కంచిలోని పూజా పద్ధతులను సంస్కరించారు. ఉగ్రరూపంలో నున్న అమ్మవారిని రాజరాజేశ్వరిగా తీర్చిదిద్దారు. వినాయకుని ఆలయం, ముక్తి మంటపం కాశీలో ఉన్నట్లు ఇక్కడా ఉంటాయి. విష్ణు కంచిలోని వరద రాజస్వామి ఆలయంలోని పూజాపద్దతిని సంస్కరించారు. దానికి పడమరగా మా మఠం ఉంది.
వారక్కడ ఉండగా, అందరి క్షేమాన్ని కోరి అక్కడి రాజుతో కాంచీపురం శ్రీ చక్రాకారంగా నిర్మించాలని, అందు బిందుస్థానంలో కామాక్షి ఆలయం ఉండేటట్లు పట్టణాన్ని నిర్మించాలని చెప్పారట. ఆ రాజు, రాజసేనుడు అనే చోళరాజు.
శ్రీ చక్రాకారంగానే ఉంటుంది కంచి. ఎందుకిట్లా చేసారు? ఎన్నో దేవతామూర్తులున్నా ఇది ప్రధానంగా దేవీ క్షేత్రమే. శక్తిపీఠాలు 3,18,36, 51, 56, 64, 96, 108, 6400 సంఖ్యలో ఉన్నాయని అంటారు. ఇందు ప్రధానంగా కంచి పేర్కొనబడింది. ఇది అమ్మవారి నాభి పడినచోటు. ఇది నాభిపీఠం, నాభి శరీరం మధ్యలోనే ఉంటుంది. అట్లాగే కంచి ప్రపంచానికే నాభి వంటిది. కాంచి యనగా మొలనూలు. అదే ఒడ్డాణం. ఇది నాభికి కవచంలా ఉంటుంది. ఇట్లా మేరుతంత్రం, కామాక్షీ విలాసం, కంచి మాహాత్యం చెప్పాయి. కంచి కామాక్షి జనరేటర్ వంటిది. అన్ని బల్బులు వెలగడానికి ఈమెయే కారణం. ఇది తెలివిడి చేయడం కోసం కంచి ప్రాంతంలో 50 శివాలయాలున్నా అమ్మవారి మూర్తి అక్కడ ఉండదు. సుందరేశ్వర ఆయలంలో మీనాక్షి; జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి; కపాలీశ్వర కోవెలలో కర్బగ అంబాళ్ ఉంటారు కాని, కామాక్షి ఆలయంలో ఈశ్వరుడుండడు. నాల్గు వైపులా గోపురముంటుంది. నాల్గువైపులా రాజవీధి యుంది. ఇట్టి గౌరవం, ఏకామ్రనాథునికి గాని, వరద రాజస్వామికి గాని లేదు.
శ్రీ విద్యా శాస్త్రంలో చెప్పబడినట్లుగా నాల్గు చేతులలో ధనుస్సు, అంకుశం, పాశంతో ఉంటుంది. తానిచ్చిన విద్యా శాస్త్రాన్ని, సౌందర్య లహరిగా అందించారు శంకరులు. ఇట్లా అన్ని కారణాల వల్ల ఇది శంకరులకు ప్రధాన కేంద్రమైంది.
No comments:
Post a Comment