Wednesday 16 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 253 వ భాగం



తరువాత కాశ్మీరునకు వెళ్ళారు. విద్వాంసుల నోడించారు. అక్కడే శారదా పీఠాన్ని అధిరోహించారు. అక్కడ ఒక విద్వాంసురాలైన యువతికి తలమీద తలపాగా ఉన్నట్లుగా ఉండే ఒక ఆభరణాన్ని బహూకరించారు. దానిని తరంగం అంటారట. ఇప్పటికీ ప్రజల వాడుకలో ఇది ఉంది.


శ్రీనగర్ లో శంకరాచార్య గిరి అనే పర్వతముంది. సుదూరమైన ఉత్తర ప్రాంతంలో వీరికట్టి గౌరవం లభించింది.


బదరి వెళ్ళినపుడు ఒక ముఖ్య సంఘటన జరిగింది. అక్కడ జ్యోతిర్మఠాన్ని స్థాపించారు. అక్కడ బదరీ నారాయణ విగ్రహం, అలకనందలో పడిందని, స్వామియే శంకరులకు కలలో కనబడి చెప్పాడని దానిని వీరు వెలికి తీసి ప్రతిష్ఠించారని అంటారు. అక్కడ వేడి నీటికుండం ఉంది. దానిని తప్త కుండమని అంటారు.


అక్కడ ఎందరో వీరికి పాదాభివందనాలు చేసి జగద్గురువని కీర్తించారు. శంకరులు తమ గురు, పరమ గురువులకు వందనాలను చెయ్యాలని సంకల్పించగానే వారూ వీరిపై అనుగ్రహంతో అక్కడ సాక్షాత్కరించారు. వీరు దక్షిణమూర్తి అష్టకాన్ని చదివి ప్రతి శ్లోకానికి ఒకమారు సాష్టాంగ నమస్కారం వారి గురువులకు చేసారట.


శివ శక్తి దర్శనం -


'మాతా చ పార్వతీ దేవీ! పితాదేవో మహేశ్వరః' అని వీరు వ్రాసేరు. వీరు అవతార పురుషులైనా పిల్లవాని మాదిరిగా ఉండి భక్తిని ప్రదర్శించవద్దా? ఇంతవరకు అర్చామూర్తులను దర్శించారు. ఇపుడు సాక్షాత్తు శివపార్వతుల దర్శనానికి కైలాసానికి యోగశక్తి ద్వారా వెళ్ళినట్లు చెబుతారు.


No comments:

Post a Comment