Wednesday 9 November 2022

శ్రీ కంచి మహాస్వామివారి శంకర విజయం - 246 వ భాగం



బౌద్ధంలో, మీమాంసలో సగుణ బ్రహ్మమైన ఈశ్వరుడు లేడు; నిర్గుణ బ్రహ్మమూ లేదు. సాంఖ్యంలో సగుణ బ్రహ్మము లేదు. యోగ, న్యాయ, వైశేషికాలలో సగుణ నిర్గుణ బ్రహ్మల ప్రస్తావన యున్నా ఒకదానికి మరొక దానికి సంబంధం చెప్పకుండా, జీవ జగత్తులకు సమన్వయించకుండా ఉంటాయి. భక్తి సిద్ధాంతాలలో కేవలం సగుణ బ్రహ్మయే ఉంటాడు. నిర్గుణ బ్రహ్మము గురించి ఎత్తుకోరు.


అద్వైతంలో రెండూ ఉన్నాయి. మాయ యనగా జడ ప్రకృతి, ప్రపంచాన్ని బ్రహ్మము నాధారంగా చేసుకుని సృష్టిస్తోందని అంటుంది. అనగా నిర్గుణ బ్రహ్మము, సగుణంగా మాయతో మారి జగత్తును చూపిస్తోందని అంటుంది. ఇట్లా నిర్గుణ సగుణ బ్రహ్మలకు, జీవ జగత్తులకు సమన్వయం ఉంటుంది.


ఇక సృష్టి గురించి - జగత్తును, ఈశ్వరుడు సృష్టించడమేమిటి? జగత్తు అనాదిగా ఉందని, కర్మలు చేస్తే ఫలాలు వస్తాయని మీమాంసకులంటారు.


జడ ప్రకృతిలోనున్న సహజ శక్తియే నడిపిస్తోందని చార్వాకులంటారు. ఇక స్వామి లేడు, కర్మలవసరం లేదు. కర్మ ఫలాలూ వట్టిమాటయని అంటారు. న్యాయ వైశేషికాలు జగత్తంతా అణుమయమని, ఈశ్వరుడు వీటిని కలుపుతున్నాడని, క్రొత్త వాటిని సృష్టిస్తున్నాడని అంటాయి. దీనిని ఆరంభ వాదమని అంటారు. సాంఖ్య, యోగాలు, సృష్టికి, ఈశ్వరునకు సంబంధం లేదని కొత్తవాటిని సృష్టించడం అంటూ లేదని అంటాయి. ప్రకృతి (మాయ) ప్రపంచంగా మారిందని దీనిని పరిణామవాదమంటారు.


అద్వైతం ఏమంటుంది? నిజమే లేనిదానిని సృష్టించడం అంటూ ఉండదు. అణువూ సత్యం కాదు, వీటిని కలపడం వల్ల జగత్తు ఏర్పడిందని అనడమూ తప్పే. పరిణమించడం అంటూ లేదు. అదే నిజమైతే మొదటి ప్రకృతి, కనుమరుగు కావాలి కదా! కనుక సృష్టి లేదు, మార్పులేదు. అయితే ఏమిటి? ఒక వస్తువు, మరొక వస్తువుగా అనగా చీకట్లో త్రాడు, పాముగా కనబడడమే జరుగుతోంది. అట్లా బ్రహ్మము, జగత్తుగా కన్పిస్తోంది. దేనివల్ల? మాయవల్ల. మరొక విధంగా చెప్పాలంటే మాయతో కూడిన నిర్గుణ పరబ్రహ్మము, సగుణ బ్రహ్మమై జగత్తుగా కన్పింపచేస్తున్నాడు. చీకట్లో త్రాడు, పాముని సృష్టించలేదు. ఇక త్రాడు, పాముగా మారలేదు. అట్లా జగత్తు సృష్టింపబడలేదు. పరిణామం చెందనూ లేదు. అట్లా కేవలం కన్పిస్తోంది. దీపం తీసుకుని వచ్చినపుడు చీకటి పోతోంది. త్రాడును, పాముగా చూడడమూ పోయింది. అట్లే జ్ఞానం కలిగినపుడు చీకటియనే మాయలేదు. ఇంతకుముందు జగత్తుగా కనబడినది, బ్రహ్మమే అనే అనుభూతి కల్గుతుంది.


సృష్టి లేకుండా, పరిణామం లేకుండా కేవలం ఇట్లా కనబడడాన్ని వివర్త వాదమంటారు.

No comments:

Post a Comment