ఒక ఎర్రని పువ్వును స్ఫటికం దగ్గర పెట్టామనుకోండి. స్ఫటికం, ఎర్రగా కనబడడం లేదా? సత్యమైన వస్తువు లేకుండా ఇట్టి భ్రాంతులు కలగవనే మాటను గుర్తించండి. ఇట్లా బ్రహ్మమునందు ఆరోపింపబడిన జగత్తు అసత్యము. అజ్ఞానంలో దేనిని సత్యమని భావిస్తున్నాడో జ్ఞానం కలిగిన తరువాత అది అసత్యమైపోతుంది. దానిని ప్రాతిభాసిక సత్యమన్నారు. ఎండలో ఆలుచిప్ప వెండిగా కనబడినట్లు, (మనకనుభవంలో ఉన్న సత్యం, కొంతకాలమే ఉంటుంది. అనగా వ్యావహారిక సత్యం, నిత్య సత్యం, పరబ్రహ్మమే. వ్యావహారిక సత్యం ఇళ్ళూ వాకిళ్ళూ వంటివి. కొంతకాలం ఉండి కనుమరుగై పోతుంది).
ఇట్లా భేదాలను వివరించాను. అయితే భిన్న మతాలలోని కొన్ని సూత్రాలను గ్రహించింది అద్వైతం. మీమాంసనుండి కర్మను; బౌద్ధులనుండి జగత్తు యొక్క అసత్యాన్ని; భక్తి సిద్ధాంతాన్ని; అట్లాగే న్యాయ, వైశేషిక, సాంఖ్యయోగాలలోని విషయాలను తగువిధంగా స్వీకరించింది. గీతాభాష్యంలో సాంఖ్యం గురించి చెబుతూ, వారి సిద్ధాంతంతో విభేదించినా వారు చెప్పిన త్రిగుణాల వల్ల (సత్త్వ రజస్తమోగుణాలు) జీవుడు సంతోషిస్తున్నాడనే మాటను స్వీకరిస్తున్నామని అన్నారు. మీమాంసనుండి ఆరు ప్రమాణాలను స్వీకరించింది.
వీరి యోగ తారావళిని చూస్తే, యోగాభ్యాసాన్ని వీరంగీకరించినట్లే. ఇట్లా అన్ని సిద్ధాంతాలూ అద్వైతానికి దోహదం చేసాయి. ఒక దశలో మిగిలిన వారు చెప్పినవి స్వీకరింపదగినవే అని వీరి అభిప్రాయం. వాటిని అనుసరిస్తూ లక్ష్యమైన అద్వైతాన్ని విస్మరించవద్దని అన్నారు. ఇది వీరి నిశ్చితమైన అభిప్రాయం.
అన్ని శాస్త్రాలను పరిశీలించారు. ద్వేషభావాన్ని ప్రకటించలేదు. ఉదాహరణకు, అమరసింహుని కథ చెబుతా. ఇతడు జైనుడు. శంకరుల చేతిలో ఓడిపోయి తాను వ్రాసిన గ్రంథాలను తగుల బెట్టాడు. అరెరె సిద్ధాంతాలను లేకుండా చేయడమేమిటని శంకరులక్కడికి వెళ్ళారు. అతని చేతిలో 'అమరకోశం' ఒక్కటే ఉంది. అది సంస్కృత నిఘంటువు. దీనిని అగ్నిలో వేయకుండా ఆ పుస్తకాన్ని రక్షించగలిగారు.
అయితే వీరు నిర్మూలించిన 72 మతాల గ్రంథాలూ కనబడడం లేదు. వీరికి ముందు వ్రాసిన వారి సూత్ర భాష్యాలూ దొరకడం లేదు. అట్లా అని వాటిని తగుల బెట్టారనే భ్రాంతి పడవద్దు సుమా! పైవారి అనుయాయులే వీరు వచ్చిన తరువాత వాటిని లేకుండా చేసియుండవచ్చు.
No comments:
Post a Comment