Saturday, 26 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 263 వ భాగం



(నవ్వుతూ ఇట్లా అన్నారు స్వామి ఇదేమిటి? నిష్క్రియత్వాన్ని బోధించే అద్వైతమెక్కడ? క్రియాశక్తి స్వరూపమైన అమ్మవారెక్కడ? క్రియారహితురాలై, క్రియతో కూడినట్లుగా ఉంటుంది. శంభువుని నిష్క్రియుని శంకరునిగా మార్చి క్రియాసహితునిగా చేసింది. పరబ్రహ్మము, అవతారంగా వస్తే పరాశక్తినుండే శక్తిని పొంది నిర్వహిస్తాడు. ఇట్లా చేయడానికి ఆమె దయయే కారణం. జీవుణ్ణి స్వస్వరూపునిగా తెలిసికొనేటట్లు చేసేది ఆమెయే, అద్వైత మోక్షాన్ని ఇచ్చేది ఆమెయే. ఆమెయే జ్ఞాన దాత్రియని శంకరులకు తెలుసు.


శ్రీవిద్య, బ్రహ్మవిద్య రెండూ అద్వైతానికి దారి చూపించేవే. శివ శక్తుల సమ్మేళనాన్ని ప్రతిపాదించేవే. జ్ఞాన మార్గానికి దారి చూపిన శంకరులే ఉపాసన మార్గం యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించారు.


శివశక్తుల సమ్మేళనాన్ని గుర్తించే మఠాలలో చంద్ర మౌళీశ్వర అర్చనతో బాటు శక్తిపీఠాల అర్చన కూడా ఉంటుంది. కంచిలో కామాక్షి పీఠం; ద్వారకలో భద్రకాళి పీఠం, పూరీలో విమలాపీఠం, శృంగేరీలో శారదాపీఠం, బదరిలో పూర్ణగిరి పీఠాలున్నాయి.


అమ్మవారు, గర్భగృహంలో గుహలో, ఒక బిలాలయంలో ఉన్నట్లుంటుంది. ఆమె దగ్గర శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి ఉగ్రకళను బంధించి, సౌమ్యమూర్తిగా, ఆమెను తీర్చిదిద్దారు. గురు రహస్యంలో ఇట్లా శంకరులు చేసారని ఉండగా, మాకు పుణ్యం అయ్యేటట్లు చేసారని గురు రత్నమాలలో ఉంది:


"ప్రకృతించ గుహాశ్రయాం మహోగ్రాం 

స్వకృతే చక్రవరే ప్రవేశ్య యోఽగ్రే 

అకృతాశ్రిత సౌమ్యమూర్తిం ఆర్యాం 

సుకృతం నః సచినోతు శంకరార్యః 


అమ్మవారి ఎదురుగా ఇట్టి యంత్ర ప్రతిష్ఠ చేసినట్లు చిద్విలాసీయంలో ఉంది.


'కామాఖ్యా పురతో దేశ శ్రీచక్రం స్వయమాలిఖతో' ఆనంద గిరియంలోనూ అట్లాగే ఉంది. ఇట్లా కామకోటి పీఠాన్ని ఉజ్జలంగానే చేసారు. వీరి శిష్యులు నలుమూలలా పర్యటించి గురువులందించిన షణ్మతాలను వైదిక పద్ధతిలో కొనసాగేటట్లు చేసారు.


No comments:

Post a Comment