Friday 16 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 193 వ భాగం



అయితే చోళులకు కులదైవం, నటరాజు, చోళరాజులకు తంజావూర్, ఉరైయూర్ మొదలగునవి రాజధానులైనా పట్టాభిషేకాన్ని చిదంబరంలోనే నిర్వహించేవారు. అప్పటి కిరీటం పట్టాభిషేకంలోనే ఉంటుంది. మిగిలిన సమయంలో చిదంబరంలోని దీక్షితుల ఆధీనంలో ఉంటుంది.


కురువ నాయనార్, చోళ రాజును జయించిన తరువాత, తనకూ పట్టాభిషేకం చేయమని దీక్షితులనడిగాడు. చోళ రాజ్యంలో వంశపరంపరగా వస్తున్నవారికే చేస్తాము గాని ఇతరులకు చేయమని అన్నారు. ఇట్లా రాజునకు, ఇష్టం లేని మాటను చెప్పి అక్కడ ఉండడం మంచిది కాదని, ఒక్క దీక్షితుణ్ణి ఉంచి ఆ చిదంబరాన్ని విడిచి పెట్టారు. ఆలయంలో కిరీట రక్షణకై ఒక్కణ్ణి యుంచారు. అట్లా అతనిచేత, రాజు పట్టాభిషేకం చేయించుకోలేదు. సంస్కృతిని ఎట్లా గౌరవించాడో చూసారా?


వారు, చేర రాజ్యమైన మలయాళ దేశం వెళ్ళారు. ప్రక్కనున్న పాండ్య దేశానికి కాకుండా దూరంగానున్న మలయాళ దేశానికి వెళ్ళారు. ఇట్లా వీరికి ఈ దేశంతో అనుబంధం ఏర్పడింది.


ఆనందంలో శంకరులు, చిదంబరంలో పుట్టారని, వారి తండ్రి విశ్వజిత్ అని, తల్లి విశిష్టయని యుంది. పరిశోధించగా ఈయన శంకరులు కాదు. క్రీస్తు తరువాత 788 నాటివాడు. శంకరులను, అభినవ శంకరులను ఎట్లా కలిపేసారో చూసారా?


చిదంబరంలో శంకరులు, నటరాజు మాదిరిగా వెలుగొందుతున్నారని "సాక్షాత్ చిదంబరేశ ఇవవి రాజమానః" అని ఆనంద గిరియంలో ఉంది. ఇందులో గోవింద భగవత్పాదులను చిదంబరంలో కలిసినట్లుంది. మిగతా శంకర విజయాలలో నర్మదా నదీ తీరంలో కలిసినట్లుంది. దీనిని గమనించండి. అయితే చిదంబరానికి, గోవిందులకు సంబంధం ఉంది. ఆయన పతంజలి అవతారం కదా! పతంజలికి చిదంబరానికి సంబంధాన్ని చెప్పాను. శంకరులకు పరమ గురువులు, గౌడపాదులు, వ్యాకరణోపదేశాన్ని చిదంబరంలోని పతంజలి నుండియే స్వీకరించారని ఐతిహ్యం. వీటినట్లా ఉంచినా వీరెల్లపుడూ చిదంబరస్థులే, అనగా జ్ఞానాకాశంలో ఉండేవారే. ఇట్లా భావించి శంకరులకు చిదంబరంలో ఉపదేశం ఇచ్చినట్లు ఆనందగిరీయం వ్రాసిందని భావించవచ్చు. విశ్వనాథుడు, చండాలునిగా రావడం, మరణ సమయంలో శంకరులు తల్లి దగ్గరకు వెళ్ళడం మొదలైన విషయాలు ఆనంద గిరియంలో లేవు. మిగతా గ్రంథాలలో ఉన్నాయి.


No comments:

Post a Comment