Sunday, 25 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 202 వ భాగం



పద్మపాదుల వృత్తాంతం


శంకరులు, కాశిలో ఉండగా పద్మపాదుడు కలిసాడు. అప్పటికింకా శంకరులకు 16 సంవత్సరాలు నిండలేదు. పద్మపాదుని అసలు పేరు సనాతనుడు. చోళ ప్రాంతానికి చెందిన వాడు. అతనికి చిన్నపుడొక వృద్ధుడు నృసింహ మంత్రాన్ని ఉపదేశించాడు. దానిని జపించి స్వామి యొక్క సాక్షాత్కారాన్ని పొందాలనుకున్నాడు. ఇంటిని విడిచి కొండ శిఖరం ఎక్కి తపస్సు చేస్తూ ఉంటే ఒక బోయవాడు వచ్చి జంతువులు తిరిగే ఈ ప్రదేశంలో ఉన్నారేమిటి, ప్రమాదకరం, వద్దని అన్నాడు.


తపస్సనేమాట అతనికి అర్ధం కాదనుకుని సింహం యొక్క ముఖం, మిగిలినదంతా మానవ శరీరం కలిగిన మృగం కోసం వెదుకుతున్నానని అది కావాలని అన్నాడు.


“మీరు నిజం మాట్లాడుతున్నారా? అటువంటిదానిని నేనెపుడూ చూడలేదే, అది యుండడం సత్యమైతే నేను తీసుకుని వస్తానని బోయ అన్నాడు. సనాతనుడు నవ్వాడు. ఇతడు దూరంగా పోతే తపస్సు నిర్విఘ్నంగా సాగుతుందని భావించాడు. "నీ పని నీవు చూచుకోవయ్యా రేపు సాయంకాలం లోపుగా తీసుకొని వస్తా కాకపోతే ఉరి పోసుకుని చనిపోతా" అంటూ బోయ బయలుదేరాడు.


ఆ నిష్కపటియైన ఆటవికుడు అడవిలో వెదకటం మొదలు పెట్టాడు. గడువు తీరిపోతోంది. ఇక తాను ఉరి పోసుకుని చనిపోవాలని నిర్ణయించి సిద్ధమయ్యాడు. ఇంతలో నృసింహమూర్తి సాక్షాత్కారించాడు. ఆయనను త్రాటితో కట్టి బోయ పద్మపాదుని ముందుంచాడు. "చూడండి స్వామి మీరడిగిన జంతువును తెచ్చాను" అని బోయ అంటున్నా పద్మపాదునకు, ఆ మూర్తి కనబడలేదు. ఇది భ్రాంతా? బోయ, అబద్దం చెబుతున్నాడా? అని వితర్కించాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తేనేగాని లభించని దివ్య దర్శనం, ఈ బోయకు లభించిందని బాధపడుతూ ఉంటే ఒక అశరీరవాణి వినిపించింది. అవసరమైనపుడు, నీకు సాక్షాత్కారిస్తానులే అనే మాట వినబడింది.


భగవానుడు, నిష్కపటియైన బోయకు చిక్కాడు.


No comments:

Post a Comment