Saturday 19 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 256 వ భాగం



అయ్యవారు లింగాలనిస్తే అమ్మవారు ఊరుకొంటుందా? ఆమె ఒక తాళపత్ర సంపుటినిచ్చింది. అదే దేవీ స్తోత్రాలలో మకుటాయమానంగా ఉండే సౌందర్యలహరి, మార్కండేయ సంహితలో సౌందర్య సారమని ఉంది. ఆనంద గిరియం, దానిని అంబికాస్తవ సారం అన్నది. జగత్తును అనుగ్రహించడానికని = జగత్యను గ్రహాయ.


సౌందర్యలహరి యనగా సౌందర్యం యొక్క తరంగాలు. ఆమె సౌందర్య సముద్రం, స్తోత్రంలోని ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క తరంగంలా ఉంటుంది.


ఆమెకనేక నామాలున్నాయి. ఇందు సుందరిగానూ నుతింపబడింది. సుందరీ విద్యకు ఆమె అధిష్ఠాత్రి. ఇది దశమహావిద్యలలో ఒకటి. దీనినే శ్రీవిద్యయని అంటారు. ఈమెయే త్రిపుర సుందరి. మూడు భువనాలలోనూ ఇంతకుమించిన అందగత్తె లేదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో జ్ఞానానికి, దయకు నిలయమై అందమైన తల్లిగా అనగా త్రిపుర సుందరియైనది. ఆమె లలితాంబ.


శ్రీ చక్రాన్ని పూజ చేసేటపుడు చంద్రమౌళీశ్వరునకు శక్తిగా త్రిపుర సుందరిని ధ్యానిస్తాం. ఈమెకు చంద్రునితో సంబంధం ఉంది. పూర్ణ చంద్రుడు ఆయన నెత్తిపైనుండగా అందు మధ్యలో ఈమె యుంటుంది. "చంద్రమండల మధ్యగా" అని లలితా సహస్రనామాలలో ఒక నామం. ఈమెకు ప్రత్యేకమైన తిథి, పూర్ణిమయే. సాధన యొక్క చివరి దశలో చంద్రుని మాదిరిగా మన నెత్తిపై అమృతాన్ని కురిపిస్తుంది.


ఆ దివ్యదంపతులు, మధ్యాహ్నంలో తాపంతో బాధపడేవారికి అమృత కిరణాలను ప్రసరింపజేసి చల్లదనాన్ని కురిపిస్తారు. ఆయన చంద్రమౌళి, ఈమె త్రిపుర సుందరి. ఈమె నెత్తిపై చంద్రుడుంటాడు. లలితా సహస్రనామాలలో “చారు చంద్ర కళాధరా” అని యుంది.


No comments:

Post a Comment