Wednesday 2 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 239 వ భాగం



మాకేమీ 6,000 మంది శిష్యులు లేరు. మేమూ తిరుగుతున్నాం. ఏదో ఒక మహాశక్తి, అందర్నీ నడిపించునట్లుగా మేమూ ధర్మప్రచారం చేస్తున్నాం. అయినా గట్టిగా చెప్పలేకపోతున్నాం. మమ్మల్ని చూసి విశాల దృక్పథం కలవారని మీరు పొగుడుతున్నారు.


ఈనాడు, చాలా కొద్ది సంవత్సరాలలోనే ఎంతో మార్పు వచ్చింది. ఆచారాలు సన్నగిల్లుతున్నాయి. పద్ధతి మార్చుకోండని చెప్పలేక పోతున్నాం. వారు శాస్త్ర ప్రకారం పాటిస్తూ భిక్ష, పూజలకై ప్రాకులాడకుండా శాస్త్ర విరుద్ధమైన ప్రదేశాలకు కూడా వెళ్ళి వాదించి, శత్రువులను మిత్రులుగా చేసుకొని, కొందరిని శిష్యులుగా తీర్చిదిద్ది, జగత్తునంతా ఒక కుటుంబంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు.


శాస్త్రజ్ఞులతోనే చర్చలు. వారి సంఘసేవ విస్తృతమైనది. నరబలులిచ్చే వారిని, శరీరంపై తప్తముద్రలు వేసుకునేవారినీ సంస్కరించారు.


ఉగ్రమూర్తులను సౌమ్యమూర్తులుగా మార్చుట


ప్రజలలో క్రూర మార్గాలను మాన్పించడమే కాదు, ఉగ్రరూపంలో నున్న దేవతా మూర్తులను కూడా సౌమ్యమూర్తులుగా తీర్చిదిద్దారు. ఆనాడేమి జరిగింది? ప్రజలు ధర్మమార్గాన్ని విడిచి పెట్టారని, ఆసత్ ప్రవర్తనతో ఉన్నారని ఆలయాలలోని దేవతామూర్తులు కోపగించాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇట్లా జరిగింది. దయ చూపించే అమ్మవారే ఉగ్ర స్వరూపురాలైంది. శంకరుల గొప్పదనాన్ని చూపడం కోసం అవి ఉగ్రరూపాన్ని ధరించాయా? కాదు. కాని మంత్ర శాస్త్ర మహిమను లోకానికి చాటాలని అనేక యంత్రాలను స్థాపించి సౌమ్య మూర్తులుగా వారిని తీర్చిదిద్దారు.


No comments:

Post a Comment