సంస్కృత నిఘంటువు వ్రాసిన మోనియర్ విలియమ్స్, ఆనంద గిరియంలో ఉన్న దిగ్విజయ యాత్ర సరిగానే ఉందని కితాబు ఇచ్చాడు. కనుక దేనిని ప్రమాణంగా భావించాలో చూడండి. ఏది ఇతిహాస, పురాణాల విషయాలతో పోలిక కల్గి యుంటుందో దానిని ప్రమాణంగా భావించాలి. ప్రజల విశ్వాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి దానినీ కాకమ్మ కథగా కొట్టి పారవేయకండి.
మూల గ్రంథాలనే శివ రహస్యానికి, మార్కండేయ సంహితకు భేదాలున్నాయి. ఈశ్వరుని నుండి పంచ లింగాలను శంకరులు గ్రహించినట్లు శివరహస్యంలో ఉండగా, మార్కండేయ సంహితలో వారే కైలాసానికి వెళ్ళి శంకరుని నుండి గ్రహించినట్లుంది. అంతేకాదు, సౌందర్య లహరి గ్రంథాన్ని పొందినట్లుంది. ఈ పంచ లింగాలను ఎక్కడ స్థాపించిన విషయం కూడా, ఈ సంహితలో ఉంది. పంచలింగాలను తీసుకోవడం రెండు గ్రంథాలు వ్రాసినా, ఎక్కడ అనే విషయంలో భేదాభిప్రాయం ఉంది.
అయితే శంకర జయంతిని జరిపే రోజు ఒక్కటే, కాలడి వారి జన్మ స్థలమని అందరూ వ్రాయగా ఆనంద గిరియంలో మాత్రం, చిదంబరమని యుంది. ఇట్టి మాటను ప్రమాణంగా భావించనవసరం లేదు. ఇట్లా కొన్నిటిని స్వీకరించవచ్చు. కొన్నిటిని తిరస్కరించవచ్చు.
చిదంబరం - శంకరులు
పరమేశ్వరుని నుంచి తెచ్చిన ఐదు స్పటిక లింగాలలో ఒకటి శృంగేరిలో, మరొకదానిని కంచి మఠంలో స్థాపించారు. ఒకదానిని కేదారనాథ్, నేపాల్లోని నీలకంఠ క్షేత్రంలోనూ ఇంకొకటి స్థాపించారు. ఐదవ దానిని చిదంబరంలో స్థాపించారు. సిద్ధి సమీపించేటపుడు ఐదవ దానిని సురేశ్వరులకిచ్చి చిదంబరంలో ప్రతిష్టింపుమని అన్నట్లుగా ఆనందగిరీయంలో ఉంది.
No comments:
Post a Comment