Saturday, 3 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 180 వ భాగం



చివరగా పురుషోత్తముని వల్లభగా, అనగా అతని శక్తిగా నుతించారు. స్తోత్రం అయిన వెంటనే ముహూర్తకాలం (ఒక గంట నలభై ఎనిమిది నిమిషాలు) వరకూ కనకధార కురిసింది. ఒక్క ఉసరిక, బంగారు ఫలాల వాన అయింది.


వారు స్తోత్రం చేయకపోయినా సంకల్పిస్తే చాలు, బంగారు వర్షం కురిసేది. కాని అమ్మవారు లీలను ప్రదర్శించి స్తోత్రం చేయునట్లుగా చేసింది. దానివల్ల తరతరాలవారు ఆ స్తోత్రాన్ని పఠించే అవకాశం వచ్చింది. మనం కూడా ఈ స్తోత్రాన్ని పఠించి మన పాపకర్మలనుంచి బయటపడేలా ఆచార్యులు ఈ పేద బ్రాహ్మణ దంపతులను అనుగ్రహించే మిషతో మనకు అందించారు.


భౌతిక సంపదలతో బాటు ఆధ్యాత్మిక ఫలాలను అందించారు. ఈ స్తోత్రం డబ్బునిస్తే, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం రోగాలను పోగొడుతుంది. సౌందర్యలహరి, అన్నిటిలోనూ విజయాన్ని ప్రసాదిస్తుంది.


ఇట్లా సువర్ణ పర్షం, కాలడికి సమీప గ్రామంలో జరిగింది. ఆ బ్రాహ్మణ దంపతుల ఔరసులుండే చోటును పాకంతోట్టం (పండ్ల తోట) అంటారు. (ఆమె వంశంలో పుట్టినవారిని 'స్వర్ణాత్తూ మనై' అని నేటికీ పిలుస్తారట)


నదీ గమనం మారుట


ఎనిమిదవ యేట విద్యాభ్యాసం సంపూర్తి అయి ఇంటికి వచ్చారు. ఉపనయనానికి ముందే తండ్రి మరణించారని కొందరు, తరువాతయని కొందరన్నారు.


ముసలితల్లి దగ్గర కొంతకాలమున్నారు. కాలడిలో నేడున్న నది ఆనాడు దూరంగా ఉండేది. దూరంగా నున్న నదిలోనే తల్లి స్నానం చేస్తూ ఉండేది. అనారోగ్యం కారణం వల్ల వెళ్ళలేకపోతున్నానని తల్లి చెప్పింది.


1 comment:

  1. ముహూర్తం అంటే రెండు ఘడియలు ఆనగా కేవలం 48 నిమిషాలు మాత్రమే నండీ్

    ReplyDelete