Thursday 8 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 185 వ భాగం



ఇక సన్న్యాసి యొక్క పూర్వాశ్రమ బంధువులలో కొడుకు పోయినా, సన్న్యాసి స్నానం కూడా చేయనవసరం లేదు. అయితే ఇతని తల్లి దండ్రులు పోతే సన్న్యాసి సచేల స్నానం చేస్తే చాలు. అందరూ సన్న్యాసికి నమస్కరించాలి. కాని తిరిగి ఇతడు వారికి నమస్కరించకూడదు. తండ్రి కూడా ఇతనికి నమస్కరించాలి. కాని సన్న్యాసి, తల్లికి ఒక్కతికే నమస్కరించాలి.


"ప్రసూః వంద్యా"


"సర్వావంద్యేన యతినా ప్రసూః వంద్యా హి సాదరం" ఆదరంతో నమస్కరించాలని ఉంది.


ఎక్కువ వ్యాస పూజలు చేసిన సన్న్యాసి చిన్నవాడైనా తక్కువ వ్యాస పూజలు ' చేసిన సన్న్యాసి ఇతని కన్నా పెద్దవాడు అయినా సరే ఇతనికి నమస్కరించాలి. అట్లా తల్లికి వాగ్దానం చేసి బయలుదేరాడు.


వీరికి గురువు కావాలా?


ప్రైష మంత్రం ఉచ్చరించి తమంత తామే సన్న్యాసం పుచ్చుకున్నపుడు ప్రత్యేకంగా గురువు కావాలా? ఏదైనా ఆపదలో నున్నపుడు ఆపత్ సన్న్యాసం పుచ్చుకొన్నా, ప్రమాదం తప్పినపుడు గురువునుండి ప్రణవోపదేశాన్ని, మహా వాక్యాలను ఉపదేశం పొందాలనే విధి యుంది.


వారవతార పురుషులు కదా, వారికి గురువు కావాలా? అని సందేహం. అవతారమైనా మానవ రూపంలో ఉన్నారు కనుక లోకానికి ఆదర్శంగా ఉండడం కోసం లోక మర్యాదను పాటించాలి. అట్లా వారు చేయకపోతే వారిననుసరించి ఇతరులు కూడా గురువక్కరలేదనుకుంటారు. ఏ పుస్తకం చూసో మనమూ వేదాంతాన్ని నేర్చుకోవచ్చనే భ్రాంతి పడతారు. కనుక లోకాచారాన్ని పాటించారు.


మూడు భువనాలలో నేను చేయవలసిన కర్తవ్యం లేదని గీతాచార్యుడు "నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషే కించన" అంటూ "అనేకమైన పనులు చేస్తున్నాను చూసావా? నీ రథాన్ని నడుపుతున్నా, మొన్న రాయబారిగా వెళ్ళాను, ఒకరితో యుద్ధం, మరొకరితో సఖ్యం ఇట్లా చేస్తూనే ఉన్నా. ఇందు వ్యక్తిగతమైన లాభమేమైనా ఉందా? నేనిట్టా చేయకపోతే కృష్ణుడే పనులు చేయలేదు, మనమెందుకు చేయాలని ఇతరులు కూడా తమ తమ ధర్మాలను పాటించరు కదా! సంఘంలో ఒక నియమం పోతుంది. అస్తవ్యస్థ పరిస్థితులేర్పడతాయి. కనుక నాకోసం నేనేమీ చేయనవసరం లేకపోయినా ఇతరులను తీర్చిదిద్దడం కోసం అనేకమైన పనులు చేస్తున్నాను. ఏ పనీ చేయని నన్ను ఆదర్శంగా భావించి ప్రజలు చెడిపోకుండా ఉండడం కోసం చేస్తూ ఉంటానని” కృష్ణుడన్నాడు.


No comments:

Post a Comment