Monday 5 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 182 వ భాగం



ఆ పథకం


తల్లితో నదీ స్నానానికి వెళ్ళారు. ఒక మొసలి వీరి కాలిని పట్టుకుంది. ఆ నదీ ఘట్టాన్ని మలయాళంలో ముదలై (మొసలి) కడవు అని నేటికీ అంటారు.


“అమ్మా! నేను మరణించడం ఖాయం. ఈ దుర్మరణం వల్ల తగిన ఫలాన్ని రాబోయే జన్మలోనూ అనుభవించాలి. నీకు నేను కర్మ చేసే యోగం దక్కదు. నేను సన్న్యాసం పుచ్చుకుంటే మరొక జన్మనెత్తినట్లే. ఈ జన్మలో రావలసిన ఇప్పటి మరణం వాయిదా పడవచ్చు. మొసలి నన్ను విడిచి పెట్టవచ్చు. వంశంలో ఒక సన్న్యాసి పుడితే 21 తరాలు తరిస్తాయని పెద్దలంటారు. ఒకవేళ సన్న్యాసిగా ఉండి మొసలి నన్ను చంపినా నాకు దుర్మరణం ప్రాప్తించదు.”


"నీళ్ళల్లో నిలబడి సన్న్యాస దీక్షలో ఉచ్చరించే 'ష' మంత్రాన్ని ఉచ్చరించాలి. మానసికంగా అన్నిటినీ విడిచి పెట్టాలి. నేనెట్లాగూ నీళ్ళల్లో ఉన్నా. ఈ అవకాశం జారిపోతే మొసలి నన్ను తినడం ఖాయం. నాకు దుర్మరణమూ ప్రాప్తిస్తుంది. నీ అనుజ్ఞ లేనిదే నేను సన్న్యాసాన్ని స్వీకరించకూడదు కదా, నిర్ణయించమని” అన్నారు.


తల్లి సందిగ్ధావస్థలో పడింది. బ్రతికుంటే సన్న్యాసియైన కొడుకునేప్పుడైనా చూడవచ్చు. నేను చూడలేకపోయినా బ్రతికియుంటాడులే అనుకొని, నీ ఇష్టం నీ వచ్చినట్లు చేయమంది. అంటే పరమేశ్వరునకే విడిచిపెట్టింది.


తాను వద్దని చెప్పలేదు. కాబట్టి ఆమె అనుజ్ఞ ఇచ్చినట్లు భావించి ప్రైష మంత్రాన్ని ఉచ్చరించారు.


అనగా నానుండి ఏ ప్రాణికీ భయము గాని, ప్రమాదము గాని లేకుండుగాక "అభయం సర్వభూతేభ్యో మత్తః స్వాహా" అంటే ఇతణ్ణి చూడటంతో అందరూ సంతోషిస్తారన్నమాట. గృహస్థు, కర్మలను చేసేటపుడితరులను బాధ పెట్టవలసి వస్తుంది. అందువల్ల ఇతణ్ణి చూసి ఇతరులు బాధపడతారు. గృహస్థుకు చెట్లు కూడా భయపడతాయి. అవి కాయ కూరలను, పండ్లనిస్తున్నాయి కనుక వాటికి హాని చేస్తాడని భయపడతాయి. కాని అట్టి కర్మలు, సన్న్యాసికి ఉండవు కనుక భయపడవు. ఎందుకంటే అతడు రాలిన పండునో, రాలిన ఆకునో లేదా ఇతరులు పెట్టిన అన్నాన్నో తింటాడు. జైన బౌద్ధులు చెప్పిన పూర్తి అహింసాధర్మం మన సన్న్యాసంలోనూ ఉంది.


No comments:

Post a Comment