Tuesday, 27 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 204 వ భాగం



నేను గంగా తీరంలో ఉండగా మీకేదో కీడు జరిగిపోతోందని అనిపించింది. వెంటనే ఇక్కడ నాకు తెలియకుండానే కనబడ్డానని అన్నాడు.


నాకు నృసింహపదేశం ఉందని, అది జపిస్తూ తపస్సు చేస్తున్నప్పుడు స్వామి బోయకు కనపబడిన విషయం, తనకు అవసరం వచ్చినపుడు సాక్షాత్కరిస్తానని స్వామి అపుడు చెప్పిన విషయం గురువునకు చెప్పి పద్మపాదుడు - స్వామికి ఆచార్యులకు ప్రణామాలు అర్పించాడు.


వ్యాసునితో చర్చ - ఆయుర్దాయం పొడిగింపు


బ్రహ్మ సూత్రకర్తయైన వ్యాసుడు, శంకరులు వ్రాసిన సూత్రభాష్యం వ్యాప్తి చెందాలని, సరియైన అర్ధం, అందరికీ తెలియాలని, ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి అనేక ప్రశ్నలను సంధించాడు. సమాధానానికి సంతోషించినా మాటి మాటికీ అడ్డుకొనేవాడు. వితండవాదం చేసేవాడు. వాదం అంటే ఋజుమార్గంలో వాదించడం. జల్పం అంటే అడ్డదిడ్డంగా వాదించడం. ఇక వితండమంటే అవతలివాణ్ణి తప్పు పట్టడంలోనే తృప్తి కాని, తన సిద్ధాంతం అంటూ ఏదీ చెప్పకపోవడం.


ఇట్లా రోజులు దొర్లిపోతున్నాయి. పద్మపాదుడు తన అలౌకిక శక్తితో వచ్చినవాడు వ్యాసుడని గ్రహించి అతడు నారాయణుడేయని, తన గురువు సాక్షాత్తు శంకరావతారమేనని, కింకరులమైన మేమేమి చేయగలమని ఒక శ్లోకం చదివాడు.


"శంకరః శంకరః సాక్షాత్, వ్యాసో నారాయణో హరిః

తయోః వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం" 


ఇట్లా వారిద్దరికీ నమస్కరించాడు. మీ నిజ రూపాలను చూపించండని ప్రార్ధించాడు. వ్యాసుడు ప్రత్యక్షమై ఎందుకిట్లో వాదించానంటే ఎవరే ప్రశ్నలు వేసినా అన్నిటికీ నీ భాష్యం సమాధానం చెప్పగలగాలని, నేను దీనిని సంపూర్ణంగా అంగీకరించానని తన ఆమోదాన్ని, ప్రమోదాన్ని తెలిపాడు.


No comments:

Post a Comment