"వచ్చి?" అడిగాడు విక్రమార్కుడు. "అక్కడికి కొన్ని ఆమడల దూరంలో అమడంటే 8 మైళ్లు. ఒక పెద్ద మర్రి చెట్టుంటుంది. ఆ మర్రిచెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూంటుంది. ఆ శవ శరీరమును నేను తపస్సు చేసే చోటుకి తేవాలి." అన్నాడు సన్యాసి.. "అలాగే" అంగీకరించాడు విక్రమార్కుడు. “మరి.. నేను రావలసిన ప్రదేశం?" అడిగాడు. నేను తపస్సు చేసే స్థలం చేరుకుందుకు గుర్తులు చెబుతాను. జాగ్రత్తగా విని గుర్తుంచుకో" అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం గుర్తులూ చెప్పి వెళ్లిపోయాడు సన్యాసి.
బహుళ పక్షము అమావాస్య రానే వచ్చింది. ఆ రాత్రి - విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి - సన్యాసి తపస్సు చేసుకునే స్థలం చేరుకున్నాడు. "ఆ మర్రిచెట్టు ఎక్కడుందో... నేనేం చెయ్యాలో చెప్పండి" అని అడిగాడు. విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన ఆ సన్యాసి - యిలా చెప్పాడు. "ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షముంది. దానికి వేలాడే శవాన్ని నువ్వు యిక్కడికి తేవాలి. శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు - ఆ శవం నిన్ను పలకరిస్తుంది. మాటలాడించబోతుంది-" "శవం మాట్లాడడమా!" ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు.
"అది మామూలు శవం కాదు. ఆ చెట్టుమీద భేతాళుడుంటాడు. నువ్వు శవాన్ని భుజానికెత్తుకోగానే ఆ భేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు. ఆ భేతాళుడు నిన్నేవేవో ప్రశ్నలు వేస్తాడు. వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు. నువ్వు మాట్లాడావో... నోరువిప్పావో... శవమూ శవంలోని భేతాళుడూ వెనక్కిపారిపోతారు. ఆ భేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలగజేస్తున్నాడు. వాడిని నెత్తిమీద పెట్టుకుని నిశ్శబ్దంగా... మౌనంగా... యిక్కడికి తెచ్చావో - యిక నా కార్యానికి విఘ్నాలు కలిగించగలిగేవారెవరూ ఉండరు” “సరే” అని మర్రిచెట్టు వేపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు.
చీకటి...జడలు విరబోసుకున్న దెయ్యాల్లా చెట్లు గాలికి ఊగుతూ...
గుండెలు జలదరింపజేసేలా ఏవేవో పక్షుల కూతలూ జంతువుల అరుపులూ వేటికీ వెరవకుండా మర్రిచెట్టుని చేరుకున్నాడు తను. అక్కడి వాతావరణం మరీ భయంకరంగా ఉంది. నేలమీద మానవ కపాలాలు. స్వేచ్ఛగా తిరుగాడుతున్న భయంకర సర్పాలూ. ఎక్కడి నుంచో నక్కల ఊళలు. తోడేళ్ల అరుపులు.... గుడ్లగూబల నవ్వులు. వేటినీ లెక్కచెయ్యకుండా మొలలో కత్తితో - మర్రి చెట్టు వేపు చూశాడు రాజు. మర్రి చెట్టు మహావికృతంగా ఉంది దాని కొమ్మకి శవం వేలాడుతోంది.
అతను చెట్టెక్కాడు. శవానికి కట్టిన తాళ్లని కత్తితో ఛేదించాడు. అంతే ఆ తాళ్లు తెగడమేమిటి, శవం మాట్లాడడం మొదలు పెట్టింది. దానిని పట్టకోబోతే అది యథాస్థానానికి పోతూంది. ఓహో! ఈ శవ శరీరంలో భేతాళుడున్నాడన్న మాట! - అనుకుని విక్రమార్కుడు శవానికున్న తాళ్లని కోస్తూనే దానిని గట్టిగా పట్టుకుని నెత్తిమీద పెట్టుకుని బంధించి.... చెట్టుదిగి... మౌనంగా నడవసాగాడు. అప్పుడు- "రాజా!" పిలిచాడు భేతాళుడు - శవంలోంచి.
No comments:
Post a Comment