఆదేశాన్ని అనుసరించి ఆయా వ్యక్తులు, కర్మలు చేయాలన్నారు. ఉన్న సిద్ధాంతాన్నే పునరుద్ధరించారు. ఇట్లా కర్మ, జ్ఞాన, భక్తులకు సమన్వయం తీసుకొని వచ్చారు. భక్తి స్తోత్రాలలోనూ కొంతవరకూ అద్వైతాన్ని చొప్పించారు. ఇది రెండు విధాలుగా చెప్పారు. ఒకటి దేవతలలో భేదం చూడవద్దని, రెండవది జీవుడు, బ్రహ్మమూ ఒకటని, ఏ దేవతను నుతించినా అతడు పరబ్రహ్మమనే చెప్పారు. దీనికంటే మరొక దానిని చూడడం లేదని అన్నారు. 'నజానే', 'నజానే' అన్నారు. లక్ష్మిని పొగుడుతూ ఈమె సరస్వతి, ఈమె పార్వతి అన్నారు. అట్లాగే మిగతా దేవతలను నుతించిన సమస్త దేవతా స్వరూపిణిగానే ఒక్కొక్క దేవతను నుతించారు.


భక్తి మార్గం, ద్వైతాన్ని సూచిస్తున్నా, చివరకు అద్వైతంలోనే పరిణమిస్తుందని అన్నారు. శివానందలహరిలో భక్తిని గురించి చెబుతూ నదులన్నీ కలిసి సముద్రంలో ఏకమవుతున్నట్లుగా అని అన్నారు. సౌందర్యలహరిలో చమత్కారంగా "భవానిత్వం" అనే శ్లోకంలో అమ్మా నీవని ఆరంభించి భవానిత్వం = నేను నీవగుచున్నానని తేల్చారు.


Thursday, 22 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 199వ భాగం

 


"కాపీనవంతః ఖలు భాగ్యవంతః"

"తదేకోవశిష్టః శివః కేవలోఽహం" 

"సాక్షిణ్యతః ప్రత్యగాత్మా శివోఽ హం"

"అహం పరంబ్రహ్మ వాసుదేవాఖ్యం అవ్యయం" 

"అహం ఆనంద సాధ్యాది లక్షణః కేవలః శివః"

"చిదానంద రూపశ్శివోహం శివోహం"


(పై ఉదాహరణలు దశల్లోకి, అద్వైత పంచరత్న, బ్రహ్మానుచింతనం, అద్వైతానుభూతి, నిర్వాణ షట్కంలలో ఉన్నాయి)


అవి చదువుతూ ఉంటే ఒక అలౌకిక అనుభూతికి లోనవుతాం.


ఏక శ్లోక ప్రకరణంలో, ఒక్క శ్లోకంలో చైతన్య స్వరూపాన్ని వర్ణిస్తూ, కనబడే జగత్తు, దానిని చూచువాడు, అంతా చైతన్యమే అని వర్ణించారు. వారి బాల ప్రబోధ సంగ్రహం, ఒక అధ్యాపకుడు, ఒక చిన్న పిల్లవానికి బోధించునట్లుగా ఉంటుంది.


ఇక వారి ప్రశ్నోత్తరమాలికలో అనేక విషయాలు ప్రశ్న సమాధాన రూపంలో ఉంటాయి.


వారి భక్తి స్తోత్రాలు, అందరికీ ఉపయోగించివే. జ్ఞానానికి సంబంధించిన రచనలను కేవలం విద్వాంసులే అర్ధం చేసుకోగలరు. భక్తి స్తోత్రాలను చిన్నపిల్లలు కూడా నేర్చుకోవచ్చు. కానీ వీటిలోని విషయం గురించి విద్వాంసులు కూడా ఆశ్చర్య చకితులౌతున్నారు.


దేవతలపై కేశాంతస్తవం చేసారు. ఇక భాష్యాలు వచనంలో ఉన్నా, వారి ప్రకరణ గ్రంథాలు ఎక్కువ శ్లోకాల్లోను, కొద్దిగా వచనంలోను ఉంటాయి. స్తోత్రాలన్నీ శ్లోకరూపంలో ఉంటాయి. అవి అన్నీ అర్ధవంతాలు. అవి మనశ్శాంతిని ప్రసాదించే శక్తి గలవి.


Wednesday, 21 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 198 వ భాగం



వీరి భాష్యాలు, స్వీయ రచనలు, జ్ఞాన మార్గాన్ని అందిస్తాయి. భాష్యాలలో పూర్వ పక్ష సిద్ధాంతాలున్నా సుదీర్ఘంగా ఉండవు. వారొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటపుడు దానికి విరుద్ధంగా నున్న ప్రశ్నలనన్నింటినీ లేవనెత్తి వాటికి సూటిగా సమాధానాన్ని అనగా సిద్ధాంతాన్ని అందిస్తారు. అట్లా వివిధ మతాలను, వైదిక మతాలుగా కనబడేవాటినీ ఎదుర్కొన్నారు. అయితే అన్నిటినీ అన్నివిధాల నివారించలేదు. ఇతర మతాలలో నున్న కొన్నిటిని హృదయపూర్వకంగా స్వీకరించారు. అంతేకాదు, అద్వైతంలో ఒక్కొక్క దశలో భిన్న భిన్న సిద్ధాంతాలకు చోటుందని నిరూపించారు.


గౌడభగవత్పాదులవారు మాండూక్యోపనిషత్తుపై కారికలు వ్రాయగా దానిపై శంకరులు విపులంగా వ్యాఖ్యానించారు. అందులో గౌడులు, అద్వైతులు కానివారు పరస్పరం వాదులాడుకొందురు గాక మాకు వానితో పేచీ పూచీలు లేవని వ్రాస్తే శంకరులు అందరూ అద్వైతానికి ఒక విధంగా దోహదం చేసినవారే అని తరువాతి శ్లోకంలో ద్వైతులకు ఆత్మ అద్వైతమని ప్రేమతో వ్రాసేరు.


"తతః పరమార్ధతో బ్రహ్మవిద్ అత్మైవ ద్వైతినాం" సూత్రభాష్యంలో తగు విధంగా ఇతర సిద్ధాంతాల పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు. మీమాంసా శాస్త్రంపై భాష్యం వ్రాసిన శబరులను "ఆచార్యేణ శబర స్వామినా" అని; ఉపవర్షులను "భగవతో ఉపవర్షేణ" అని న్యాయ సూత్రాలు వ్రాసిన గౌతముని "ఆచార్య ప్రణీతం" అని, వారందరినీ ఆచార్య, స్వామి భగవాన్ అని పేర్కొన్నారు.


జ్ఞానానికి సంబంధించిన స్వీయ రచనలలో ప్రధాన సత్యాన్ని స్పష్టంగా పేర్కొంటూ, వాద ప్రతివాదాల పట్ల పెద్దగా దృష్టి పెట్టకుండా వ్రాసేరు. ఉపదేశసాహస్రి వంటి గ్రంథాలలో అనుభూతిపైనే దృష్టిని సారించినట్లు తెలుస్తుంది. వివేక చూడామణి వంటి గ్రంథాలలో కూడా అదేవిధంగా చేసారు. జీవన్ముక్తానందలహరి, ధన్యాష్టకం, యతి పంచకంలలో కేవలం అద్వైతానుభూతిని పొందినవారి స్థితిని పేర్కొన్నారు. యతి పంచకంలో కౌపీనవంతుల కంటె భాగ్యవంతుడెవడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు.


Tuesday, 20 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 197 వ భాగం



ఏదైనా కష్టమైన విషయం ఉంటే ఇదేమైనా సూత్రభాష్యమా అని ప్రశ్నిస్తూ ఉంటారు. కాశిలో శంకరులే భాష్య ప్రవచనం చేస్తూ ఉంటే ఇక చెప్పేదేముంది?


అంగ, వంగ, కళింగాది 56 దేశాలనుండి విద్వాంసులు పాల్గొన్నారు. వీరి ప్రతిభను చూసి సాష్టాంగ వందనాలనర్పించారు. వారు తమ ప్రాంతాలకు వెళ్ళి అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసారు. ఇట్లా మన మతం పునరుద్ధరింపబడింది. అనేక దేశాలు హిట్లర్ కి కూడా మోకరిల్లాయి. అది భౌతికశక్తి, వీరిది ఆత్మశక్తి, అనుగ్రహశక్తి సాత్వికమైనది కూడా.


శంకరుల వాఙ్మయ సేవ


ఉపనిషత్తులపై, గీతపై భాష్యం వ్రాసేరు. సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను కూడా బహుస్పష్టంగా వివరించారు. ఉపనిషత్తులలో ఒకదానికి మరొకదానికి సరిపడనట్లుండే ఘట్టాలను, గీతలో కూడా ఒక మూల చెప్పినదానికి, మరొక మూల చెప్పినదానికి సంఘర్షణ వచ్చే సందర్భాలలోనూ వీరు సమన్వయం చేసిన తీరు మేధావంతులను ఆశ్చర్యచకితులయేటట్లుగా చేస్తుంది.


సిద్ధాంతం మాట అటుంచండి, సంస్కృత భాషకే వన్నె తెచ్చారని, క్లిష్టమైన విషయాలనూ సరళ సంస్కృతంలో విశదీకరించవచ్చని వీరు నిరూపించారని విద్వాంసులు పొగుడుతారు.


ఈనాడేది జాతీయ భాష అని తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఈ దేశంలో పెక్కు భాషలున్నా ఆసేతు హిమాచలంలో నున్న ప్రజలను కలిపేది సంస్కృతమే. అందువల్ల దానిలోనే రచనలు చేసారు.


Monday, 19 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 196 వ భాగం



మాధవీయ శంకర విజయంతో వీరికి నాల్గు మహావాక్యాల ఉపదేశం జరిగినట్లుంది. ఇట్టి ఆచారం, మా మఠంలోనూ ఉంది. సోఽహంలో ప్రణవం ఉంది. అది జీవబ్రహ్మల ఐకమత్యాన్ని చెబుతుంది కనుక సోఽహం కూడా మహాకావ్యమే.


బ్రహ్మ సూత్రాలకు భాష్యం వ్రాయవలసిందిగా శంకరులను గోవిందులా జ్ఞాపించారు. లోగడ పరమేశ్వరుడు దేవతలతో చెప్పాడు కదా! ఆ కాలం కోసం ఎదురు చూసారు.


శంకరులు భాష్యం వ్రాసి గోవిందులు చరణ సన్నిధిలో ఉంచారు. ఇది కాశిలో వ్రాసినట్లుంది. (నర్మదా నదీతీరంలో సూత్రభాష్యం, కాశిలో ఉపనిషద్భాష్యం వ్రాసి యుంటారని మహాస్వామివారి అభిప్రాయం ఆంగ్లానువాదకుడు)


శంకరులింటిదగ్గర ఉంటే వారి ఆయుర్దాయం ఎనిమిది సంవత్సరాలే. సన్న్యాసం పుచ్చుకోవడంవల్ల మరల 8 సంవత్సరాలు పొడిగించబడ్డాయి. కాశీయాత్రకు గురువులనుమతి ఇచ్చారు.


కాశీలో వైదిక మత ప్రచారం


కాశీక్షేత్రం, పవిత్రం, విద్వాంసులకు నిలయం. అనేక మతాచార్యులుంటారు. అందువల్ల అక్కడకు వెళ్ళవలసిందిగా గురువులదేశించారు. అక్కడ వైదిక మతాన్ని స్థాపిస్తే కలకాలం ఉంటుందని, పునః ప్రతిష్టింపబడాలని పంపారు.


గంగాతీరంలోని మణికర్ణికా ఘట్టం దగ్గర ఉన్న ముక్తి మంటపంలో వీరుపదేశించేవారు.


ఇది మోక్షపురి. అయోధ్య, మధుర, హరిద్వార్, అవంతి, ద్వారకలు కూడా మోక్షపురులే. ఏడవది దక్షిణ దేశంలో నున్న కంచ. సప్తమోక్ష పురులలో కంచిని, వైష్ణవ గురువులైన వేదాంత దేశికులు నుతించారు. కాశిలో ఉన్నట్లే కంచిలోనూ ముక్తి మంటపముంది. కంచి వచ్చినపుడు శంకరులుండేవారు. కనుక ఇప్పటికీ ఇక్కడే వ్యాస పూజ; కామాక్షి ఆలయంలోని శంకరులు విగ్రహాన్ని ఇక్కడికే తీసుకొని వస్తారు.


Sunday, 18 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 195 వ భాగం



గురు సన్నిధి - సన్న్యాసదీక్ష - వ్యాఖ్యానం


శంకరులు, నర్మదా తీరం వెళ్ళి గోవింద భగవత్పాదులను కలిసారు. వారు యోగనిష్టలో ఉన్నారు. ఇంతలో నర్మదకు, వరదలు రాగా ప్రజలు వచ్చి రక్షించండని శంకరులను ప్రార్ధించారు. వీరు తమ దివ్యశక్తిచే నర్మదను, తన కమండలువులో బంధించారు. బాహ్య ప్రపంచంలో అడుగిడిన గురువుకు వీరు సాష్టాంగ నమస్కారం చేయగా ఆయన నువ్వు ఎవరని అడిగారు.


తాను అవతారాన్నని పది శ్లోకాలలో పరోక్షంగా పేర్కొన్నారు. దీనిని దశశ్లోకియని అంటారు. "తదేకోఽవశిష్ఠః శివః కేవలోఽహం" అని చివర ఉంటుంది. 'అవశిష్టం' అనగా అదే మిగిలినది. మిగిలినదంతా మాయ, అది 'కేవలం', అనగా పవిత్రం, మిశ్రితం కానిది. తత్ ఏవో అది ఒకటే - నేనే శివుని రూపాన్ని.


శివావతారం నీ దగ్గరకు రాబోతుందని గోవిందులతో లోగడ వ్యాసుడన్నాడు. లోకాచారం ప్రకారం ఉపదేశమీయాలి కనుక శాస్త్రాచారాన్ని పాటించి ఉపదేశించారు. సన్న్యాస దీక్షనిచ్చారు.


మహా వాక్యాలను గురువు ఉపదేశిస్తాడు. దాని అర్ధంపై దృష్టి పెట్టి శిష్యుడు దానితో తాదాత్మ్యం చెందాలి. ఆ మహావాక్యాలు వేదశాఖ చివరలో ఉంటాయి. సర్వజ్ఞాత్మ మునియనే ఒక మహానుభావుడు సంక్షేప శారీరకం అనే గ్రంథాన్ని వ్రాసేడు. అందులో శిష్యుడు ఏ శాఖను లోగడ అధ్యయనం చేసాడో లేదా దానికి చెందినవాడో, అట్టివానికి అతని వేద శాఖలోని మహావాక్యాన్ని అందీయాలని, అది నిజ వేదశాఖ మహావాక్యమౌతుందని వ్రాసేడు. అట్లాగే మధుసూదన సరస్వతి కూడా అన్నారు. ఆ పుస్తకానికి వీరే వ్యాఖ్యానం చేసారు.


వేదాలలో అనేక మహావాక్యాలున్నాయని శంకరులనగా, అందు ముఖ్యంగా నాల్గింటిని ప్రధానంగా పేర్కొంటారు.


"మహావాక్య శతేన కథ్యతే

బ్రహ్మాత్మనో రైక్య మఖండ భావః" (వివేక చూడామణి 249)


Saturday, 17 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 194 వ భాగం



వీరు షణ్మత స్థాపనాచార్యులని వివరంగా చెప్పబడింది. షణ్మతాలలో కౌమారం (కుమార స్వామికి సంబంధించినది) ఉండగా ఇందు దానికి బదులు కాపాలికం ఉంది. 72 మతాలను వీరు తిరస్కరించారని, అందు కాపాలికం కూడా ఉందని ఉంది. అయితే కాపాలికుడైన వడక్కునాథర్ తన మతాన్ని ప్రచారం చేయవలసినదిగా ప్రార్ధిస్తే నీవు నీ మతాన్ని ప్రచారం చేసుకొనమని శంకరులనగా అతడు శంకరులు ఐదుగురు శిష్యులను సేవిస్తూ ఉండేవాడట. కాని ప్రసిద్ధమైన షణ్మతాలలో స్కాందం (కౌమారం) ఉంది. పరాశర మాధవీయంలో కూడా అట్లాగే ఉంది. శాస్త్ర ప్రకారం నడిచే శంకరులు, కౌమారాన్ని విడిచి పెడతారా?


ఈ ఆనందగిరీయంలోనే శంకరులు అనంతశయన క్షేత్రం నుండి సుబ్రహ్మణ్య క్షేత్రానికి (ఉడిపి దగ్గరిది కావచ్చు) వెళ్ళారని, అందు కుమార ధారలో స్నానం చేసారని, అక్కడ సర్పాకారంలో నున్న సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్ధించారని ఉంది. ఇది కర్ణాటక కావచ్చు, లేదా ఆంధ్ర ప్రాంతం కావచ్చు. శంకరుల సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ప్రసిద్ధి. ఇది తిరుచెందూర్లో నున్న మూర్తిపై వ్రాసినది. వేరే మతానికి చెందిన వ్యక్తి, వీరిపై అభిచార ప్రక్రియ (చేతబడి మొదలైనవి) చేయగా కొంతకాలం వీరు బాధపడ్డారని, సుబ్రహ్మణ్య -స్వామిపై స్తోత్రం వ్రాసేరని, అక్కడొక విశిష్ట విభూతి ద్వారా వీరి రోగం నయమయిందని అంటారు. ఒక ఆకుపై పెట్టి విభూతినిస్తారు. అది పత్రభూతి దానిని ఒంటికి రాయకున్నా, చూస్తే చాలని, రోగాలు పోతాయని, భూతప్రేత బాధలుండవని వ్రాసేరు:


"అపస్మార కుష్ఠ క్షయార్మ ప్రమేహ 

జ్వరోన్మాద గుల్మాది రోగాః మహాంతాః 

పిశాచాశ్చ సర్వే భవత్ప్రత్ర భూతిం 

విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే"


వీటివల్ల కౌమారాన్ని షణ్మతాలలో ఒకటిగా స్థాపించారని తెలుస్తోంది. ఇట్లా శంకర విజయాలను తులనాత్మక పరిశీలన చేసి పరస్పర విరుద్ధాంశాలు లేనివాటికి ప్రాధాన్యం ఇస్తూ నిర్ధారించాలి.


కేవలం బుద్ధితో నిర్ణయానికి రాకూడదు. భక్తిని, వినయాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించాలి.


Friday, 16 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 193 వ భాగం



అయితే చోళులకు కులదైవం, నటరాజు, చోళరాజులకు తంజావూర్, ఉరైయూర్ మొదలగునవి రాజధానులైనా పట్టాభిషేకాన్ని చిదంబరంలోనే నిర్వహించేవారు. అప్పటి కిరీటం పట్టాభిషేకంలోనే ఉంటుంది. మిగిలిన సమయంలో చిదంబరంలోని దీక్షితుల ఆధీనంలో ఉంటుంది.


కురువ నాయనార్, చోళ రాజును జయించిన తరువాత, తనకూ పట్టాభిషేకం చేయమని దీక్షితులనడిగాడు. చోళ రాజ్యంలో వంశపరంపరగా వస్తున్నవారికే చేస్తాము గాని ఇతరులకు చేయమని అన్నారు. ఇట్లా రాజునకు, ఇష్టం లేని మాటను చెప్పి అక్కడ ఉండడం మంచిది కాదని, ఒక్క దీక్షితుణ్ణి ఉంచి ఆ చిదంబరాన్ని విడిచి పెట్టారు. ఆలయంలో కిరీట రక్షణకై ఒక్కణ్ణి యుంచారు. అట్లా అతనిచేత, రాజు పట్టాభిషేకం చేయించుకోలేదు. సంస్కృతిని ఎట్లా గౌరవించాడో చూసారా?


వారు, చేర రాజ్యమైన మలయాళ దేశం వెళ్ళారు. ప్రక్కనున్న పాండ్య దేశానికి కాకుండా దూరంగానున్న మలయాళ దేశానికి వెళ్ళారు. ఇట్లా వీరికి ఈ దేశంతో అనుబంధం ఏర్పడింది.


ఆనందంలో శంకరులు, చిదంబరంలో పుట్టారని, వారి తండ్రి విశ్వజిత్ అని, తల్లి విశిష్టయని యుంది. పరిశోధించగా ఈయన శంకరులు కాదు. క్రీస్తు తరువాత 788 నాటివాడు. శంకరులను, అభినవ శంకరులను ఎట్లా కలిపేసారో చూసారా?


చిదంబరంలో శంకరులు, నటరాజు మాదిరిగా వెలుగొందుతున్నారని "సాక్షాత్ చిదంబరేశ ఇవవి రాజమానః" అని ఆనంద గిరియంలో ఉంది. ఇందులో గోవింద భగవత్పాదులను చిదంబరంలో కలిసినట్లుంది. మిగతా శంకర విజయాలలో నర్మదా నదీ తీరంలో కలిసినట్లుంది. దీనిని గమనించండి. అయితే చిదంబరానికి, గోవిందులకు సంబంధం ఉంది. ఆయన పతంజలి అవతారం కదా! పతంజలికి చిదంబరానికి సంబంధాన్ని చెప్పాను. శంకరులకు పరమ గురువులు, గౌడపాదులు, వ్యాకరణోపదేశాన్ని చిదంబరంలోని పతంజలి నుండియే స్వీకరించారని ఐతిహ్యం. వీటినట్లా ఉంచినా వీరెల్లపుడూ చిదంబరస్థులే, అనగా జ్ఞానాకాశంలో ఉండేవారే. ఇట్లా భావించి శంకరులకు చిదంబరంలో ఉపదేశం ఇచ్చినట్లు ఆనందగిరీయం వ్రాసిందని భావించవచ్చు. విశ్వనాథుడు, చండాలునిగా రావడం, మరణ సమయంలో శంకరులు తల్లి దగ్గరకు వెళ్ళడం మొదలైన విషయాలు ఆనంద గిరియంలో లేవు. మిగతా గ్రంథాలలో ఉన్నాయి.


Thursday, 15 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 192 వ భాగం



చిదంబరం అంటేనే, వేదాంత వీథిలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. అది జ్ఞానాకాశమే. మిగిలిన పుణ్యక్షేత్రాలు, అక్కడున్న స్థలపురాణాలతో సంబంధం కలిగి ఉంటాయి. కాని చిదంబరమే వేదాంతార్ధంతో కూడియుంది. దీనికి వ్యాస పురమని, పులియూరని పురాణాల బట్టి యున్నా చిదంబరంగానే ప్రసిద్ధి. పంచకృత్యాలు చేసే నటరాజునకు సమీపంలో వట్టి ఆకాశాన్ని తలపింపచేయడమే కాకుండా, ఆత్మ తత్త్వాన్ని తెలివిడి చేస్తుంది. ఆ ఆత్మ తత్త్వమే ఆకాశము. యోగతారావళి గ్రంథంలో శ్రీశైలాన్ని స్మరించినట్లు, వివేక చూడామణిలో చిదంబరం ప్రస్తావింపబడింది. ఇందు జీవన్ముక్తుని గురించి చెబుతూ, అతడు జ్ఞానాకాశంలో స్థిరంగా ఉంటాడని, అతడే విధంగానైనా ప్రవర్తించవచ్చని, దిగంబరంగా లేక చర్మాంబర ధారిగానైనా ఉంటాడని చెప్పబడింది. అక్కడ వారు "చిదంబరస్థ" అనే పదం వాడారు. అనగా జ్ఞానాకాశంలో ఉన్నవాడని.


కేరళ సమీపంలో కొంగునాడులో పేరూర్ అనే నటరాజు క్షేత్రం ఉంది. దీనిని ఆది చిదంబరం అంటారు.


దేవతా సన్నిధులను కేరళలో అంబళం అంటారు. తమిళనాడులో పొన్నంబళం, చిత్రంబళం అని నటరాజ సన్నిధిని అంటారు. ఇతర ఆలయాలకు, తమిళనాడులో ఉన్నట్లుగా ఈ సన్నిధులకు గోపురాలుండవు. కేరళలోని ఆలయాలుగా ఉంటాయి.


చిదంబరంలోని అర్చకులను దీక్షితార్ ని అంటారు. వీరికి శిఖ, వెనుక భాగంలో కాకుండా ముందు భాగంలో ఉంటుంది. నంబూద్రీలు, ఊర్ధ్వ శిఖ కలిగియుంటే వారికి ముందు భాగంలోనే కొంచెం ప్రక్క కుంటుంది.


ఈ దీక్షితార్లకు కేరళకు ఒక సంబంధాన్ని పెరియ పురాణం వెల్లడించింది. చోళ దేశంలో కుట్రువ నాయనార్ అనే చిన్న రాజుండేవాడు. అతడు చోళరాజునకు పన్ను కడుతూ ఉండేవాడు. పంచాక్షర జపం వల్ల ఇతడనేక ప్రాంతాలను జయించి, తుదకు చోళరాజును కూడా జయించాడు.


Wednesday, 14 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 191 వ భాగం



సంస్కృత నిఘంటువు వ్రాసిన మోనియర్ విలియమ్స్, ఆనంద గిరియంలో ఉన్న దిగ్విజయ యాత్ర సరిగానే ఉందని కితాబు ఇచ్చాడు. కనుక దేనిని ప్రమాణంగా భావించాలో చూడండి. ఏది ఇతిహాస, పురాణాల విషయాలతో పోలిక కల్గి యుంటుందో దానిని ప్రమాణంగా భావించాలి. ప్రజల విశ్వాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి దానినీ కాకమ్మ కథగా కొట్టి పారవేయకండి.


మూల గ్రంథాలనే శివ రహస్యానికి, మార్కండేయ సంహితకు భేదాలున్నాయి. ఈశ్వరుని నుండి పంచ లింగాలను శంకరులు గ్రహించినట్లు శివరహస్యంలో ఉండగా, మార్కండేయ సంహితలో వారే కైలాసానికి వెళ్ళి శంకరుని నుండి గ్రహించినట్లుంది. అంతేకాదు, సౌందర్య లహరి గ్రంథాన్ని పొందినట్లుంది. ఈ పంచ లింగాలను ఎక్కడ స్థాపించిన విషయం కూడా, ఈ సంహితలో ఉంది. పంచలింగాలను తీసుకోవడం రెండు గ్రంథాలు వ్రాసినా, ఎక్కడ అనే విషయంలో భేదాభిప్రాయం ఉంది.


అయితే శంకర జయంతిని జరిపే రోజు ఒక్కటే, కాలడి వారి జన్మ స్థలమని అందరూ వ్రాయగా ఆనంద గిరియంలో మాత్రం, చిదంబరమని యుంది. ఇట్టి మాటను ప్రమాణంగా భావించనవసరం లేదు. ఇట్లా కొన్నిటిని స్వీకరించవచ్చు. కొన్నిటిని తిరస్కరించవచ్చు.


చిదంబరం - శంకరులు


పరమేశ్వరుని నుంచి తెచ్చిన ఐదు స్పటిక లింగాలలో ఒకటి శృంగేరిలో, మరొకదానిని కంచి మఠంలో స్థాపించారు. ఒకదానిని కేదారనాథ్, నేపాల్లోని నీలకంఠ క్షేత్రంలోనూ ఇంకొకటి స్థాపించారు. ఐదవ దానిని చిదంబరంలో స్థాపించారు. సిద్ధి సమీపించేటపుడు ఐదవ దానిని సురేశ్వరులకిచ్చి చిదంబరంలో ప్రతిష్టింపుమని అన్నట్లుగా ఆనందగిరీయంలో ఉంది.


Tuesday, 13 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 190 వ భాగం



వ్యాసాచలీయం


"శంకరులనే వృక్షం బాగా ఎదిగియుంది. విద్వాంసులనే తుమ్మెదలు, ఆ మకరందాన్ని ఆస్వాదింతురుగాక, నా బుద్ధికి తగ్గట్లు అందినంత మేర ఆ పువ్వులను కోసి మాలగా కూర్చి ఈ సంక్షేప శంకర విజయాన్ని అందిస్తున్నానని" మాధవీయంలో ముందు ఉన్న మాటలను తిరిగి వ్యాసాచలీయంలో వినయంతో అన్నారు.


గోవిందనాథుడు కూడా తన శంకర విజయంలో ఈ అలంకారాన్నే వాడాడు:


అత్యున్నతస్య కావ్యతరోః వ్యాసాచల భువోంఽఖిలం 


అర్ధ ప్రసూనాధ్యా ధాతుం అసమర్ధఽహం అద్భుతం


వ్యాసాచలంపై ఆచార్య చరితమనే పెద్ద వృక్షం ఉంది. అందలి అర్ధమనే పువ్వులను కోయలేకపోతున్నానని అన్నాడు.


వ్యాసాచలుడైన నేనూ అదృష్టవంతుణ్ణి, దానిని చదివినవారు అదృష్టవంతులే అన్నాడు. "ధన్యో వ్యాసాచల కవివరః తత్ కృతిజ్ఞాశ్చ"


ఆనంద గిరీయం


దీనిని ప్రామాణికంగా చాలామంది భావిస్తారు. మాధవీయ వ్యాఖ్యానంలో పేర్కొన్న గ్రంథాల విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందు శంకరులు, చివరి కాలంలో కంచిలో ఉన్నట్లుంది. ఈ గ్రంథం, బృహత్ శంకర విజయమే. మాధవీయానికి ధనపతి సూరి వ్యాఖ్యలో శంకరులు దిగ్విజయ యాత్ర విపులంగా వివరింపబడింది. ఆనందగిరీయ పంక్తులూ చాలా ఇతని వ్యాఖ్యలో ఉన్నాయి.


కాశీ లక్ష్మణ శాస్త్రి వ్రాసిన గురు వంశ కావ్యంలో, వారే దానికి వ్రాసిన వ్యాఖ్యానంలో ఆనందగిరి యతీంద్రుని పేర్కొన్నారు.


సేండ్రకోటస్ అని ముందుగా పరిచయం చేసిన హెచ్. హెచ్. విల్సన్ కూడా ఆనందగిరీయం ప్రామాణికమైనదని అన్నాడు. అయితే సంస్కృతం తాళ ప్రతుల పట్టీని వ్రాసిన 'బర్నల్' దొర, దీనిని ప్రామాణికం కాదన్నాడు. శంకరులు చాలా చోట్ల మఠాలను స్థాపించిన విషయాన్ని ఆనంద గిరీయం పేర్కొనినదని, పెక్కు మఠాలను వారు స్థాపించలేదని అన్నాడు. అసలా మాట ఆనందగిరీయంలో లేదు. చాలా సిద్దులున్నట్లు ఆనందగిరీయం వ్రాసిందని, అయినా ప్రామాణికమే అని విల్సన్ దొర వ్రాసేడు.

Monday, 12 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 189 వ భాగం



వారిపట్ల భక్తి, విశ్వాస ముంటే చాలు. వీరి సిద్ధాంతంపై అనురక్తి ఉంటే చాలు. వారిపట్ల భక్తి యున్నపుడు వారికి సంబంధించిన ఏ కథ విన్నా ఎవ్వడూ సందేహించదు. కనుక అన్నిటినీ చదువుదాం.


నిష్పాక్షిక దృష్టిని మనమా కథలను వినినపుడు అలవర్చుకోవాలి. మన నిర్ణయానికి ఒకడు రానంత మాత్రంచే అతనిపై ద్వేషభావం పనికి రాదు. కనుక సత్యాన్వేషణతో బాటు, ప్రేమ కూడా కలిగియుండాలి. సమన్వయ ధోరణిలో వారు సాగగా మనము కీచులాటలతో, ఒకటి ప్రమాణం ఒకటి కాదనే ధోరణిలో మన ఆలోచన ఉంటే ఎట్లా? మనలను విమర్శించేవారూ ద్వేష భావాల్లేకుండా ప్రేమతో వారి అభిప్రాయాన్ని ప్రకటిస్తే ఇద్దరికీ మంచిది.


మాధవ శంకర విజయం


దీనికి ఎక్కువ ప్రాచుర్యముంది. ఇందు కవిత్వపు పాలుంది. తాత్త్వికమైన విచారణ కూడా ఉంది. దీనికి రెండు వ్యాఖ్యలున్నాయి. అచ్యుత రాయ మోదక్ వ్రాసిన అద్వైత రాజ్యలక్ష్మి వ్యాఖ్యానం ఒకటి, ధనపతి సూరి వ్రాసిన డిండిమ వ్యాఖ్యానం మరొకటి.


ఈ గ్రంథకర్త దానిని సంక్షేప శంకర విజయమన్నాడు. అనేక పూర్వ గ్రంథాలను పరిశీలించాడు. వ్యాసాచలుడు వ్రాసిన శంకర విజయం, ఆనంద గిరీయం వంటి గ్రంథాలనుండి విషయాన్ని సేకరించాడు. పూర్వుల శ్లోకాలు చాలా మధురంగా ఉన్నాయని, ఎక్కువగా తీపి తినలేం. నా శ్లోకాలనే ఉప్పుకారాలను చేర్చానని వినయంతో అన్నాడు. కాని వీరి శ్లోకాలింకా మధురం. పూర్వుల వచన భాగానికి శ్లోక రూపమిచ్చాడు, కొన్ని పూర్వులు శ్లోకాలను మార్చాడు కూడా. దీనినొక పారాయణ గ్రంథంగా తీర్చిదిద్దాడు. ఇది రెండువేల శ్లోకాలతో ఉంటుంది. రాజ చూడామణి దీక్షితులు, రామభద్ర దీక్షితులు, జగన్నాథ కవి రచనలలోని శ్లోకాలూ ఇందుంటాయి.


13 సెప్టెంబరు 2022, మంగళవారం, భాద్రపద బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, కృష్ణ అంగారక చతుర్థి, అంగారక సంకష్టహర చవితి.




13 సెప్టెంబరు 2022, మంగళవారం, భాద్రపద బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ, కృష్ణ అంగారక చతుర్థి, అంగారక సంకష్టహర చవితి.

ఓం గం గణపతయే నమః

సంకష్టహరచవితి వ్రత విధానం :

నండూరి శ్రీనివాస్ గారు ఒక వీడియోలో ఈ వ్రత విధానం స్పష్టంగా చెప్పారు. అది వినగలరు.

https://www.youtube.com/watch?v=kTe1249JPOA

నండూరి శ్రీనివాస్ గారు చూపించిన వ్రతవిధానం డెమో.

https://www.youtube.com/watch?v=Izuz-2IkLgQ


13 సెప్టెంబరు 2022, మంగళవారం, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 8.32 నిమి||

మీ మీ ప్రాంతాల్లో చంద్రోదయ సమయం చూసుకోవడానికి ఈ లింక్ ఉపయోగపడుతుంది

https://www.drikpanchang.com/sankashti/vighnaraja/vighnaraja-sankashti-date-time.html?year=2022

Sunday, 11 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 188 వ భాగం



శంకరులు తమ చరిత్రను వ్రాసుకోలేదు. పరంపరగా వారి చరిత్రను లిఖించడంలో కొన్ని మార్పులు, చేర్పులూ ఉండవచ్చు. వారు భారతదేశం అంతా తిరిగారు. ఎక్కడో ఒకచోట వారు నడయాడినదానిని చరిత్ర వ్రాసినవారు పేర్కొని యుండక పోవచ్చు. అంతమాత్రంచే అది దోషం కాదు. మరొక్క మాట. శంకరుల తరువాత చాలామంది వీరి పేరుతో వ్యవహరింపబడినవారున్నారు. ఎవరు, ఆది శంకరులనే మాటలో సందేహాలు రావచ్చు. ఉదా: సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ప్రదేశాలలోనే అభిప్రాయ భేదం ఉంది. కొందరు కంచియని, మరికొందరు కాశ్మీరమని అన్నారు. దీనిని మూడు విధాలుగానే చెప్పవచ్చు. అసలు కంచి ప్రాంతానికి, కాశ్మీరమని పేరు కూడా ఉంది. ఈ మాట గోవింద నాథీయంలో ఉంది. ఇక కాశ్మీరంలో ఉన్నదానిని శారదా పీఠం అంటారని, కంచిలో ఉన్న దానిని సర్వజ్ఞ పీఠం అంటారని ఉంది. ఈ రెంటినీ ఆరోహించారని భావించవచ్చు. మరొక అభిప్రాయం ప్రకారం ఆదిశంకరులు కంచిలో అధిరోహించారని, అభినవ శంకరులు కాశ్మీరులో నున్న దానిని అధిరోహించారని అంటారు. ఇది తప్పుగా అర్ధం చేసుకోబడింది.


అట్లాగే కొందరు, ఆనందగిరులిద్దరున్నారని, మండన మిశ్రులిద్దరని పరిశోధనలు చేస్తున్నారు. శంకర విజయం వ్రాసిన ఆనందగిరి వేరని, శిష్యుడైన ఆనందగిరి వేరని; అట్లే బ్రహ్మసిద్ధి మీమాంసా గ్రంథాలు వ్రాసిన మండన మిత్రుడు వేరని, శంకరుల శిష్యులై సురేశ్వరాచార్యులుగా మారిన మండన మిశ్రులు వేరని వీరే నైష్కర్మ సిద్ధిని వ్రాసేరని అంటారు. సురేశ్వర మండన మిశ్రులే శంకరుల మార్గానికి అనుగుణంగా వ్రాసేరు. మరొక మండన మిశ్రుడు వ్రాసినది శంకరుల సిద్ధాంతానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ సందేహానికి మరొక కారణం ఉంది. సురేశ్వర మండన మిశ్రులకే విశ్వరూపుడని మరొక పేరు కూడా ఉంది.


ఇట్లా ఉండగా కాలాంతరంలో వ్రాసేవారు తాము విన్నదానిని వ్రాయడం వల్ల సందేహాలకు తావిచ్చింది. తమ ఇష్టాన్ని బట్టి కూడా కొన్ని మార్పులు చేసియుండవచ్చు. కొన్ని మార్పులుండడం సహజం. లేఖకుల తప్పులూ దొర్లుతూ ఉంటాయి.


రాగద్వేషాలు జయించడం కష్టం. ఇది లేఖకులకూ చెందుతుంది. శంకరులు అన్ని సిద్ధాంతాలను అవలోకించి ఆయా స్థితులలో ద్వైతానికి, భక్తికి, సాంఖ్యానికి, యోగానికి, మీమాంసకు, చివరకు బౌద్ధానికి తగు ప్రాధాన్యమిచ్చి తుదకు అద్వైతమే పరమ ప్రామాణ్యమని నిర్ధారించారు.


Saturday, 10 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 187 వ భాగం



వల్లీయ సాహాయ్య కవి. శ్రీ శంకరాచార్య చంపువును వ్రాసేడు. అనగా గద్య పద్మాతకమైన గ్రంథం.


శ్రీ టి.ఎల్. వెంట్రామ అయ్యర్ గారి తండ్రియైన లక్ష్మణ సూరి ఒక మహావిద్వాంసుడు. వీరు న్యాయ శాస్త్రంలోనూ, సంగీతంలోనూ దిట్ట. వీరికి సూరి అనే బిరుదుంది. వైకుంఠంలో భగవానునితో ఉండే భక్తులను నిత్య సూరులని అంటారు. శంకరుల గ్రంథాలపై వారు వ్యాఖ్యానం వ్రాసేరు." మైసూర్ దివాన్ గా పనిచేసిన శేషాద్రి అయ్యర్ వీరికి సూరి అనే బిరుదు నిచ్చినవాడు. మహా మహోపాధ్యాయులు కూడా. వీరు చివరి రోజులలో భగవత్ పాదాభ్యుదయం అనే గ్రంథాన్ని వ్రాసేరు.


భగవత్ పాద సప్తతియనే పేరుతో రెండు గ్రంథాలున్నాయి. సప్తతి యనగా డెబ్బది. వేదాంత దేశికులు రామానుజులపై యతిరాజ సప్తతిని వ్రాసేరు. ఉమా మహేశ్వర శాస్త్రిగారు కూడా ఇట్టి సప్తతి వ్రాసేరు.


250 సంవత్సరాల వెనుక శృంగేరీ స్వామివారి ప్రోద్భలంతో వారి ఆస్థాన విద్వాంసులైన కాకి లక్ష్మణ శాస్త్రిగారు ఏడు సర్గలతో గురువంశ కావ్యాన్ని వ్రాసేరు. మొదటి మూడు సర్లలోనూ శంకరుల జీవిత చరిత్ర యుంది.


ప్రతి శంకర మఠంలోనూ గురు పరంపర ఉన్నాయి. కంచి మఠంలో పుణ్య శ్లోక మంజరి యుంది. అయితే వీటిల్లో కొన్ని అభిప్రాయ భేదాలున్నాయి. ప్రాచీన ఇతిహాస పురాణాలలోనూ పాఠ భేదాలున్నాయి. చెప్పబడినవి. అన్నిటిలోనూ ఉంటే వాటిని ప్రమాణంగా భావించవచ్చు. పెద్దగా మాత్రం భేదాలు లేవు.


శంకరులు ఏ ప్రాంతాలను దర్శించారనే విషయంలో అభిప్రాయ భేదాలుండవచ్చు. ఉదాహరణకు శంకరులు నైవేలీ వెళ్ళారని వ్రాసిన పుస్తకం ఉందనుకోండి. అసలు రనచా కాలంలో ఆ పేరుతో నున్నది లేకపోతే దానినెట్లా అంగీకరించగలం? బెర్నార్డు షాతో వివాదం చేసారని ఒకడు వ్రాస్తే నమ్ముతామా? కాని ఆనాటి ప్రాంతాలను కొందరు వ్రాసి, కొందరు వ్రాయనంత మాత్రంచే ప్రమాణం కాదని తిరస్కరించకూడదు. అనేక ప్రాంతాలను వారు దర్శించారు. కనుక అట్టి వాటిల్లో వివాదం పడనవసరం లేదు. పోలగం బ్రహ్మశ్రీ రామశాస్త్రి గారు శంకరులు చూపిన మార్గంలో పయనించడం మన కర్తవ్యమని అన్నారు. ఒక యోగి, అర్చిరాది మార్గంలో పయనిస్తున్నప్పుడు 13 స్థానాలుంటాయని చెప్పారు. ఆ స్థానాల వరుస విషయంలో ఉపనిషత్తులు రకరకాలుగా చెప్పాయని, ఉపనిషత్తుల్లో కొన్ని యుండి మరికొన్నింటిలో కొన్ని యుంటాయని, శంకరులు దానిని చూసి ఒక వరుసలో పెట్టి అందించారని అన్నారు. అట్లాగే ఒక శంకర విజయంలో కొన్ని ఉంటే మరొక దాంట్లో కొన్నియున్నాయన్న వాటిని శాస్త్రిగారు చెప్పినట్లు ఒక క్రమపద్ధతిలో పెట్టాలి. దేనినీ విడిచి పెట్టనవసరం లేదు. సమన్వయధోరణిని అలవర్చుకోవాలి.


Friday, 9 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 186 వ భాగం



ఆ విధంగానే శంకరులు గురువు కోసం అన్వేషణ చేస్తూ కేరళనుంచి నర్మదా తీరం దాకా వెళ్ళి గోవింద భగవత్పాదులను ఆశ్రయించారు. ఎక్కడ కలిసి కొన్నాడనే విషయంలో శంకర విజయాలలో భిన్నాభిప్రాయా లున్నాయి. కొందరు నర్మదా నదీ తీరమని, మరికొందరు బదరికాశ్రమమని, మరికొందరు వారాణసియని వ్రాసేరు. ఆ పుస్తకాల పేర్లుచెబుతా.


శంకర విజయములు


బృహత్ శంకర విజయం - ప్రాచీన శంకర విజయం - ఆనంద గిరియ శంకర విజయం - వ్యాసాచలీయ శంకర విజయం - మాధవీయ శంకర విజయం - చిద్విలాసీయ శంకర విజయం - కేరళీయ శంకర విజయం - గోవిందనాధీయ శంకర విజయం - ఇట్లా ఎనిమిది యున్నాయి. ఇక సదానందులు వ్రాసిన శంకర దిగ్విజయ సారం కూడా ఉంది.


బృహత్ శంకర్ విజయం పూర్తిగా దొరకడం లేదు. అందలి విషయాలను మిగిలిన గ్రంథాలు అక్కడక్కడా పేర్కొన్నాయి. అది శంకరుల కాలంలోనే వ్రాయబడినట్లు భావించవచ్చు. అట్లాగే ప్రాచీన శంకర విజయం కూడా. ఆనందగిరీయం యొక్క కర్త పేరు అనంతానందగిరి. చిద్విలాసుడు, విజ్ఞాన కందుల సంభాషణ పూర్వకంగా చిద్విలాసీయం ఉంటుంది. కేరళలో వ్రాయబడినది కనుక కేరళీయం. గోవిందనాథుడు కేరళీయుడు. వీటిల్లో మాధవ శంకర విజయం ప్రసిద్ధిని పొందింది.


ఇక లోగడ పేర్కొన్న రామభద్ర దీక్షితులు శంకరాభ్యుదయం వ్రాసినవాడు. ఎనిమిది సర్గలతో కవితామయంగా ఉంటుంది. వీరి పతంజలి చరితంలో సూక్ష్మంగా శంకరుల చరిత్రను వ్రాసేరని చెప్పాను. వీరు నీలకంఠ దీక్షితుల శిష్యులు.

Thursday, 8 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 185 వ భాగం



ఇక సన్న్యాసి యొక్క పూర్వాశ్రమ బంధువులలో కొడుకు పోయినా, సన్న్యాసి స్నానం కూడా చేయనవసరం లేదు. అయితే ఇతని తల్లి దండ్రులు పోతే సన్న్యాసి సచేల స్నానం చేస్తే చాలు. అందరూ సన్న్యాసికి నమస్కరించాలి. కాని తిరిగి ఇతడు వారికి నమస్కరించకూడదు. తండ్రి కూడా ఇతనికి నమస్కరించాలి. కాని సన్న్యాసి, తల్లికి ఒక్కతికే నమస్కరించాలి.


"ప్రసూః వంద్యా"


"సర్వావంద్యేన యతినా ప్రసూః వంద్యా హి సాదరం" ఆదరంతో నమస్కరించాలని ఉంది.


ఎక్కువ వ్యాస పూజలు చేసిన సన్న్యాసి చిన్నవాడైనా తక్కువ వ్యాస పూజలు ' చేసిన సన్న్యాసి ఇతని కన్నా పెద్దవాడు అయినా సరే ఇతనికి నమస్కరించాలి. అట్లా తల్లికి వాగ్దానం చేసి బయలుదేరాడు.


వీరికి గురువు కావాలా?


ప్రైష మంత్రం ఉచ్చరించి తమంత తామే సన్న్యాసం పుచ్చుకున్నపుడు ప్రత్యేకంగా గురువు కావాలా? ఏదైనా ఆపదలో నున్నపుడు ఆపత్ సన్న్యాసం పుచ్చుకొన్నా, ప్రమాదం తప్పినపుడు గురువునుండి ప్రణవోపదేశాన్ని, మహా వాక్యాలను ఉపదేశం పొందాలనే విధి యుంది.


వారవతార పురుషులు కదా, వారికి గురువు కావాలా? అని సందేహం. అవతారమైనా మానవ రూపంలో ఉన్నారు కనుక లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం లోక మర్యాదను పాటించాలి. అట్లా వారు చేయకపోతే వారిననుసరించి ఇతరులు కూడా గురువక్కరలేదనుకుంటారు. ఏ పుస్తకం చూసో మనమూ వేదాంతాన్ని నేర్చుకోవచ్చనే భ్రాంతి పడతారు. కనుక లోకాచారాన్ని పాటించారు.


మూడు భువనాలలో నేను చేయవలసిన కర్తవ్యం లేదని గీతాచార్యుడు "నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషే కించన" అంటూ "అనేకమైన పనులు చేస్తున్నాను చూసావా? నీ రథాన్ని నడుపుతున్నా, మొన్న రాయబారిగా వెళ్ళాను, ఒకరితో యుద్ధం, మరొకరితో సఖ్యం ఇట్లా చేస్తూనే ఉన్నా. ఇందు వ్యక్తిగతమైన లాభమేమైనా ఉందా? నేనిట్టా చేయకపోతే కృష్ణుడే పనులు చేయలేదు, మనమెందుకు చేయాలని ఇతరులు కూడా తమ తమ ధర్మాలను పాటించరు కదా! సంఘంలో ఒక నియమం పోతుంది. అస్తవ్యస్థ పరిస్థితులేర్పడతాయి. కనుక నాకోసం నేనేమీ చేయనవసరం లేకపోయినా ఇతరులను తీర్చిదిద్దడం కోసం అనేకమైన పనులు చేస్తున్నాను. ఏ పనీ చేయని నన్ను ఆదర్శంగా భావించి ప్రజలు చెడిపోకుండా ఉండడం కోసం చేస్తూ ఉంటానని” కృష్ణుడన్నాడు.


Wednesday, 7 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 184 వ భాగం



గురువునకై అన్వేషణ


అమ్మా! నీవు సన్న్యాసానికి అంగీకరించావు. కనుక ఇకనుండి ప్రతి స్త్రీ నాకు తల్లియే. వారే భిక్షనిస్తారు. ఇక నీవే తల్లియని భ్రాంతి పడవద్దు. నేను జ్ఞానోపదేశం పొందాలి. గురువునకై వెళ్ళాలి. అతడే నాకు తండ్రి. జ్ఞానాన్ని పొంది ఇతరులకు ఉపదేశిస్తూ ఉంటే విన్నవారందరూ నా బిడ్డలే అవుతారు. నేను శాంతియనే స్త్రీని వివాహమాడాను:


"భిక్షాప్రదా జనన్యః పితరో గురవః కుమారకాః శిష్యాః

ఏకాంత రమణా హేతుః శాంతిః దయితా విరక్త స్య"


కనుక అనుజ్ఞ నిమ్మని అన్నారు. నా చివరి కాలంలో నిన్నెట్లా చూడకుండా ఉండగలనని తల్లి వాపోయింది. నీ చివరి గడియలలో నీవు తలుచుకున్న వెంటనే నీ దగ్గరే ఉంటాను. చివరి కర్మను చేస్తానన్నారు.


అయితే సన్న్యాసి కర్మ చేయవచ్చా? మాతృ ఋణాన్ని ఎవ్వరూ తీర్చుకోలేరని ఉంది. సౌత్రామణియనే మహా యజ్ఞాన్ని చేసి పితృఋణం తీర్చుకోవచ్చు. చాలామంది సోదరులుంటే ఒకనికీ పని అప్పజెప్పవచ్చు. కాని శంకరులకు సోదరులు లేరు. ఒకడున్నపుడు సన్న్యాసమే పనికిరాదు.


అవతారునిగా పుట్టారు. తల్లి అవతార స్త్రీ కాదు. అందువల్ల ఆమె కోరినట్లే వీరు చేయాలి. దహన కర్మ ఒక్కటే చాలు, తర్పణాదులు, శ్రాద్ధాదుల అవసరం లేదు (ఇట్లా చేయవచ్చని విశ్వేశ్వర స్మృతిలో నున్నట్లు స్వామివారు చెప్పారని ఋషి పీఠం పత్రిక ద్వారా తెలిసికొన్నాను - అనువక్త)


ఒకడు సన్న్యాసం పుచ్చుకుంటే అతని పూర్వాశ్రమ తనయుడు 11వ రోజునగాని 12వ రోజున గాని పార్వణ శ్రాద్ధం ఒక్కటే చేయాలి. అట్లా సన్న్యాసి తండ్రికీ, తనయుడా విధి చేసినట్లు తానూ దహనం చేయవచ్చని శంకరులు భావించారు.


Tuesday, 6 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 183 వ భాగం



రెండు రకాల సన్న్యాసం ఉంటుంది. సన్న్యాసం పుచ్చుకోవాలంటే కొన్ని శ్రాద్ధాలు, హోమాలు చేసి గురువునుండి పొందాలి. ఒకవేళ మంచం పట్టి విరక్తి కలిగి సన్న్యాసం పుచ్చుకొంటే దానిని ఆతుర సన్న్యాసమంటారు. మరొక రకం, అత్యాతుర సన్న్యాసం. దీనినే ఆపత్ సన్న్యాస మంటారు. రోగం బాగా ముదిరినా, ఏదైనా ప్రమాదం ముంచుకుని వచ్చినపుడు తీసుకొనేది ఆపత్ సన్న్యాసం. అట్టి సమయంలో ప్రైష మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు.


ఇట్లా శంకరులు సన్న్యాసం తీసుకున్నారు. మొసలి పట్టు సడలింది. అది ఆకాశంలో గంధర్వుడై కనబడింది. గంధర్వులు దివ్యదృష్టి కలవారు. దేవయోనులలో గంధర్వులొకరు.


గంధర్వుడు గత జన్మ -


గంధర్వుడు తన కథనిట్లా వివరించాడు. "నేను త్రాగుతూ, స్త్రీలతో క్రీడిస్తూ ఉండేవాణ్ణి. ఇంతలో మహర్షి దుర్వాసుడు వచ్చాడు. అతణ్ణి నేను గౌరవించలేదు. నీళ్ళల్లో విహరించే నన్ను చూసి మొసలిగా పడి యుండమని శపించాడు.” "వెంటనే అతని కాళ్ళు పట్టుకొన్నా. అతడు శంకరావతారం కదా! అతడు రుద్రుడైనా” ఆశుతోషియే. అనగా శీఘ్రంగా సంతోషించువాడే. నీవు పరమశివుని కాళ్ళు పట్టుకొన్నపుడు శాపవిముక్తి కల్గుతుందని అనుగ్రహించాడు.”


“నా దగ్గరకు పరమేశ్వరుడెట్లా వస్తాడని ప్రశ్నించాను. నిన్ను వెదుకుతూ అతడే అవతరిస్తాడులే అన్నాడు" ఇది చెప్పి ఆ గంధర్వుడు శంకరులకు నమస్కరించి అంతర్ధానం పొందాడు. అంటే శంకరుల కాళ్ళు పట్టుకుంటే మనకూ నివృత్తి మార్గం దొరుకుతుందన్నమాట.


Monday, 5 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 182 వ భాగం



ఆ పథకం


తల్లితో నదీ స్నానానికి వెళ్ళారు. ఒక మొసలి వీరి కాలిని పట్టుకుంది. ఆ నదీ ఘట్టాన్ని మలయాళంలో ముదలై (మొసలి) కడవు అని నేటికీ అంటారు.


“అమ్మా! నేను మరణించడం ఖాయం. ఈ దుర్మరణం వల్ల తగిన ఫలాన్ని రాబోయే జన్మలోనూ అనుభవించాలి. నీకు నేను కర్మ చేసే యోగం దక్కదు. నేను సన్న్యాసం పుచ్చుకుంటే మరొక జన్మనెత్తినట్లే. ఈ జన్మలో రావలసిన ఇప్పటి మరణం వాయిదా పడవచ్చు. మొసలి నన్ను విడిచి పెట్టవచ్చు. వంశంలో ఒక సన్న్యాసి పుడితే 21 తరాలు తరిస్తాయని పెద్దలంటారు. ఒకవేళ సన్న్యాసిగా ఉండి మొసలి నన్ను చంపినా నాకు దుర్మరణం ప్రాప్తించదు.”


"నీళ్ళల్లో నిలబడి సన్న్యాస దీక్షలో ఉచ్చరించే 'ష' మంత్రాన్ని ఉచ్చరించాలి. మానసికంగా అన్నిటినీ విడిచి పెట్టాలి. నేనెట్లాగూ నీళ్ళల్లో ఉన్నా. ఈ అవకాశం జారిపోతే మొసలి నన్ను తినడం ఖాయం. నాకు దుర్మరణమూ ప్రాప్తిస్తుంది. నీ అనుజ్ఞ లేనిదే నేను సన్న్యాసాన్ని స్వీకరించకూడదు కదా, నిర్ణయించమని” అన్నారు.


తల్లి సందిగ్ధావస్థలో పడింది. బ్రతికుంటే సన్న్యాసియైన కొడుకునేప్పుడైనా చూడవచ్చు. నేను చూడలేకపోయినా బ్రతికియుంటాడులే అనుకొని, నీ ఇష్టం నీ వచ్చినట్లు చేయమంది. అంటే పరమేశ్వరునకే విడిచిపెట్టింది.


తాను వద్దని చెప్పలేదు. కాబట్టి ఆమె అనుజ్ఞ ఇచ్చినట్లు భావించి ప్రైష మంత్రాన్ని ఉచ్చరించారు.


అనగా నానుండి ఏ ప్రాణికీ భయము గాని, ప్రమాదము గాని లేకుండుగాక "అభయం సర్వభూతేభ్యో మత్తః స్వాహా" అంటే ఇతణ్ణి చూడటంతో అందరూ సంతోషిస్తారన్నమాట. గృహస్థు, కర్మలను చేసేటపుడితరులను బాధ పెట్టవలసి వస్తుంది. అందువల్ల ఇతణ్ణి చూసి ఇతరులు బాధపడతారు. గృహస్థుకు చెట్లు కూడా భయపడతాయి. అవి కాయ కూరలను, పండ్లనిస్తున్నాయి కనుక వాటికి హాని చేస్తాడని భయపడతాయి. కాని అట్టి కర్మలు, సన్న్యాసికి ఉండవు కనుక భయపడవు. ఎందుకంటే అతడు రాలిన పండునో, రాలిన ఆకునో లేదా ఇతరులు పెట్టిన అన్నాన్నో తింటాడు. జైన బౌద్ధులు చెప్పిన పూర్తి అహింసాధర్మం మన సన్న్యాసంలోనూ ఉంది.


Sunday, 4 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 181 వ భాగం



శంకరులు ప్రార్థిస్తే తల్లికి ఆరోగ్యం కలిగి ఆమె వెళ్ళగలుగుతుంది. కాని గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండడం కోసం నదిని గమనం మార్చుకుని గ్రామ సమీపంలో వచ్చేటట్లు ప్రార్ధించారు. గమనం మారినపుడు దారిలో నున్న కృష్ణాలయానికి కొద్దిగా చేటు వచ్చింది.


కనకధారాస్తవం, నదీగమనం విని ప్రజలలో వీరిపట్ల భక్తిభావం ఏర్పడింది. రాజు కూడా విని వీరి దర్శనం కోసం వచ్చాడు. ఈ కృష్ణాలయాన్ని ఉద్ధరించవలసిందిగా రాజుతో అన్నారు. కృష్ణాలయం నేటికీ కాలడిలో ఉంది. నదీ తీరాన్నే ఎత్తుగా ఉండేటట్లు దాన్ని నిర్మించారు. మరల కృష్ణ ప్రతిష్ట జరిగింది. పూర్వం, ఆ నది, ఎంత దూరంలో ఉండేదో నేటికీ ప్రజలు చెబుతారు.

ఒక తల్లికే బిడ్డనా? ప్రపంచానికి బిడ్డను కదా అనే భావం వారిలో కలిగింది, ప్రజలకు అద్వైత బోధ చేయాలనే భావం వారిలో అంకురించింది. తల్లిని విడిచి జగత్కల్యాణం చేయాలని సంకల్పించారు. అవతారం, అందరికీ చెందిందే.


వీరికి తండ్రి గతించాడు. అతడు విముక్తుడో కాదో తెలియదు. కాని తల్లికి వీరివల్లనే వైకుంఠ ప్రాప్తి కలగాలని భగవత్సంకల్పం. బ్రహ్మచర్యాశ్రమం తరువాత గృహస్థాశ్రమం. తల్లి తృప్తికోసం గృహస్థ ధర్మాన్ని స్వీకరించాలా? అయితే అవతార ప్రయోజనం సిద్ధించనట్లే.


ఆమె అనుజ్ఞ లేనిదే సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించకూడదు. ఆమె అంగీకరిస్తుందా? ఇదొక పథకం ప్రకారం సాగాలనుకున్నారు.


Saturday, 3 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 180 వ భాగం



చివరగా పురుషోత్తముని వల్లభగా, అనగా అతని శక్తిగా నుతించారు. స్తోత్రం అయిన వెంటనే ముహూర్తకాలం (ఒక గంట నలభై ఎనిమిది నిమిషాలు) వరకూ కనకధార కురిసింది. ఒక్క ఉసరిక, బంగారు ఫలాల వాన అయింది.


వారు స్తోత్రం చేయకపోయినా సంకల్పిస్తే చాలు, బంగారు వర్షం కురిసేది. కాని అమ్మవారు లీలను ప్రదర్శించి స్తోత్రం చేయునట్లుగా చేసింది. దానివల్ల తరతరాలవారు ఆ స్తోత్రాన్ని పఠించే అవకాశం వచ్చింది. మనం కూడా ఈ స్తోత్రాన్ని పఠించి మన పాపకర్మలనుంచి బయటపడేలా ఆచార్యులు ఈ పేద బ్రాహ్మణ దంపతులను అనుగ్రహించే మిషతో మనకు అందించారు.


భౌతిక సంపదలతో బాటు ఆధ్యాత్మిక ఫలాలను అందించారు. ఈ స్తోత్రం డబ్బునిస్తే, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం రోగాలను పోగొడుతుంది. సౌందర్యలహరి, అన్నిటిలోనూ విజయాన్ని ప్రసాదిస్తుంది.


ఇట్లా సువర్ణ పర్షం, కాలడికి సమీప గ్రామంలో జరిగింది. ఆ బ్రాహ్మణ దంపతుల ఔరసులుండే చోటును పాకంతోట్టం (పండ్ల తోట) అంటారు. (ఆమె వంశంలో పుట్టినవారిని 'స్వర్ణాత్తూ మనై' అని నేటికీ పిలుస్తారట)


నదీ గమనం మారుట


ఎనిమిదవ యేట విద్యాభ్యాసం సంపూర్తి అయి ఇంటికి వచ్చారు. ఉపనయనానికి ముందే తండ్రి మరణించారని కొందరు, తరువాతయని కొందరన్నారు.


ముసలితల్లి దగ్గర కొంతకాలమున్నారు. కాలడిలో నేడున్న నది ఆనాడు దూరంగా ఉండేది. దూరంగా నున్న నదిలోనే తల్లి స్నానం చేస్తూ ఉండేది. అనారోగ్యం కారణం వల్ల వెళ్ళలేకపోతున్నానని తల్లి చెప్పింది.


Friday, 2 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 179 వ భాగం



వేదమే శంకరుల ఊపిరి. అవైదిక మతాలను గెంటివేసి శ్రుతిమార్గాన్ని స్థాపించారు. శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని వారిని కీర్తిస్తున్నాం. కనుక వేద స్వరూపిణిని నుతించకుండా ఉంటారా? వారు జ్ఞానావతారుడైనా కర్మానుష్టానాన్ని కాదంటారా? కర్మానుష్టాన ఫలాలను ప్రసాదించేది కనుక శ్రుతి స్వరూపిణిగా నుతించారు. శుభకర్మ ఫలప్రసూతాయై అనే ఈ నామం వల్ల మీమాంసకులకు జవాబు చెప్పినట్లైంది. 


ఆమె సద్గుణాల సముద్రమని చెప్పడానికి రత్యైనమోస్తు రమణీయ గుణావర్గాయై అన్నారు. అన్ని కర్మలూ శ్రుతిపై ఆధారపడ్డాయి. అప్పుడే అవి శుభకర్మలౌతాయి. వాటివల్లనే మనకు ఇహ పరసుఖాలు లభిస్తాయి.


గుణ కర్మలకు రెంటికీ సంబంధం ఉంది. గుణకర్మల వల్లనే నాల్గు వర్ణాలను ఏర్పాటు చేసానని గీతా వాక్యం. గుణాన్ని బట్టి కర్మ ఉంటుంది. ముందు శుభకర్మ ఫలాలనిస్తుందని, సద్గుణాల రాశియనే మాటతో కలిపారు.


దేనికైనా శక్తి కావాలి కదా! కనుక శక్త్యే నమోస్తు అన్నారు. శత పత్రనికేతనాయై అనడం వల్ల పద్మంలో నివాసముంటుందని అర్ధం. కుండలినీ యోగం గురించి చెప్పేటప్పుడు సహస్రదళ పద్మంలో పరమశివునితో ఉంటుంది.


ఇక్కడ లక్ష్మిని పద్మవాసినిగా పేర్కొన్నారు. పుష్ట్యై నమోస్తు అనగా పోషణవల్ల బలం వస్తోంది. భువన పోషకునకు భార్యయై సమస్త ప్రాణులను పోషిస్తోంది.


రతి (సంతోషం) పుష్టికావాలంటే శ్రుతియే ఆధారం కనుక ముందుగా శ్లోకంలో శ్రుతిని పేర్కొన్నారు. అనగా పుష్టి, రతులు, శ్రుతికి అనుగుణంగా ఉండాలన్నమాట.


ఆనందరూపిణీగా శక్తిరూపిణిగా, పూర్ణ రూపిణిగా ఉన్నావని చివర ప్రతిదానికి నమోస్తు అని నమస్కరించారు.


Thursday, 1 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 178వ భాగం



త్రిమూర్తులకు మూడు శక్తులుగా ఉండగా నాల్గవ దానిని ఎందుకు పేర్కొన్నట్లు?


ప్రజలు ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి మొదలైన అష్టలక్ష్ములను అడుగుతారని శంకరులకు తెలుసు. డబ్బంటే లక్ష్మియే గుర్తుకు వస్తుంది. అయితే కేవలం, డబ్బును తింటారా? కనుక అన్నం ఇచ్చే శాకంభరిని పేర్కొన్నారు. తరువాత రుద్రుని శక్తిని శశిశేఖర వల్లభగా చంద్రుణ్ణి నెత్తిపై పెట్టుకున్న సంహారమూర్తియైనవాని భార్యను పేర్కొన్నారు. సంహారమూర్తియనగా మాయతో కూడిన మహేశ్వరుడే సదాశివుడై మోక్షాన్నిస్తాడు. అప్పుడతడు శశిశేఖరుడు. ఇప్పుడు శేఖర వల్లభయనగా ఆమె ప్రళయశక్తి. తిరోధాన శక్తి, అనుగ్రహ శక్తి. ముందుగా బ్రహ్మ శక్తియని చెప్పడం వల్ల, అట్లాగే విష్ణు శక్తియని చెప్పడం వల్ల పరబ్రహ్మ శక్తియే పంచ కృత్యాలకు మూలమని ఇట్లా రూపాంతరం చెందిందని చెప్పడం వల్ల అద్వైతాన్ని బోధించినట్లే.


చివరగా త్రిభువనైక గురోస్తరుణి అని ఉంది. అనగా మూడు భువనాలకు విష్ణువు గురువని, అతని భార్య లక్ష్మియని అర్థం. గురువు యొక్క శక్తి యనినప్పుడు డబ్బునీయడమే కాదు, ఆమె జ్ఞాన శక్తియని అర్థం. శంకరుల గురుపరంపరలో మొదటి నారాయణుని ప్రస్తావన ఉంటుంది. అందువల్ల త్రిభువనైక గురువని విష్ణువును నుతించారు. రామ, కృష్ణ అష్టోత్తర నామాలలో అట్లాగే శివస్తోత్రంలోనూ జగద్గురవేనమః అని యుంటుంది.


త్రిభువనైక గురువని చెప్పడంలో అతడు జ్ఞానోపదేశమే కాదు, మూడు భువనాల తండ్రియని అర్ధం. మూడు భువనాలకు తల్లి లక్ష్మి, లక్ష్మీ అష్టోత్తరంలో "బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః" అని చెప్పినట్లుగా ఉందన్నమాట.


తరువాతి శ్లోకంలో 

"శ్రుత్యై నమోస్తు శుభకర్మాఫల ప్రసూత్యై

రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై 

శక్యై నమోస్తు శతపత్రనికే తనాయై

పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై"