Wednesday, 21 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 198 వ భాగం



వీరి భాష్యాలు, స్వీయ రచనలు, జ్ఞాన మార్గాన్ని అందిస్తాయి. భాష్యాలలో పూర్వ పక్ష సిద్ధాంతాలున్నా సుదీర్ఘంగా ఉండవు. వారొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటపుడు దానికి విరుద్ధంగా నున్న ప్రశ్నలనన్నింటినీ లేవనెత్తి వాటికి సూటిగా సమాధానాన్ని అనగా సిద్ధాంతాన్ని అందిస్తారు. అట్లా వివిధ మతాలను, వైదిక మతాలుగా కనబడేవాటినీ ఎదుర్కొన్నారు. అయితే అన్నిటినీ అన్నివిధాల నివారించలేదు. ఇతర మతాలలో నున్న కొన్నిటిని హృదయపూర్వకంగా స్వీకరించారు. అంతేకాదు, అద్వైతంలో ఒక్కొక్క దశలో భిన్న భిన్న సిద్ధాంతాలకు చోటుందని నిరూపించారు.


గౌడభగవత్పాదులవారు మాండూక్యోపనిషత్తుపై కారికలు వ్రాయగా దానిపై శంకరులు విపులంగా వ్యాఖ్యానించారు. అందులో గౌడులు, అద్వైతులు కానివారు పరస్పరం వాదులాడుకొందురు గాక మాకు వానితో పేచీ పూచీలు లేవని వ్రాస్తే శంకరులు అందరూ అద్వైతానికి ఒక విధంగా దోహదం చేసినవారే అని తరువాతి శ్లోకంలో ద్వైతులకు ఆత్మ అద్వైతమని ప్రేమతో వ్రాసేరు.


"తతః పరమార్ధతో బ్రహ్మవిద్ అత్మైవ ద్వైతినాం" సూత్రభాష్యంలో తగు విధంగా ఇతర సిద్ధాంతాల పట్ల గౌరవాన్ని ప్రదర్శించారు. మీమాంసా శాస్త్రంపై భాష్యం వ్రాసిన శబరులను "ఆచార్యేణ శబర స్వామినా" అని; ఉపవర్షులను "భగవతో ఉపవర్షేణ" అని న్యాయ సూత్రాలు వ్రాసిన గౌతముని "ఆచార్య ప్రణీతం" అని, వారందరినీ ఆచార్య, స్వామి భగవాన్ అని పేర్కొన్నారు.


జ్ఞానానికి సంబంధించిన స్వీయ రచనలలో ప్రధాన సత్యాన్ని స్పష్టంగా పేర్కొంటూ, వాద ప్రతివాదాల పట్ల పెద్దగా దృష్టి పెట్టకుండా వ్రాసేరు. ఉపదేశసాహస్రి వంటి గ్రంథాలలో అనుభూతిపైనే దృష్టిని సారించినట్లు తెలుస్తుంది. వివేక చూడామణి వంటి గ్రంథాలలో కూడా అదేవిధంగా చేసారు. జీవన్ముక్తానందలహరి, ధన్యాష్టకం, యతి పంచకంలలో కేవలం అద్వైతానుభూతిని పొందినవారి స్థితిని పేర్కొన్నారు. యతి పంచకంలో కౌపీనవంతుల కంటె భాగ్యవంతుడెవడైనా ఉన్నాడా? అని ప్రశ్నించారు.


No comments:

Post a Comment