Friday 11 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 248 వ భాగం



ఎందుకిట్లా చెబుతున్నానంటే అద్వైతి అట్టి పని చేయడు. విద్యారణ్య, అప్పయ్య దీక్షిత, వాచస్పతి మిశ్ర వంటివారు అద్వైత దిగ్ధంతులు. అయినా వారికి భిన్నమైన సిద్ధాంతాలపై వ్యాఖ్యలు వ్రాసేరు. ఇది స్పష్టాతి స్పష్టం. మరొక చిత్రమేమిటంటే అద్వైతులు కానివారు, భక్త్యావేశంలో అద్వైత సత్యాలను అప్రయత్నంగా పలికారు. బౌద్ధిక స్థాయిలోనే వారు అద్వైతాన్ని ఎదుర్కొన్నారు.


కవులు, రచయితలే కాదు, ఆధునిక కాలానికి చెందిన ఐన్స్టీన్, సర్ జేమ్సు జీన్సు వంటివారి రచనలలో అద్వైత వాసనయే కనబడుతుంది. ఒకే శక్తి, భిన్న పదార్థాలుగా కన్పిస్తోందని అనలేదా? శక్తికి, ద్రవ్యానికి అభేదాన్ని ప్రతిపాదించారు కదా. సాపేక్షిక సత్యం అని సైన్సు అనగా అద్వైతులు దానిని ప్రాతిభాసిక సత్యమన్నారు. అన్ని మతాల సారాంశమైన అద్వైతాన్ని అందించారు. మతానికి విరుద్ధం అనబడే సైన్సులోనూ అద్వైత సత్యం ఉంది. శంకరులంటేనే ప్రేమ, అనురాగం, సంతోషం. ఇట్లా జగత్తునకు అన్నిటినీ సమకూర్చారు. అందరినీ ప్రేమతో బంధించారు. వీరిపై ఏవో పరిశోధనలు చేసి ఆ పేరుతో ఏదో వ్రాయడం కంటె వీరి సమన్వయ ధోరణిని గుర్తించండి. మనమూ వారి సిద్ధాంతానుగుణంగా పరస్పరం ప్రేమించుకుంటే ఇంక కావలసినది ఏముంది?


శంకర మఠాలు


సిద్ధాంతాలు కలకాలం ఉండాలని మఠాలను స్థాపించారు. శిష్యులనందుంచారు. ఇవి అద్వైత సిద్ధాంతాన్ని మాత్రమే బోధించేవి కావు. సిద్ధాంత ప్రచారానికి ప్రత్యేక వ్యక్తులుంటారు. సామాన్య ప్రజలలో కర్మానుష్టానం, భక్తి, వేద శాస్త్రాలపై విశ్వాసం, శాస్త్ర సందేహాలను నివారించుట మొదలైన పనులుంటాయి.


ప్రసిద్ధమైన ఐదు మఠాలనే కాక ఎన్నిటినో స్థాపించి యుంటారు. విదేశీయుల దండయాత్రలలో అవి నేలమట్టమై పోయి ఉండవచ్చు. కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని ఎన్నిసార్లు కూలగొట్టారు? ఎన్నిసార్లు మన వాళ్ళు పునరుద్ధరించారో తెలుసు కదా. అట్లాగే అయోధ్య, మధురలలో కూడా జరిగింది.


అట్లా ఎన్నో మఠాలు నేడు కనబడడం లేదు. మొత్తం దేశంలో ఐదు మఠాలున్నట్లుగా కాశీలోనే ఐదు మఠాలు, త్రిచూర్ లో ఐదూ ఉన్నాయి. గత శతాబ్దంలో ఇంద్ర పరంపరంలో ఉండే స్వాములు కాశీలో ఉండేవారు. శివాలయ ఘాట్ లోని బ్రహ్మేంద్ర మఠంలోని శాసనంతో వీరి ప్రస్తావన ఉంది. చంద్రశేఖర స్వామి యొక్క శిష్యుడైన విశ్వనాథ స్వామి గురించి యంది.


No comments:

Post a Comment