Thursday 15 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 192 వ భాగం



చిదంబరం అంటేనే, వేదాంత వీథిలో విహరిస్తున్నట్లుగా ఉంటుంది. అది జ్ఞానాకాశమే. మిగిలిన పుణ్యక్షేత్రాలు, అక్కడున్న స్థలపురాణాలతో సంబంధం కలిగి ఉంటాయి. కాని చిదంబరమే వేదాంతార్ధంతో కూడియుంది. దీనికి వ్యాస పురమని, పులియూరని పురాణాల బట్టి యున్నా చిదంబరంగానే ప్రసిద్ధి. పంచకృత్యాలు చేసే నటరాజునకు సమీపంలో వట్టి ఆకాశాన్ని తలపింపచేయడమే కాకుండా, ఆత్మ తత్త్వాన్ని తెలివిడి చేస్తుంది. ఆ ఆత్మ తత్త్వమే ఆకాశము. యోగతారావళి గ్రంథంలో శ్రీశైలాన్ని స్మరించినట్లు, వివేక చూడామణిలో చిదంబరం ప్రస్తావింపబడింది. ఇందు జీవన్ముక్తుని గురించి చెబుతూ, అతడు జ్ఞానాకాశంలో స్థిరంగా ఉంటాడని, అతడే విధంగానైనా ప్రవర్తించవచ్చని, దిగంబరంగా లేక చర్మాంబర ధారిగానైనా ఉంటాడని చెప్పబడింది. అక్కడ వారు "చిదంబరస్థ" అనే పదం వాడారు. అనగా జ్ఞానాకాశంలో ఉన్నవాడని.


కేరళ సమీపంలో కొంగునాడులో పేరూర్ అనే నటరాజు క్షేత్రం ఉంది. దీనిని ఆది చిదంబరం అంటారు.


దేవతా సన్నిధులను కేరళలో అంబళం అంటారు. తమిళనాడులో పొన్నంబళం, చిత్రంబళం అని నటరాజ సన్నిధిని అంటారు. ఇతర ఆలయాలకు, తమిళనాడులో ఉన్నట్లుగా ఈ సన్నిధులకు గోపురాలుండవు. కేరళలోని ఆలయాలుగా ఉంటాయి.


చిదంబరంలోని అర్చకులను దీక్షితార్ ని అంటారు. వీరికి శిఖ, వెనుక భాగంలో కాకుండా ముందు భాగంలో ఉంటుంది. నంబూద్రీలు, ఊర్ధ్వ శిఖ కలిగియుంటే వారికి ముందు భాగంలోనే కొంచెం ప్రక్క కుంటుంది.


ఈ దీక్షితార్లకు కేరళకు ఒక సంబంధాన్ని పెరియ పురాణం వెల్లడించింది. చోళ దేశంలో కుట్రువ నాయనార్ అనే చిన్న రాజుండేవాడు. అతడు చోళరాజునకు పన్ను కడుతూ ఉండేవాడు. పంచాక్షర జపం వల్ల ఇతడనేక ప్రాంతాలను జయించి, తుదకు చోళరాజును కూడా జయించాడు.


No comments:

Post a Comment