మూడు మార్గాల స్థాపకులు
జ్ఞానానికి సంబంధించిన గ్రంథాలలో కూడా ముందు కర్మానుష్టానాన్ని చేయాలని, వర్ణాశ్రమ ధర్మాలను పాటించాలని అన్నారు.
సమత్వం అనే పేరుతో భౌతిక జీవనానికి ప్రాధాన్యం ఇచ్చే నేటి సంస్కర్తల వంటివారు కాదు. పనులలో సమత్వానికి పాటుబడుతున్నాం. మనసులలో అట్టి భావన మనకుందా? అని ఆలోచించండి. ఉంటే ఈ ద్వేషాలు, యుద్ధాలూ ఉంటాయా? శంకరులన్నది ఏమిటి? గత జన్మల సంస్కారాల వల్ల కర్మలు రకరకాలుగా ఉంటాయని, వాటినన్నిటినీ ఏకం చేస్తే రోగికి, పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినట్లవుతుందని అన్నారు. అందరూ పై మెట్టు ఎక్కవలసినవారే. అది క్రమక్రమంగా సాగాలి. ముందు భావనలో అంతటా ఒక చైతన్యముందని, ప్రేమతో పరికిస్తే, ఒకడు ఎక్కువ, ఒకడు తక్కువ అనే భావం పనికిరాదని, క్రియలలో తేడాలుంటాయని, అందరూ ఒక పనికి ఎగబడరాదని అన్నారు.
"భావాద్వైతం సదాకుర్యాత్, క్రియాద్వైతం నకర్హిచిత్" అనగా భావంలోనే అద్వైతంగాని, క్రియలలో కాదని స్పష్టంగా చెప్పారు. అసలు అద్వైతం అంటేనే నిష్క్రియత్వం కాని ఈనాడు అంతా తలక్రిందులైంది. మనకు భావ సమైక్యం లేదు. బాహ్యంగా అంతా ఒకటని భ్రమిస్తున్నాం. వేదాల ఆదేశాన్ని అనుసరించి ఆయా వ్యక్తులు, కర్మలు చేయాలన్నారు. ఉన్న సిద్ధాంతాన్నే పునరుద్ధరించారు. ఇట్లా కర్మ, జ్ఞాన, భక్తులకు సమన్వయం తీసుకొని వచ్చారు. భక్తి స్తోత్రాలలోనూ కొంతవరకూ అద్వైతాన్ని చొప్పించారు. ఇది రెండు విధాలుగా చెప్పారు. ఒకటి దేవతలలో భేదం చూడవద్దని, రెండవది జీవుడు, బ్రహ్మమూ ఒకటని, ఏ దేవతను నుతించినా అతడు పరబ్రహ్మమనే చెప్పారు. దీనికంటే మరొక దానిని చూడడం లేదని అన్నారు. 'నజానే', 'నజానే' అన్నారు. లక్ష్మిని పొగుడుతూ ఈమె సరస్వతి, ఈమె పార్వతి అన్నారు. అట్లాగే మిగతా దేవతలను నుతించిన సమస్త దేవతా స్వరూపిణిగానే ఒక్కొక్క దేవతను నుతించారు.
భక్తి మార్గం, ద్వైతాన్ని సూచిస్తున్నా, చివరకు అద్వైతంలోనే పరిణమిస్తుందని అన్నారు. శివానందలహరిలో భక్తిని గురించి చెబుతూ నదులన్నీ కలిసి సముద్రంలో ఏకమవుతున్నట్లుగా అని అన్నారు. సౌందర్యలహరిలో చమత్కారంగా "భవానిత్వం" అనే శ్లోకంలో అమ్మా నీవని ఆరంభించి భవానిత్వం = నేను నీవగుచున్నానని తేల్చారు.
No comments:
Post a Comment