Friday 2 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 179 వ భాగం



వేదమే శంకరుల ఊపిరి. అవైదిక మతాలను గెంటివేసి శ్రుతిమార్గాన్ని స్థాపించారు. శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని వారిని కీర్తిస్తున్నాం. కనుక వేద స్వరూపిణిని నుతించకుండా ఉంటారా? వారు జ్ఞానావతారుడైనా కర్మానుష్టానాన్ని కాదంటారా? కర్మానుష్టాన ఫలాలను ప్రసాదించేది కనుక శ్రుతి స్వరూపిణిగా నుతించారు. శుభకర్మ ఫలప్రసూతాయై అనే ఈ నామం వల్ల మీమాంసకులకు జవాబు చెప్పినట్లైంది. 


ఆమె సద్గుణాల సముద్రమని చెప్పడానికి రత్యైనమోస్తు రమణీయ గుణావర్గాయై అన్నారు. అన్ని కర్మలూ శ్రుతిపై ఆధారపడ్డాయి. అప్పుడే అవి శుభకర్మలౌతాయి. వాటివల్లనే మనకు ఇహ పరసుఖాలు లభిస్తాయి.


గుణ కర్మలకు రెంటికీ సంబంధం ఉంది. గుణకర్మల వల్లనే నాల్గు వర్ణాలను ఏర్పాటు చేసానని గీతా వాక్యం. గుణాన్ని బట్టి కర్మ ఉంటుంది. ముందు శుభకర్మ ఫలాలనిస్తుందని, సద్గుణాల రాశియనే మాటతో కలిపారు.


దేనికైనా శక్తి కావాలి కదా! కనుక శక్త్యే నమోస్తు అన్నారు. శత పత్రనికేతనాయై అనడం వల్ల పద్మంలో నివాసముంటుందని అర్ధం. కుండలినీ యోగం గురించి చెప్పేటప్పుడు సహస్రదళ పద్మంలో పరమశివునితో ఉంటుంది.


ఇక్కడ లక్ష్మిని పద్మవాసినిగా పేర్కొన్నారు. పుష్ట్యై నమోస్తు అనగా పోషణవల్ల బలం వస్తోంది. భువన పోషకునకు భార్యయై సమస్త ప్రాణులను పోషిస్తోంది.


రతి (సంతోషం) పుష్టికావాలంటే శ్రుతియే ఆధారం కనుక ముందుగా శ్లోకంలో శ్రుతిని పేర్కొన్నారు. అనగా పుష్టి, రతులు, శ్రుతికి అనుగుణంగా ఉండాలన్నమాట.


ఆనందరూపిణీగా శక్తిరూపిణిగా, పూర్ణ రూపిణిగా ఉన్నావని చివర ప్రతిదానికి నమోస్తు అని నమస్కరించారు.


No comments:

Post a Comment