Saturday, 17 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 194 వ భాగం



వీరు షణ్మత స్థాపనాచార్యులని వివరంగా చెప్పబడింది. షణ్మతాలలో కౌమారం (కుమార స్వామికి సంబంధించినది) ఉండగా ఇందు దానికి బదులు కాపాలికం ఉంది. 72 మతాలను వీరు తిరస్కరించారని, అందు కాపాలికం కూడా ఉందని ఉంది. అయితే కాపాలికుడైన వడక్కునాథర్ తన మతాన్ని ప్రచారం చేయవలసినదిగా ప్రార్ధిస్తే నీవు నీ మతాన్ని ప్రచారం చేసుకొనమని శంకరులనగా అతడు శంకరులు ఐదుగురు శిష్యులను సేవిస్తూ ఉండేవాడట. కాని ప్రసిద్ధమైన షణ్మతాలలో స్కాందం (కౌమారం) ఉంది. పరాశర మాధవీయంలో కూడా అట్లాగే ఉంది. శాస్త్ర ప్రకారం నడిచే శంకరులు, కౌమారాన్ని విడిచి పెడతారా?


ఈ ఆనందగిరీయంలోనే శంకరులు అనంతశయన క్షేత్రం నుండి సుబ్రహ్మణ్య క్షేత్రానికి (ఉడిపి దగ్గరిది కావచ్చు) వెళ్ళారని, అందు కుమార ధారలో స్నానం చేసారని, అక్కడ సర్పాకారంలో నున్న సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్ధించారని ఉంది. ఇది కర్ణాటక కావచ్చు, లేదా ఆంధ్ర ప్రాంతం కావచ్చు. శంకరుల సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ప్రసిద్ధి. ఇది తిరుచెందూర్లో నున్న మూర్తిపై వ్రాసినది. వేరే మతానికి చెందిన వ్యక్తి, వీరిపై అభిచార ప్రక్రియ (చేతబడి మొదలైనవి) చేయగా కొంతకాలం వీరు బాధపడ్డారని, సుబ్రహ్మణ్య -స్వామిపై స్తోత్రం వ్రాసేరని, అక్కడొక విశిష్ట విభూతి ద్వారా వీరి రోగం నయమయిందని అంటారు. ఒక ఆకుపై పెట్టి విభూతినిస్తారు. అది పత్రభూతి దానిని ఒంటికి రాయకున్నా, చూస్తే చాలని, రోగాలు పోతాయని, భూతప్రేత బాధలుండవని వ్రాసేరు:


"అపస్మార కుష్ఠ క్షయార్మ ప్రమేహ 

జ్వరోన్మాద గుల్మాది రోగాః మహాంతాః 

పిశాచాశ్చ సర్వే భవత్ప్రత్ర భూతిం 

విలోక్య క్షణాత్ తారకారే ద్రవంతే"


వీటివల్ల కౌమారాన్ని షణ్మతాలలో ఒకటిగా స్థాపించారని తెలుస్తోంది. ఇట్లా శంకర విజయాలను తులనాత్మక పరిశీలన చేసి పరస్పర విరుద్ధాంశాలు లేనివాటికి ప్రాధాన్యం ఇస్తూ నిర్ధారించాలి.


కేవలం బుద్ధితో నిర్ణయానికి రాకూడదు. భక్తిని, వినయాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయించాలి.


No comments:

Post a Comment