Saturday 12 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 249 వ భాగం



కాశీలో సుమేరు మఠమని, పాదుకా మఠమని ఉన్నాయి. వీటిని పునరుద్ధరించాలని చాలామంది స్వాములు, పండితులు విజ్ఞప్తి చేస్తూ కాశీలో శంకరులు కొంతకాలం ఇక్కడ ఉన్నారని చెప్పబడింది.


గత శతాబ్దంలో ప్రచురింపబడిన Light of the East సంపుటాలలోని ఒక సంపుటంలో శంకరులు జ్యోతిర్మఠమే కాక, గంగోత్రిలోనూ ఒక మఠాన్ని స్థాపించినట్లుంది. గోరఖ్ పూర్లోని గీతా ప్రెస్ వారు ప్రకటించిన తీర్ధాంక్ లోని ఉపోద్ఘాతంలో గంగోత్రి మఠం, సుమేరు మఠాల గురించి యుంది.


త్రిచూర్లో ఐదు శంకర మఠాలున్నట్లు కొచ్చిన్ స్టేట్ మాన్యువల్ అనే పుస్తకం ప్రచురించింది. ప్రస్తుతం రెండే ఉన్నాయి. ఇందున్న దక్షిణ మఠంలో ఈ పీఠాన్ని 80 మంది అధిరోహించినట్లుంది. ఉత్తర మఠం, ఈనాడు బ్రహ్మ స్వమఠంగా పిలువబడి, అది వేద పాఠశాలగా మారింది. పూరీ జగన్నాథంలో ప్రధానమైన గోవర్ధన మఠంతో బాటు శంకరానంద మఠం, శివతీర్ధమఠం, గోపాల తీర్ధమఠాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అద్వైత సంప్రదాయానికి చెందినవే.


ఇక విద్యారణ్య స్వామివారు, క్రొత్త మఠాలను స్థాపించారని, పాత వాటిని పునరుద్ధరించారని 'నవమాది నాథులు' అనే బిరుదు వారికి వచ్చిందని కన్నడ ప్రాంతంలో, దానికి చేరువగానున్న తెలుగు ప్రాంతంలో అంటారు. పై తీర్ధాంక్ ని బట్టి కర్ణాటక, ఆంధ్ర, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాలలో 15 మఠాలున్నట్లు తెలుస్తోంది. దాని భూమికలో ఇవే కాకుండా రామేశ్వరం, శ్రీశైలంతో కలిపి 21 మఠాలున్నట్లు తేలింది.

 

పై మఠాలు శంకరుల శిష్యుల పేర్లతో ఉన్నాయి. త్రిచూర్ మఠాలను పద్మపాదుడు, సురేశ్వరాచార్యులు స్థాపించారని అంటారు. జ్యోతిర్మఠానికి అనుబంధంగా శకటపురం మఠాన్ని తోటకాచార్యులు స్థాపించినట్లుంది.


ఇట్లా పరిశోధన చేసినకొలదీ ఎవరే మఠాన్ని స్థాపించారనే విషయం తెలియవచ్చు. అయినా ఇట్టి పరిశోధన, జ్ఞానాన్ని గాని, భక్తిని గాని కలిగించదు. చాలావాటిని శంకరులు స్థాపించి యుండవచ్చు. ఇట్లా శంకరులు లేదా వారి శిష్యులు స్థాపించి యుండవచ్చు.


No comments:

Post a Comment