Wednesday, 28 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 205 వ భాగం

 


ఎందరో విద్వాంసులు నీ దగ్గరకు వస్తారు. ఏదో పుస్తకం వ్రాసి ఊరుకోవడం కాదు, ఎందరినో నీవు ఉద్ధరించాలి కనుక, మరల 16 సంవత్సరాలు ఆయుర్దాయాన్ని పొడిగిస్తున్నానని వ్యాసుడు అన్నాడు. నీవు దిగ్విజయం చేయాలి. నీవల్ల ధర్మోద్ధరణ జరగాలని ఆయుర్దాయాన్ని పొడిగించే బ్రహ్మను ఆ పనికి పురమాయించాడు. ఈశ్వర అవతారానికి నేను ఆయుర్దాయం పొడిగించడమేమిటని, ఎంతకాలం ఉండదలచుకుంటే అంతకాలం ఉండుగాక అని బ్రహ్మ చెప్పుగా ఇద్దరూ అంతర్ధానమయ్యారు.


ఇట్లా కాశిలో వీరుండగా భాష్యోపదేశము, పద్మపాదుడు శిష్యుడగుట, వ్యాస శంకరుల చర్చ, వీరి ఆయుర్దాయం పొడిగింపు మొదలైనవి జరిగాయి. మరో సంఘటనను వివరించే ముందు పద్యపాదుల పూర్తి వృత్తాంతం వినిపిస్తా.


పద్మపాదుల గురించి


సనాతనుడు, పద్మపాదుడెట్లా అయ్యాడు? ఒకనాడితడు, గంగకు అవతలి ఒడ్డున ఉన్నాడు. శంకరులు స్నానం చేస్తున్నారు. వీరి పొడిబట్టలతనిదగ్గర ఉన్నాయి. ఇతని అచంచల భక్తిని లోకానికి తెలియజేయడం కోసం పద్మపాదా! బట్టలు తీసుకొని రా అని సంజ్ఞ చేసారు. గంగ, వేగంగా ప్రవహిస్తోంది. ఆ పైన లోతుగా ఉంది. గురువు యొక్క మాట వినీవినగానే తడుముకోకుండా నేల మీద నడిచినట్లే నీటిపై నడవడం మొదలు పెట్టాడు. నీళ్ళున్నాయని కాని, నది దాటడానికి నావ కావాలని కాని, ఆలోచించలేదు. ఇతని భక్తిని

చూసి పరవశించిపోయి, గంగ, అతని పాదాల క్రింత తామరలను మొలిపించిందట. అంటే ఇతని పాదాలు పద్మాలపై ఉన్నాయన్నమాట. గంగను దాటి గురువునకు వస్త్రాలనర్పించాడు. ఎట్లా దాటావని శంకరులు ప్రశ్నించారు. ఎవరిని స్మరిస్తే సంసారమనే సముద్రమే మోకాలి బంటిగా మారుతుందో, అట్టివారి పనులకు గంగ, ఆటంకంగా ఉంటుందా? అని జవాబిచ్చాడు. అప్పటి నుండి అతనికి పద్మపాదుడనే వ్యవహారం.


No comments:

Post a Comment