Tuesday 6 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 183 వ భాగం



రెండు రకాల సన్న్యాసం ఉంటుంది. సన్న్యాసం పుచ్చుకోవాలంటే కొన్ని శ్రాద్ధాలు, హోమాలు చేసి గురువునుండి పొందాలి. ఒకవేళ మంచం పట్టి విరక్తి కలిగి సన్న్యాసం పుచ్చుకొంటే దానిని ఆతుర సన్న్యాసమంటారు. మరొక రకం, అత్యాతుర సన్న్యాసం. దీనినే ఆపత్ సన్న్యాస మంటారు. రోగం బాగా ముదిరినా, ఏదైనా ప్రమాదం ముంచుకుని వచ్చినపుడు తీసుకొనేది ఆపత్ సన్న్యాసం. అట్టి సమయంలో ప్రైష మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు.


ఇట్లా శంకరులు సన్న్యాసం తీసుకున్నారు. మొసలి పట్టు సడలింది. అది ఆకాశంలో గంధర్వుడై కనబడింది. గంధర్వులు దివ్యదృష్టి కలవారు. దేవయోనులలో గంధర్వులొకరు.


గంధర్వుడు గత జన్మ -


గంధర్వుడు తన కథనిట్లా వివరించాడు. "నేను త్రాగుతూ, స్త్రీలతో క్రీడిస్తూ ఉండేవాణ్ణి. ఇంతలో మహర్షి దుర్వాసుడు వచ్చాడు. అతణ్ణి నేను గౌరవించలేదు. నీళ్ళల్లో విహరించే నన్ను చూసి మొసలిగా పడి యుండమని శపించాడు.” "వెంటనే అతని కాళ్ళు పట్టుకొన్నా. అతడు శంకరావతారం కదా! అతడు రుద్రుడైనా” ఆశుతోషియే. అనగా శీఘ్రంగా సంతోషించువాడే. నీవు పరమశివుని కాళ్ళు పట్టుకొన్నపుడు శాపవిముక్తి కల్గుతుందని అనుగ్రహించాడు.”


“నా దగ్గరకు పరమేశ్వరుడెట్లా వస్తాడని ప్రశ్నించాను. నిన్ను వెదుకుతూ అతడే అవతరిస్తాడులే అన్నాడు" ఇది చెప్పి ఆ గంధర్వుడు శంకరులకు నమస్కరించి అంతర్ధానం పొందాడు. అంటే శంకరుల కాళ్ళు పట్టుకుంటే మనకూ నివృత్తి మార్గం దొరుకుతుందన్నమాట.


No comments:

Post a Comment