Wednesday 7 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 184 వ భాగం



గురువునకై అన్వేషణ


అమ్మా! నీవు సన్న్యాసానికి అంగీకరించావు. కనుక ఇకనుండి ప్రతి స్త్రీ నాకు తల్లియే. వారే భిక్షనిస్తారు. ఇక నీవే తల్లియని భ్రాంతి పడవద్దు. నేను జ్ఞానోపదేశం పొందాలి. గురువునకై వెళ్ళాలి. అతడే నాకు తండ్రి. జ్ఞానాన్ని పొంది ఇతరులకు ఉపదేశిస్తూ ఉంటే విన్నవారందరూ నా బిడ్డలే అవుతారు. నేను శాంతియనే స్త్రీని వివాహమాడాను:


"భిక్షాప్రదా జనన్యః పితరో గురవః కుమారకాః శిష్యాః

ఏకాంత రమణా హేతుః శాంతిః దయితా విరక్త స్య"


కనుక అనుజ్ఞ నిమ్మని అన్నారు. నా చివరి కాలంలో నిన్నెట్లా చూడకుండా ఉండగలనని తల్లి వాపోయింది. నీ చివరి గడియలలో నీవు తలుచుకున్న వెంటనే నీ దగ్గరే ఉంటాను. చివరి కర్మను చేస్తానన్నారు.


అయితే సన్న్యాసి కర్మ చేయవచ్చా? మాతృ ఋణాన్ని ఎవ్వరూ తీర్చుకోలేరని ఉంది. సౌత్రామణియనే మహా యజ్ఞాన్ని చేసి పితృఋణం తీర్చుకోవచ్చు. చాలామంది సోదరులుంటే ఒకనికీ పని అప్పజెప్పవచ్చు. కాని శంకరులకు సోదరులు లేరు. ఒకడున్నపుడు సన్న్యాసమే పనికిరాదు.


అవతారునిగా పుట్టారు. తల్లి అవతార స్త్రీ కాదు. అందువల్ల ఆమె కోరినట్లే వీరు చేయాలి. దహన కర్మ ఒక్కటే చాలు, తర్పణాదులు, శ్రాద్ధాదుల అవసరం లేదు (ఇట్లా చేయవచ్చని విశ్వేశ్వర స్మృతిలో నున్నట్లు స్వామివారు చెప్పారని ఋషి పీఠం పత్రిక ద్వారా తెలిసికొన్నాను - అనువక్త)


ఒకడు సన్న్యాసం పుచ్చుకుంటే అతని పూర్వాశ్రమ తనయుడు 11వ రోజునగాని 12వ రోజున గాని పార్వణ శ్రాద్ధం ఒక్కటే చేయాలి. అట్లా సన్న్యాసి తండ్రికీ, తనయుడా విధి చేసినట్లు తానూ దహనం చేయవచ్చని శంకరులు భావించారు.


No comments:

Post a Comment