Sunday, 6 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 243 వ భాగం

 


ఇట్లా రెండూ అనడం, అనగా మొదట్లో ఈశ్వరుడు, తరువాత జనార్దనుడని అనడం వల్ల శివవిష్ణు భేదాన్ని తొలగించినట్లే కదా! పరమేశ్వర ప్రీత్యర్ధం అనే సంకల్పం శంకరులనుండే మొదలైందని లోగడ ఉపన్యాసాలలో చెప్పాను.

 

అన్ని స్థాయిలలో అందరికీ జగద్గురుత్వం

 

వీరిని 'అద్వైత జ్ఞాన మార్గాచార్య' అని అంటూ ఉంటారు. అది సరికాదు. ఇది కేవలం నివృత్తి మార్గంలో ఉన్నవారికే. అందరూ అట్లా ఉండలేరు. సామాన్యులందరికీ కర్మ, భక్తులను బోధించి చివరకు జ్ఞానమార్గాన్ని చేరుకోవాలన్నారు. మిగిలిన సిద్ధాంతులకు వీరికీ గల తేడాను గమనించండి. మిగిలినవారు, తమ సిద్ధాంతాలను ప్రచారం చేసారే గాని, సామాన్య" జనులందరికీ ఉపయోగించే ప్రక్రియను చూపలేదు. కాని సామాన్య జనులనుద్దేశించి అనేక మార్గాలను అందించారు శంకరులు,

 

వీరందరికీ చెందినవారు. కేవలం విద్వాంసులకే పరిమితులు కారు. అన్ని మార్గాలలోనూ ఒక్కొక్క దశలో పయనించాలని, అద్వైతమనే గమ్యాన్ని మరువకూడదని అన్నారు. అన్ని మార్గాలకు వేద శాస్త్రానుగుణంగానే ఉండేటట్లు తీర్చిదిద్దారు.

 

మతాలపై సంక్షిప్త వివరణ

 

ఆత్మ, పునర్జన్మ, స్వర్గం, మోక్షం వంటివి వట్టి మాటలని జీవితాన్ని సుఖంగా అనుభవించడమే లక్ష్యంగా చెప్పింది చార్వాక మతం. భౌతిక వాదం, ఆధ్యాత్మికవాదం అనే మాటలు వట్టివని, అంతా కల్పనయని, అంతా శూన్యమని చెప్పేది బౌద్ధం.

No comments:

Post a Comment