ఈశ్వర లింగం ('బాణం') నర్మదలో లభిస్తుంది. నర్మద, భారతదేశం మధ్యలో ప్రవహిస్తుంది. అది ప్రపంచానికే గుండె వంటిది. అక్కడ సహజంగా ఈశ్వరుడు లింగాకారంలో ఉంటాడు. అందువల్ల ఈశ్వరుణ్ణి మధ్యలో ఉంచి శంకరులు పూజించారేమో!
కాని మా మఠంలోని చంద్రమౌళీశ్వరుడు బాణం కాదు, స్ఫటిక లింగమే. ఆ కథ తరువాత చెబుతా.
ఇట్లా నేపాల్ నుండి, తంజావూర్ వరకూ దొరికిన శిలలను దేవతామూర్తులుగా భావించి యావద్భారతాన్ని మన ఇంటికే తెచ్చినట్లయింది. భారతదేశం మధ్యలోనున్న బాణలింగం, నాల్గు దిక్కులా జ్యోతిర్లింగా కారంలో ఉన్నాడు. సోమనాథ్, శ్రీశైలం, ఉజ్జయిని, ఓంకారం, మాంధాత (నర్మదా నదీతీరంలో) పర్లి, నాగేశం, కాశి, భీమ శంకరం, రామేశ్వరం, త్య్రంబకం (నాసిక్ దగ్గర), కేదార్ నాథ్, ఘుశ్మేశ్వర్ (ఎల్లోరా)లలోని 12 క్షేత్రాలలో ఈశ్వరుడు జ్యోతిర్లింగాకారంలో ఉంటాడు. శంకరులు జ్యోతిర్లింగాలను అన్నిటినీ దర్శించి ఒక్కొక్క లింగానికి ఒక్కో స్తోత్రం చేసారు. అది మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం అని ప్రసిద్ది. ఇట్లా నలుమూలలా భక్తిరస ప్రవాహంతో ముంచెత్తారు.
అందర్నీ, అద్వైతులుగా కేవలం తీర్చిదిద్దలేదని, అందరినీ పంచాయతన పూజా పరాయణులుగా తీర్చిదిద్దారని ఒక చక్కని మాట ఆనందగిరీయంలో ఉంది.
వీటితో నిత్య కర్మల ఆవశ్యకతను బోధించారు. శ్రౌత స్మార్త కర్మలకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఇట్లా కర్మ, భక్తులలో ఆరితేరితే జ్ఞాన మార్గంలోకి అడుగు పెట్టడానికి అవకాశం వస్తుందని, బోధించారు. స్వధర్మకర్మయే ఈశ్వరునికి పూజ చేయడం, ఈశ్వరార్పణ చేయడం. సోపాన పంచకంలో 'కర్మ స్వనుష్ఠీ యతాం' అని చెప్పి వెంటనే 'తేనేశస్య విధీయతామపచితిః' = ఈ కర్మాచరణమే ఈశ్వర పూజయగుగాక అని చెప్పారు. ఇదే నిష్కామ కర్మ యోగం. ఇందు కర్మఫలాలు ఈశ్వరునకు అర్పింపబడతాయి. అతడు ఫలదాత. అందువల్లనే 'పరమేశ్వర ప్రీత్యర్థం', 'జనార్దనః ప్రీయతాం' అనే మాటలను ప్రతికర్మ చివరా అంటున్నాం.
No comments:
Post a Comment