Sunday, 11 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 188 వ భాగం



శంకరులు తమ చరిత్రను వ్రాసుకోలేదు. పరంపరగా వారి చరిత్రను లిఖించడంలో కొన్ని మార్పులు, చేర్పులూ ఉండవచ్చు. వారు భారతదేశం అంతా తిరిగారు. ఎక్కడో ఒకచోట వారు నడయాడినదానిని చరిత్ర వ్రాసినవారు పేర్కొని యుండక పోవచ్చు. అంతమాత్రంచే అది దోషం కాదు. మరొక్క మాట. శంకరుల తరువాత చాలామంది వీరి పేరుతో వ్యవహరింపబడినవారున్నారు. ఎవరు, ఆది శంకరులనే మాటలో సందేహాలు రావచ్చు. ఉదా: సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించిన ప్రదేశాలలోనే అభిప్రాయ భేదం ఉంది. కొందరు కంచియని, మరికొందరు కాశ్మీరమని అన్నారు. దీనిని మూడు విధాలుగానే చెప్పవచ్చు. అసలు కంచి ప్రాంతానికి, కాశ్మీరమని పేరు కూడా ఉంది. ఈ మాట గోవింద నాథీయంలో ఉంది. ఇక కాశ్మీరంలో ఉన్నదానిని శారదా పీఠం అంటారని, కంచిలో ఉన్న దానిని సర్వజ్ఞ పీఠం అంటారని ఉంది. ఈ రెంటినీ ఆరోహించారని భావించవచ్చు. మరొక అభిప్రాయం ప్రకారం ఆదిశంకరులు కంచిలో అధిరోహించారని, అభినవ శంకరులు కాశ్మీరులో నున్న దానిని అధిరోహించారని అంటారు. ఇది తప్పుగా అర్ధం చేసుకోబడింది.


అట్లాగే కొందరు, ఆనందగిరులిద్దరున్నారని, మండన మిశ్రులిద్దరని పరిశోధనలు చేస్తున్నారు. శంకర విజయం వ్రాసిన ఆనందగిరి వేరని, శిష్యుడైన ఆనందగిరి వేరని; అట్లే బ్రహ్మసిద్ధి మీమాంసా గ్రంథాలు వ్రాసిన మండన మిత్రుడు వేరని, శంకరుల శిష్యులై సురేశ్వరాచార్యులుగా మారిన మండన మిశ్రులు వేరని వీరే నైష్కర్మ సిద్ధిని వ్రాసేరని అంటారు. సురేశ్వర మండన మిశ్రులే శంకరుల మార్గానికి అనుగుణంగా వ్రాసేరు. మరొక మండన మిశ్రుడు వ్రాసినది శంకరుల సిద్ధాంతానికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఈ సందేహానికి మరొక కారణం ఉంది. సురేశ్వర మండన మిశ్రులకే విశ్వరూపుడని మరొక పేరు కూడా ఉంది.


ఇట్లా ఉండగా కాలాంతరంలో వ్రాసేవారు తాము విన్నదానిని వ్రాయడం వల్ల సందేహాలకు తావిచ్చింది. తమ ఇష్టాన్ని బట్టి కూడా కొన్ని మార్పులు చేసియుండవచ్చు. కొన్ని మార్పులుండడం సహజం. లేఖకుల తప్పులూ దొర్లుతూ ఉంటాయి.


రాగద్వేషాలు జయించడం కష్టం. ఇది లేఖకులకూ చెందుతుంది. శంకరులు అన్ని సిద్ధాంతాలను అవలోకించి ఆయా స్థితులలో ద్వైతానికి, భక్తికి, సాంఖ్యానికి, యోగానికి, మీమాంసకు, చివరకు బౌద్ధానికి తగు ప్రాధాన్యమిచ్చి తుదకు అద్వైతమే పరమ ప్రామాణ్యమని నిర్ధారించారు.


No comments:

Post a Comment