కంచిలో శంకరులు
అన్ని పుస్తకాలూ, కంచిలో శంకరులున్నట్లు పేర్కొన్నాయి. ఆనంద గిరియం, గురువంశ కావ్యం (శృంగేరి) లో కంచినుండే ఆర్గురు శిష్యులను పంపారని, షణ్మతాలను స్థాపించారని ఉంది. ఇక శంకరాభ్యుదయం, గోవింద నాధీయం, చిద్విలాసీయం, గురురత్న మాల గ్రంథాలు శంకరులిక్కడ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారని పేర్కొన్నాయి. బృహత్ శంకర, ప్రాచీన శంకర విజయాలను బట్టి జ్ఞాన పీఠం కాశ్మీరులో ఉంది. అయినా వారి జీవిత విశేషాలను బట్టి చూస్తే కొంతకాలం కంచిలో గడిపినట్లుంది. అసలు కంచినే కాశ్మీరమంటారని గోవిందనాధీయంలో ఉంది.
శివరహస్యం, మార్కండేయ సంహితలు ఇతిహాస పురాణాల వంటివి. వాటిల్లోను, కొన్ని శంకర విజయాలలోనూ కంచిలోనే వీరు తమ అవతారాన్ని చాలించారని చెప్పబడింది. కొన్ని పుస్తకాలలో కేదారనాథ్ లో లేక బదరీ నాథ్ లో అవతారం చాలించారు అని ఉంది.
వీటికి ఏకవాక్యత తీసుకొని రావడం కష్టం. వారేమీ స్వీయ చరిత్ర వ్రాయలేదు. తరువాత వచ్చినవారు అనేకాధారాలననుసరించి వ్రాసేరు. ప్రధానంగా చెప్పవలసిందేమిటంటే మనం వారి భక్తులం, శిష్యులం, పిల్లలం అని భావిస్తే చాలు. మనలో అణుమాత్రం ఎవరిపట్లా శత్రుత్వం లేకుండా అందరిపట్లా ప్రేమ, భక్తి ఉంటే చాలు. ఇక ఎట్టి పరిశోధన చేసినా అంతా దండుగే. సిద్ధ పురుషులు రెండు మూడు స్థలాలలో సిద్ధి పొందునట్లు కథలున్నాయి.
No comments:
Post a Comment