Saturday, 24 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 201 వ భాగం



స్తోత్రాలలో నిర్గుణ బ్రహ్మమే సగుణ సాకార బ్రహ్మమౌతుందని అన్నారు. అనగా రూపం లేనివాడు, సత్త్యాది గుణాలు లేనివానిని రూపవంతునిగా, కల్యాణ గుణాలు కలిగినవానిగా ధ్యానిస్తున్నామని అర్ధం. గోవిందాష్టకంలో కృష్ణుని బాల్య లీలలను వర్ణిస్తూ నిష్క్రియుడైన పరబ్రహ్మమిట్లా అవతరించిందని అన్నారు. దీని ఆరంభమే సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం అనే పదాలతో ఉంటుంది.


విష్ణు సహస్రనామాలకు భాష్యం వ్రాస్తూ నిర్గుణము, సగుణము, భక్తి, జ్ఞానమూ ఒక్కటే అని ప్రతిపాదించారు.


అద్వైతము, భక్తి ఎట్లా కలిసాయో చూడండి. లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం ఉంది. కాని ఇది వీరి కరావలంబ స్తోత్రం అంత ప్రచారాన్ని పొందలేదు. దీనిలో ఒకచోట ఇలా అన్నారు. ముఖంలో బొట్టు లేదని గుర్తించామనుకోండి. దానికి మనమేమి చేస్తాం? అద్దం మీద గుర్తు పెడతామా? అట్లా చేస్తే అద్దం, మురికిగా ఉండదా? ఏం చేయాలి? మన ముఖానికి తిలకం పెట్టుకుంటే ప్రతిబింబంలోనూ కన్పిస్తుంది కదా! అట్లాగే ఒక చైతన్యం యొక్క ప్రతిబింబమే ఈ జగత్తంతా మాయవల్ల భిన్నంగా కన్పిస్తోంది. అలంకరించుకోవాలంటే ఆ తిలకాన్ని నీవు తీర్చిదిద్దుకోవాలి. లోనున్న ఆత్మకు, ఇంద్రియాలూ, శరీరం, ప్రతిబింబాలవంటివి. వీటినే అలంకరిస్తే అద్దాన్ని మురికిచేసినట్లింతుంది. అయితే లోనున్న చైతన్యానికి అలంకరించడం ఎట్లా? అది లోపల ఉన్నట్లు నాకు తెలియలేదంటావా? లక్ష్మీ నరసింహమూర్తి ఆకారంలో ఉన్నాడు. అతణ్ణి నిరంతరం భజించు, ధ్యానించు. అట్లా అతణ్ణి అలంకరిస్తే అతనికి కల్యాణం చేస్తే మనకే కల్యాణం, శుభం, ఆనందం కల్గుతాయి. పరమేశ్వరునిలో నున్న కల్యాణ గుణాలను భావిస్తే నీవే కల్యాణ గుణ సంపన్నుడవౌతావు.


అయితే అన్ని స్తోత్రాలకు భిన్నంగా దక్షిణామూర్తి అష్టకాన్ని వ్రాసేరు. అందు భగవల్లీలలుండవు. అంతా వేదాంత తత్త్వం ప్రతిపాదకంగా ఉంటుంది. ప్రతి శ్లోకం చివర "శ్రీ గురుమూర్తయేనమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే" అని యుంటుంది.


వీరి భజ గోవింద స్తోత్రం, అంతా భక్తి జ్ఞానాలను అందిస్తుంది. 


అందువల్ల ఇంతకు ముందున్న మార్గాన్నే మరల ప్రతిష్టించారు గాని క్రొత్త దానిని చెబుతున్నానని అనలేదు. క్రొత్త మత స్థాపకుడనని జబ్బలు చంచలేదు.

No comments:

Post a Comment