Friday 9 September 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 186 వ భాగం



ఆ విధంగానే శంకరులు గురువు కోసం అన్వేషణ చేస్తూ కేరళనుంచి నర్మదా తీరం దాకా వెళ్ళి గోవింద భగవత్పాదులను ఆశ్రయించారు. ఎక్కడ కలిసి కొన్నాడనే విషయంలో శంకర విజయాలలో భిన్నాభిప్రాయా లున్నాయి. కొందరు నర్మదా నదీ తీరమని, మరికొందరు బదరికాశ్రమమని, మరికొందరు వారాణసియని వ్రాసేరు. ఆ పుస్తకాల పేర్లుచెబుతా.


శంకర విజయములు


బృహత్ శంకర విజయం - ప్రాచీన శంకర విజయం - ఆనంద గిరియ శంకర విజయం - వ్యాసాచలీయ శంకర విజయం - మాధవీయ శంకర విజయం - చిద్విలాసీయ శంకర విజయం - కేరళీయ శంకర విజయం - గోవిందనాధీయ శంకర విజయం - ఇట్లా ఎనిమిది యున్నాయి. ఇక సదానందులు వ్రాసిన శంకర దిగ్విజయ సారం కూడా ఉంది.


బృహత్ శంకర్ విజయం పూర్తిగా దొరకడం లేదు. అందలి విషయాలను మిగిలిన గ్రంథాలు అక్కడక్కడా పేర్కొన్నాయి. అది శంకరుల కాలంలోనే వ్రాయబడినట్లు భావించవచ్చు. అట్లాగే ప్రాచీన శంకర విజయం కూడా. ఆనందగిరీయం యొక్క కర్త పేరు అనంతానందగిరి. చిద్విలాసుడు, విజ్ఞాన కందుల సంభాషణ పూర్వకంగా చిద్విలాసీయం ఉంటుంది. కేరళలో వ్రాయబడినది కనుక కేరళీయం. గోవిందనాథుడు కేరళీయుడు. వీటిల్లో మాధవ శంకర విజయం ప్రసిద్ధిని పొందింది.


ఇక లోగడ పేర్కొన్న రామభద్ర దీక్షితులు శంకరాభ్యుదయం వ్రాసినవాడు. ఎనిమిది సర్గలతో కవితామయంగా ఉంటుంది. వీరి పతంజలి చరితంలో సూక్ష్మంగా శంకరుల చరిత్రను వ్రాసేరని చెప్పాను. వీరు నీలకంఠ దీక్షితుల శిష్యులు.

No comments:

Post a Comment